క్రీడాభూమి

‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్‌కు ఇదేనా నివాళి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్‌ను ఎప్పుడో మరచిపోయన ప్రభుత్వాలకు ఆయన గురించి ఆలోచించే ఓపికగానీ, ఆయన చూపిన మార్గంలో నడవాలన్న ఆలోచనగానీ కనిపించడం లేదు. రియో ఒలింపిక్స్‌లో 118 మందితో కూడిన బృందం వెళితే, కేవలం రెండంటే రెండు పతకాలు దక్కాయంటే మన దేశంలో క్రీడల పతనాన్ని అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిస్థితిని ధ్యాన్ చంద్ ఎన్నడూ ఊహించలేదు. భవిష్యత్ తరాలు ఇలా విఫలమవుతాయని అనుకోలేదు. ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి, హాకీలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశనం చేసిన ఆ అసహాయ యోధుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ధ్యాన్ చంద్ అసాధారణ ప్రతిభా పాటవాలను వివరించడం సూర్యుడ్ని దివిటీతో డూపడమే. 5 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో, బక్కపలచగా ఉండే ధ్యాన్ చంద్ చాలా సాధారణమైన వ్యక్తిగా కనిపించేవాడు. మైదానంలోకి దిగేంత వరకూ ప్రత్యర్థి జట్లు అతని గురించి ఎవరూ పట్టించుకునేవికావు. కానీ, అతను హాకీ స్టిక్ అందుకుంటే బంతి మరొకరికి అందడం అసాధ్యమయ్యేది. ధ్యాన్ చంద్ నుంచి బంతిని లాఘవంగా తప్పించడం అతని సమకాలీల్లోనే ఎంతో మంది హేమాహేమీలకు కూడా సాధ్యమయ్యేది కాదు. 1928 ఆమ్‌స్టెర్‌డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకాలు సాధించడంలో ధ్యాన్ చంద్ పోషించిన పాత్ర అద్వితీయం. 1905 ఆగస్టు 29న అలహాబాద్‌లో జన్మించిన ధ్యాన్ చంద్ తన 74వ ఏట, 1979 డిసెంబర్ 4న మరణించాడు. అతని జయంతి 29 ఆగస్టును భారత ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి తనను తాను గౌరవించుకుంది. అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగు వందలకు పైగా గోల్స్ సాధించాడమే ధ్యాన్ చంద్ సామర్థ్యానికి ప్రతీక. హాకీపై అతనికి ఉన్న పట్టును నిరూపించే సంఘటనలు కోకొల్లలు. ఎన్నో సంఘటనలు అతని ప్రతిభకు, ఆటపట్ల ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయ. ఒకసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ధ్యాన్ చంద్ ఎన్నిపర్యాయాలు ప్రయత్నించినా గోల్ చేయలేకపోయాడు. దీనితో అతనికి గోల్‌పోస్ట్ సైజుపై అనుమానం వచ్చింది. నిర్వాహకులను పిలిచి కొలిపిస్తే, అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉండే గోల్ పోస్టు కంటే అది తక్కువగా ఉన్నట్టు తేలింది. ధ్యాన్ చంద్ ప్రతిభకు, హాకీ మైదానంలో ప్రతి అంశంపైనా అతనికి ఉన్న అవగాహనకు ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్ చంద్ అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. భారత్ తొలి మ్యాచ్ ఆడిన వెంటనే, బెర్లిన్‌లో పోస్టర్లు వెలిశాయి. ధ్యాన్ చంద్ ఆటను చూసేందుకు రావాలంటూ నిర్వాహకులు ప్రకటించగా, ఆతర్వాత భారత్ ఆడే ప్రతి మ్యాచ్‌కీ స్టేడియం ప్రేక్షకులకు కిక్కిరిసిపోయింది. ఇతర దేశాల క్రీడాకారులను మెచ్చుకునే అలవాటు లేని జర్మన్ మీడియా, అక్కడి అభిమానులు కూడా ధ్యాన్ చంద్‌కు దాసోహం కావడం విశేషం. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్ ఆటను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతని లాంటి ఆటగాడు జర్మనీలో ఉండాలని ఉబలాటపడ్డాడు. అతనికి జర్మనీ పౌరసత్వంతోపాటు, ఆర్మీలో కల్నల్ హోదాను ఇస్తానని ప్రతిపాదించాడు. బ్రిటిష్ ఆర్మీలో అప్పటికి కేవలం మేజర్ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ, ధ్యాన్ చంద్ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. ధ్యాన్ చంద్ గొప్ప ఆటగాడేకాదు.. గొప్ప దేశ భక్తుడు కూడా. డబ్బుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న ఈ తరం క్రీడాకారులకు అలాంటి అవకాశం వస్తే ఏం చేసేవారో ఊహించడం కష్టం కాదు. కానీ, ధ్యాన్ చంద్ మాత్రం దేశాన్ని వీడడానికి ససేమిరా అన్నాడు. ఆ ఒలింపిక్స్‌లోనే జర్మనీతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ధ్యాన్ చంద్‌నే ప్రత్యర్థులు లక్ష్యంగా ఎంచుకున్నారు. జర్మనీ గోల్‌కీపర్ టిటో వార్న్‌హోల్జ్ ఉద్దేశపూర్వకంగా అతనిని ఢీ కొన్నాడు. ఈ సంఘటనలో ధ్యాన్ చంద్ రెండు పళ్లు ఊడి కిందపడ్డాయి. అయినప్పటికీ అతను ఆటను మానలేదు. అంతేగాక, గోల్స్ చేయకుండా జర్మనీపై నిరసన ప్రకటించాలని ఆటగాళ్లను కోరాడు. బంతిని గోల్ పోస్టు వరకూ తీసుకెళ్లి, గోల్ చేయకుండానే వెనుదిరగడం ద్వారా జర్మనీపై తనదైన శైలిలో నిరసన తెలిపాడు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆటగాడు అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ క్రీడా రంగంలో కనిపించలేదనడం తప్పుకాదు.
క్రికెట్ ‘లెజెండ్’ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 1935లో భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఓ మ్యాచ్‌ని చూశాడు. ధ్యాన్ చంద్ నైపుణ్యానికి, అతను గోల్స్ చేసే తీరుకు ఫిదా అయ్యాడు. క్రికెట్‌లో పరుగులు సాధిస్తున్నంత సులభంగా ధ్యాన్ చంద్ గోల్స్ చేస్తున్నాడని బ్రాడ్‌మన్ ప్రశంసించాడు. ఆస్ట్రియాలోని వియన్నాలో ఏర్పాటు చేసిన ధ్యాన్ చంద్ విగ్రహానికి నాలుగు చేతులు, నాలుగు బ్యాట్లు ఉంటాయి. అతని ప్రతిభకు వియన్నా అభిమానులు ఈ రకంగా జోహార్లు అర్పించారు. ఇలాంటి అరుదైన సత్కారం, గౌరవం ఎప్పుడూ, మరే క్రీడాకారుడికీ లభించలేదు. ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం హాకీని జాతీయ క్రీడగా గుర్తించలేదని స్పష్టం చేయడం విచారకరం. హాకీ అభివృద్ధికి కృషి చేసి, మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించి పెట్టడమే అతనికి దేశం అర్పించే ఘన నివాళి. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి, అంతర్జాతీయ వేదికలపై జాతీయ పతకాన్ని ఎగరేసినప్పుడే ధ్యాన్ చంద్ ఆత్మకు శాంతి. క్రీడలను పట్టించుకోకుండా, పతనాన్ని అడ్డుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నంత కాలం ధ్యాన్ చంద్ జయంతిని లేదా వర్ధంతికి సమావేశాలు పెట్టి, ఆర్భాటాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్రీడలను గాలికి వదిలేసి జయంతిని క్రీడా దినోత్సవంగా, అవార్డులను ప్రదానం చేయడానికి ముహూర్తంగా పెట్టుకున్నంత మాత్రాన ధ్యాన్ చంద్‌ను గౌరవిస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు. క్రీడా రంగం, ప్రత్యేకించి హాకీలో పూర్వ వైభవాన్ని సంపాదించడానికి పునాదులు వేయడమే ఆ క్రీడా మహనీయుడికి నిజమైన గౌరవం. అసలైన నివాళి.

చిత్రం.. న్యూఢిల్లీలోని హాకీ స్టేడియం ముందు కొలువుతీరిన
ధ్యాన్ చంద్ విగ్రహం