క్రీడాభూమి

క్రికెట్ సంఘాల్లో పాలన అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలోని వివిధ క్రీడా సంఘాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందని భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హయాంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు కీర్తీ అజాద్ తదితరులు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కేజ్రీవాల్‌సహా మొత్తం ఆరుగురిపై జైట్లీ పరువు నష్టం దావా కూడా వేశారు. దేశవాళీ క్రికెట్ పోటీలకు గతంలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించి, ఇటీవలే హర్యానాకు మారిన సెవాగ్ బుధవారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిడిసిఎపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించగా నేరుగా స్పందించలేదు. దేశంలోని ఎక్కువ శాతం క్రికెట్ సంఘాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించాడు. అండర్-16, అండర్-19 విభాగాల నుంచి మొదలుపెట్టి దశల వారీగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు. సమస్యలు ఆ దశ నుంచే మొదలవుతాయని కెరీర్‌లో 104 టెస్టుల్లో 8,586 పరుగులు, 251 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 8,273 పరుగులు చేసిన 37 ఏళ్ల సెవాగ్ అన్నాడు.
ఐపిఎల్‌తో ఉపయోగాలెన్నో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టి-20 క్రికెట్ టోర్నీల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని సెవాగ్ చెప్పాడు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రికెట్‌ను కుదిపివేశాయి. 2013 ఐపిఎల్‌లో ఈ ఉదంతం తెరపైకి వచ్చింది. ఆరోపణలు లేదా విమర్శల నేపథ్యంలో ఐపిఎల్‌ను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నది. అయితే, అలాంటి అవసరం లేదని సెవాగ్ స్పష్టం చేశాడు. నిజానికి ఐపిఎల్‌తో ఆటగాళ్లకు ఎన్నో ఉపయోగాలున్నాయని అన్నాడు. తాను, యువరాజ్ సింగ్ జాతీయ జట్టులోకి వచ్చినప్పుడు, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అలవాటుపడేందుకు కనీసం 20 నుంచి 25 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చేదని చెప్పాడు. శిఖర్ ధావన్ లాంటి యువ ఆటగాళ్లు అంతర్జాతీయ కెరీర్‌ను ధాటీగా ప్రారంభించేందుకు ఐపిఎల్‌లో ఆడిన అనుభవం ఎంతో ఉపకరిస్తున్నదని తెలిపాడు. ధావన్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడి 187 పరుగులు సాధించిన విషయాన్ని సెవాగ్ గుర్తుచేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు త్వరగా అలవాటుపడాలంటే ఐపిఎల్ వంటి టోర్నీల్లో ఆడడం తప్పనిసరి అన్నాడు. రవీంద్ర జడేజా, యూసుప్ పఠాన్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఎంతో మంది అంతర్జాతీయ స్టార్లు తొలుత ఐపిఎల్ ద్వారానే గుర్తింపు సంపాదించారని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ టీమిండియాలో స్థానం కోసం తా పోటీపడడం లేదుకాబట్టి ఐపిఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నానని అన్నాడు.
బాగానే సంపాదించాను..
క్రికెట్‌లో తాను బాగానే సంపాదించానని, కాబట్టి ఇప్పుడు డబ్బు కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆటపై ఉన్న మక్కువతో దేశవాళీ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలిపాడు. 37 ఏళ్ల వయసులో ఇంకా జాతీయ జట్టుకు ఆడాలని అనుకోవడం అత్యాశే అవుతుందన్నాడు. ఆశిష్ నెహ్రా ఫిట్నెస్ స్థాయి బాగా ఉందని, అందుకే అతను ఆసీస్ టూర్‌కు ఎంపికయ్యాడని వ్యాఖ్యానించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడడం వల్లే ఫిట్నెస్ సమస్యలు వస్తాయని అన్నాడు.
కోచింగ్ ఇవ్వడం ఇష్టం
యువ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం తనకు చాలా ఇష్టమని సెవాగ్ అన్నాడు. భవిష్యత్తులో ఏదైనా జట్టుకు కోచ్‌గా లేదా మెంటర్‌గా సేవలు అందిస్తానని తెలిపాడు. ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

సచిన్ ఒక్కడే..
సచిన్ లాంటి ఆటగాడు ఒక్కడే ఉంటాడని, అతనిలా ఆడేందుకు ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఉండదని సెవాగ్ అన్నాడు. తన చిన్నతనంలో ఎక్కువగా 10 లేదా 12 ఓవర్ల మ్యాచ్‌లు ఆడేవాడినని అంటూ, బ్యాటింగ్ చేసేందుకు చాలా తక్కువ బంతులు లభించేవికాబట్టి, క్రీజ్‌లోకి వెళ్లిన మరుక్షణం నుంచే ధాటిగా ఆడడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత సచిన్‌లా ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని చెప్పాడు. సచిన్‌ను అనుకరించడం, అతని స్థాయికి చేరడం సాధ్యం కాదని చాలా త్వరగానే తెలుసుకున్నానని అన్నాడు. అందుకే మళ్లీ తనదైన శైలిలో ఆడడం మొదలుపెట్టానని వివరించాడు. ‘సెవాగ్ కూడా ఒక్కడే కదా’ అని పిటిఐ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు అవునని సమాధానమిచ్చాడు. టెస్టులు లేదా వనే్డలు అన్న తేడా లేకుండా క్రీజ్‌లో నిలిచినంత సేపూ భారీ షాట్లకు ప్రయత్నించే వాడినని తెలిపాడు. అదే తనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందన్నాడు.