క్రీడాభూమి

రియో వైఫల్యాలపై పోస్ట్‌మార్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలు సాధించినందుకే భుజాలు చరచుకొని, ఏదో అద్భుతాన్ని సాధించామని విర్రవీగాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు తెలిసొచ్చింది. వచ్చే ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకొని క్రీడా రంగ అభివృద్ధికి, ప్రక్షాళనకు టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత క్రీడా మంత్రి విజయ్ గోయల్ రియో వైఫల్యాలపై దృష్టి సారించారు. భారీ బృందాన్ని పంపినా ఎందుకు రెండు పతకాలకే పరిమితం కావాల్సి వచ్చిందనన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. సమగ్ర విచారణను చేపట్టారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: రియో ఒలింపిక్స్‌లో భారత బృందం దారుణ వైఫల్యాలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విచారణను చేపట్టింది. మహిళల బాడ్మింటన్ సింగిల్స్‌లో పివి సింధు రజత పతకాన్ని గెల్చుకోగా, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్‌కు కాంస్య పతకం లభించింది. వీరిద్దరిని మినహాయిస్తే, మిగతావారంతా మూకుమ్మడిగా విఫలంకావడం పట్ల క్రీడా మంత్రిత్వ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 117 మందితో కూడిన భారీ బృందాన్ని పంపినప్పటికీ కేవలం రెండు పతకాలకే పరిమితం కావాల్సి రావడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఫలితం పట్ల అసంతృప్తి చెందినట్టు సమాచారం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరింత ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, ఎక్కువ సంఖ్యలో పతకాలను కొల్లగొట్టడానికి వీలుగా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్న మోదీ నిర్ణయం పలు మార్పులకు తెరతీసింది. ప్రస్తుతం దేశ క్రీడారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై కేంద్ర దృష్టి సారించింది. అందులో భాగంగానే క్రీడా మంత్రి విజయ్ గోయల్ రంగంలోకి దిగారు. రియో వైఫల్యాలపై సమగ్ర విచారణ జరపాలని తన శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ దిశగా చర్యలు కూడా మొదలయ్యాయని క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనను అనుసరించి, రియో ఒలింపిక్స్‌కు వెళ్లిన బృందంలోని ప్రతి ఒక్కరికీ మంత్రి గోయల్ లేఖలు రాశారు. ఒలింపిక్స్ వైఫల్యాలకు కారణాలను వివరించాలని, అదే విధంగా సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే ఇవ్వాలని పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా కలిసిగానీ, మెయిల్ ద్వారాగానీ అభిప్రాయాలను తెలియచేయవచ్చని వివరించారు. భవిష్యత్తులో అత్యుత్తమ అథ్లెట్ల బృందాన్ని పంపి, పతకాలను సాధించాలంటే తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు అడిగారు.
క్రీడాకారుల ప్రతిభాపాటవాలను పెంచడానికి, అత్యుత్తమ ప్రమాణాలను అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహరచనపై క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ముందుగా రియో ఒలింపిక్స్ వైఫల్యాలపై విచారణ మొదలు పెట్టింది. బృందంలోని వారంతా విఫలం కావడానికి గల కారణాలను తెసుకుంటే, వాటిని సరిద్ది, భవిష్యత్తులో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసుకోవడానికి వీలుంటుందని మంత్రి గోయల్ ఆలోచన. అందుకే, ఆయన అథ్లెట్లతోపాటు భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ)కు కూడా లేఖ రాశారు. రియోలో ఎందుకు రాణించలేకపోయామో కారణాలను వివరించాలని కోరారు. రానున్న కాలంలో అడ్డంకులను ఏ విధంగా అధిగమించాలో సూచించాలని ఆ లేఖలో అడిగారు. అదే విధంగా జాతీయ క్రీడా సమాఖ్యలకు కూడా గోయల్ లేఖలు రాసి, సమాచారాన్ని సేకరిస్తున్నారు. రియో ఒలింపిక్స్‌కు అథ్లెట్లతో కలిసి వెళ్లిన అధికారులకు అప్పగించిన బాధ్యతలపైనా ఆయన దృష్టి సారించారు. వారికి అప్పగించిన పనులు ఏమిటి? వాటిని ఎంత వరకూ సమర్థంగా నిర్వహించారు? పొరపాట్లు ఎక్కడ చోటు చేసుకున్నాయి? వాటిని సరిదిద్దే మార్గాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలను రాబట్టే ప్రయత్నంలో పడ్డారు. ఇలావుంటే, క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు త్వరలోనే భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను విశే్లషిస్తారు. గోయల్ స్వయంగా కొన్ని కీలక కేంద్రాలకు వెళతారు. ఈనెల 17న హైదరాబాద్‌లోని గోపీచంద్ బాడ్మింటన్ అకాడెమీకి వెళ్లి, అక్కడ క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సిబ్బందిని కలుస్తారు. అదే విధంగా హైదరాబాద్‌లోని సాయ్ కేంద్రాన్ని కూడా మంత్రి సందర్శిస్తారు. మొత్తం మీద రియో వైఫల్యాలపై కేంద్రం సీరియస్‌గానే ఉంది. పొరపాట్లకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసి, పకడ్బందిగా అమలు చేస్తేగానీ భారత క్రీడా రంగం మెరుగుపడదు.

చిత్రం.. విజయ్ గోయల్