క్రీడాభూమి

కోహ్లీ అగ్రస్థానం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, ఆగస్టు 30: ఐసిసి టి-20 బ్యాట్స్‌మెన్ ర్యాకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ల జాబితాలో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి టాప్- 5లో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఏడోస్థానంలో ఉండిన అశ్విన్ ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకున్నాడు. కాగా, ఇటీవల అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన టి-20 సిరీస్‌లో అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచిన కెఎల్ రాహుల్ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఏకంగా 67 స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, భారత్‌తో సిరీస్‌కు ముందు రెండో స్థానంలో ఉన్న భారత్‌కన్నా ఆరు పాయింట్లు వెనబడి ఉండిన వెస్టిండీస్ ఇప్పుడు కేవలం ఒక పాయింట్ మాత్రమే వెనకబడి ఉంది. భారత్‌కు 126 పాయింట్లు ఉండగా వెస్టిండీస్ 125 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాగా, 132 పాయింట్లతో న్యూజిలాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో భారత్‌తో జరిగిన టి-20 మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లో సెంచరీ చేసిన వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ 288 స్థానాలు ఎగబాకి 51వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ 17వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, బౌలర్లలో గత ఫిబ్రవరిలో కెరీర్‌లో అత్యుత్తమంగా రెండోస్థానానికి చేరుకున్న అశ్విన్ వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 11 పరుగులకే రెండు వికెట్లు సాధించడం ద్వారా తిరిగి టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. కాగా, భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (67), మహమ్మద్ షమీ( 82) కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. కాగా, ఐసిసి వరల్డ్ టి-20 తర్వాత తొలి టి-20 మ్యాచ్ ఆడిన లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా 104వ స్థానంతో తిరిగి ర్యాకింగ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు.

పోరాడి ఓడిన సాకేత్

న్యూయార్క్, ఆగస్టు 30: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్‌డ్రాకు తొలిసారిగా నేరుగా అర్హత సంపాదించిన తెలుగుతేజం సాకేత్ మైనేని తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 49వ ర్యాంక్ ఆటగాడయిన జిరి వెసెలేకు ముచ్చెమటలు పట్టించడమే కాకుండా దాదాపు ఓటమి అంచులదాకా తీసుకెళ్లాడు. అయితే కండరాలు పట్టేయడం కారణంగా చివరికి ఓటమి పాలయ్యాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్ 3 గంటల 47 నిమిషాల పాటు హోరాహోరీ పోరాటం జరిపాడు. తొలి సెట్‌ను టైబ్రేకర్‌దాకా తీసుకెళ్లిన సాకేత్ ఆ సెట్‌ను చేజార్చకున్నప్పటికీ ఆ తర్వాతి రెండు సెట్లను గెలుచుకున్నాడు. అయితే వెసెలే నాలుగో సెట్‌ను 6-2 తేడాతో గెలుచుకోవడంతో ఫలితాన్ని నిర్ణయించడానికి అయిదో సెట్ అనివార్యమైంది. ఆ సెట్‌లో సాకేత్ ప్రారంభంలోనే వెసెలే సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా 3-1 ఆధిక్యతను సాధించి ఆ తర్వాత ఆధిక్యతను 4-2కు పెంచుకున్నాడు. ఈ దశలో కుడి కాలి పిక్క కండరాలు పట్టేయడంతో సాకేత్ చికిత్స తీసుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆ తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకోవడం ద్వారా 5-2 గేములతో తిరుగులేని ఆధిక్యంతో మ్యాచ్‌ని దక్కించుకునే స్థితిలో కనిపించాడు. అక్కడే మ్యాచ్ మలుపుతిరిగింది. నొప్పి తీవ్రం కావడంతో ఆ తర్వాత వరసగా రెండు సార్లు సర్వీస్ కోల్పోవడం ద్వారా సాకేత్ మ్యాచ్‌పై పట్టును కోల్పోయాడు. ఒక దశలో సాకేత్ కదలలేని స్థితిలోకి వచ్చాడు. అదే అతని ఓటమికి కారణమైంది.

రెండో టెస్టులో సఫారీల ఘనవిజయం

సెంచూరియన్, ఆగస్టు 30: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. ఇంతకుముందు డర్బన్‌లో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన దక్షిణాఫ్రికా జట్టు సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన రెండో టెస్టులో 204 పరుగుల తేడాతో కివీస్‌ను మట్టికరిపించి సత్తా చాటుకుంది. 400 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించడంలో మరోసారి ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ (5/33) నిప్పులు చెరిగే బంతులతో విజృంభించి కివీస్‌ను చావుదెబ్బ తీశాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్లలో హెన్రీ నికోల్స్ (76), వాట్లింగ్ (32), సాంట్నర్ (16), డగ్ బ్రాస్‌వెల్ (30), టిమ్ సౌథీ (14) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోవడంతో ఆ జట్టు 195 పరుగులకే కుప్పకూలి 204 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
అంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 481 పరుగుల స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను, 7 వికెట్ల నష్టానికి 132 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్‌ను డిక్లేర్ చేయగా, న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది.