క్రీడాభూమి

వారెవా వావ్రిన్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 12: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌కు యుఎస్ ఓఫెన్ గ్రాండ్ శ్లామ్ ఫైనల్‌లో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కా 6-7, 6-4, 7-5, 6-3 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న వావ్రిన్కాకు కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్. యుఎస్ ఓపెన్‌లో మొదటిది. అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ, టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ముద్ర వేయించుకున్న జొకోవిచ్‌కు వావ్రిన్కా మొదటి నుంచి చివరి వరకూ గట్టిపోటీనిచ్చాడు. ఎవరూ ఊహించని రీతిలో విజయభేరి మోగించాడు. జొకోవిచ్ పదేపదే చేసిన పొరపాట్లు కూడా వావ్రిన్కాకు లాభించాయి. 29 ఏళ్ల సెర్బియా వీరుడు జొకోవిచ్ 17 బ్రేక్ పాయింట్లలో కేవలం మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. వావ్రిన్కా 51 అవాంఛిత పొరపాట్లు చేశాడు. అయితే, జొకోవిచ్ అతనితో పోటీపడుతూ 46 పొరపాట్లు చేసి, ఓటమిని కొనితెచ్చుకున్నాడు. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్, నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెల్చుకున్న వావ్రిన్కా మూడోసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాడు. ఈ మూడు పర్యాయాలు అతను జొకోవిచ్‌ని ఓడించడం గమనార్హం. ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్ సాధించినప్పుడు జొకోవిచ్‌ని క్వార్టర్ ఫైనల్స్‌లో చిత్తుచేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ పోరులోనే తలపడ్డాడు. అక్కడ జొకోవిచ్‌ను రన్నరప్ ట్రోఫీకి పరిమితం చేసిన వావ్రిన్కా ఇప్పుడు మరోసారి అతనిని అదే స్థానంలోకి నెట్టాడు.
దూకుడే ఆయుధం!
జొకోవిచ్ ఆట తీరు వావ్రిన్కాకు బాగా తెలుసు. ఫామ్‌లోకి వస్తే అతను ఏ స్థాయిలో విజృంభిస్తాడో కూడా తెలుసు. అతనిని ఆత్మరక్షణలోకి నెట్టాలంటే దూకుడుగా ఆడడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయానికి వచ్చిన వావ్రిన్కా అదే సూత్రాన్ని అమలు చేశాడు. మొదటి సెట్‌ను కోల్పోయినప్పుడు కూడా అతను ఏమాత్రం వెనుకంజ వేయకుండా జొకోవిచ్‌పై ముమ్మర దాడులను కొనసాగించాడు. ఆ వ్యూహమే ఫలించింది. వావ్రిన్కా నుంచి ఈ స్థాయి విజృంభణను ఊహించని జొకోవిచ్ తన ప్రమేయం లేకుండానే ఆత్మరక్షణలోకి పడిపోయాడు. ఆతర్వాత తేలుకోవడం అతనికి సాధ్యం కాలేదు. వావ్రిన్కాపై 19 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసిన జొకోవిచ్ ఐదోసారి పరాజయాన్ని చవిచూశాడు.
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించిన ఎక్కువ వయసుగల ఆటగాళ్ల జాబితాలో వావ్రిన్కా చేరాడు. 46 ఏళ్ల క్రితం, 1970లో కెన్ రోజ్‌వెల్ యుఎస్ ఓపెన్ విజేతగా నిలిచినప్పుడు అతని వయసు 35 సంవత్సరాలు. ఆతర్వాత ఎక్కువ వయసుగల ఆటగాడిగా 31 ఏళ్ల వావ్రిన్కా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అంతేగాక, 30 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఆటగాడు ఇక్కడ టైటిల్ సాధించడం 2002లో పీట్ సంప్రాస్ తర్వాత వావ్రిన్కాయే కావడం విశేషం.
టైమ్ అవుట్ వివాదం!
వావ్రిన్కాతో టైటిల్ పోరులో తలపడుతున్నప్పుడు జొకోవిచ్ పలు సందర్భాల్లో సంయమనం కోల్పోయాడు. మొదటి సెట్‌ను గెల్చుకున్న అతను రెండో సెట్‌లో గట్టిపోటీ ఇవ్వలేక ఓటమిపాలయ్యాడు. మూడో సెట్‌లో చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనితో నాలుగో సెట్ అతనికి అత్యంత కీలకంగా మారింది. ఆ సెట్‌లో వావ్రిన్కా సర్వశక్తులు ఒడ్డి ఆడడంతో జొకోవిచ్‌కు పాయింట్లు సంపాదించడం కష్టసాధ్యంగా మారింది. ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా అతను రెండు పర్యాయాలు మెడికల్ టైమ్ అవుట్ తీసుకోవడం వివాదాస్పదమైంది. ఉద్దేశపూర్వకంగా విరామం తీసుకుంటున్నాడని అంపైర్ అనుమానం వ్యక్తం చేశాడు. మరో సందర్భంలో పాయింట్‌ను కోల్పోయిన జొకోవిచ్ తన ర్యాకెట్‌ను గట్టిగా నేలకు కొట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దంటూ అంపైర్ అతనికి హితవు పలికాడు. మొత్తం మీద ఫైనల్‌లో జొకోవిచ్ ఏకాగ్రతను కోల్పోయాడని, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడని అతని ప్రవర్తన స్పష్టం చేసింది.

చాలా కీలక సమయాల్లో నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను. ఒత్తిడికి గురై, నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల మ్యాచ్‌ని చేజార్చుకున్నాను. ఎంత అనుభవం ఉన్నా, ఎలాంటి సమయాల్లో ఏం చేయాలో స్పష్టంగా తెలిసినా, కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతాం. అలాంటి పరిస్థితినే నేను ఎదుర్కొన్నాను. ఎంతో సంయమనంతో ఆడాల్సిన సమయంలో నేను ఒత్తిడికిలోనయ్యాను. పదేపదే పొరపాట్లు చేశాను. మూల్యాన్ని చెల్లించుకున్నాను. వావ్రిన్కా అందుకు భిన్నంగా ఎంతో ప్రశాంతంగా కనిపించాడు. చక్కటి ప్రదర్శనతో రాణించాడు. పట్టుదలతో ఆడి విజయాన్ని సాధించాడు. టైటిల్ అందుకోవడానికి అతను అన్ని విధాలా అర్హుడు. ఈ విషయంలో మరో ఆలోచన లేదు. - నొవాక్ జొకోవిచ్

చిత్రాలు.. సంచలన విజయాన్ని నమోదు చేనిన స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కా
యుఎస్ ఓపెన్‌ఫైనల్‌లో బోల్తాపడిన డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్