క్రీడాభూమి

రియో పారాలింపిక్స్ తంగవేలు గోల్డెన్ జంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 10: పారాలింపిక్స్‌లో భారత్ బోణీ చేసింది. మరియప్పన్ తంగవేలు పురుషుల టి-42 హైజంప్ విభాగంలో స్వర్ణ పతకాన్ని అందించాడు. అతను 1.89 మీటర్ల ఎత్తును పూర్తి చేసి, అగ్రస్థానంలో నిలవగా, వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఇదే ఎత్తుతో వరుణ్‌తో సమానంగా నిలిచినప్పటికీ, వైకల్యం స్థాయి వంటి సాంకేతిక అంశాల ఆధారంగా అమెరికా అథ్లెట్ సామ్ గ్రెవెకు రజత పతకాన్ని ప్రకటించారు. కాగా, పతకం సాధించే సత్తా ఉన్న మరో భారత అథ్లెట్ శరద్ కుమార్ నిరాశ పరిచాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో వరుసగా 1.55 మీటర్లు, 1.60 మీటర్లను పూర్తి చేసిన అతను అన్ని అవకాశాలు ముగిసే సమయానికి అత్యుత్తమంగా 1.77 మీటర్ల ఎత్తును పూర్తి చేసి ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. మొత్తం 12 మంది పారా అథ్లెట్లు తమతమ మొదటి ఎనిమిది ప్రయత్నాల్లో కనీసం 1.74 మీటర్ల ఎత్తుకు ఎగరగలగడంతో పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా, తంగవేలు తన పదో ప్రయత్నంలో 1.77 మీటర్లను విజయవంతంగా పూర్తిచేశాడు. మన దేశానికే చెందిన శరద్ కుమార్, పోలాండ్ అథ్లెట్ లుకాజ్ మంజాజ్, చైనా జంపర్ జియాంగ్ జింగ్ కూడా ఇదే ప్రమాణాన్ని అందుకోవడంతో విజేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అనంతరం కొనసాగిన పోటీల్లో ఒకొక్కరిగా అథ్లెట్లు నిష్క్రమించగా, చివరిగా ముగ్గురి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. తంగవేలు 1.89 మీటర్లు, వరుణ్ 1.86 మీటర్లు జంప్ చేయడంతో స్వర్ణ, రజత పతకాలు భారత్‌కే ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, అమెరికా అథ్లెట్ గ్రెవె 1.86 మీటర్లే జంప్ చేసినా, సాంకేతిక అంశాల కారణంగా రజత పతకాన్ని ఎగరేసుకుపోయాడు. వరుణ్‌కు కాంస్య పతకం దక్కింది.

చిత్రాలు.. భారత పతాకంతో విక్టరీ ల్యాప్‌లో పాల్గొన్న హైజంపర్లు
మరియప్పన్ తంగవేలు (స్వర్ణం/ ఎడమ), వరుణ్ భాటి (కాంస్యం).
(ఇన్‌సెట్‌లో) తంగవేలు గోల్డెన్ జంప్