క్రీడాభూమి

వరుసగా 25వ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, జనవరి 8: అద్భుత విజయాలతో గత సీజన్‌ను ఘనంగా ముగించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) నూతన సంవత్సరంలోనూ తమ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ సెమీఫైనల్ పోరులో శుక్రవారం వీరిద్దరూ వరుసగా 25వ విజయాన్ని అందుకుని ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు ఈ పోరులో అండ్రెజా క్లెపాక్ (స్లొవేకియా), అల్లా కుద్రియవత్సెవా (రష్యా) జోడీని వరుస సెట్ల తేడాతో మట్టికరిపించారు. మ్యాచ్ ఆరంభం నుంచే పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి తొలి సెట్‌ను 6-3 తేడాతో కైవసం చేసుకున్న సానియా, హింగిస్‌లకు ఆ తర్వాత ప్రత్యర్థుల నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ ఆ సెట్‌ను కూడా 7-5 తేడాతో గెలుచుకున్న సానియా, హింగిస్ టైటిల్‌కు మరో మెట్టు దూరంలో నిలిచారు. ఫైనల్‌లో వీరు స్పెయిన్‌కు చెందిన అనబెల్ మెదీనా గారిగ్స్, అరంటా పర్రా శాంటోంజా జోడీతో గానీ, జర్మనీకి చెందిన వైల్డ్‌కార్డ్ జోడీ ఏంజెలిక్ కెర్బర్, ఆండ్రియా పెట్కోవిచ్‌లతో గానీ తలపడతారు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సానియా, హింగిస్ గత సీజన్‌లో ఐదు డబ్ల్యుటిఎ టైటిళ్లు సాధించిన విషయం విదితమే. తాజా ఫలితంతో వీరు వరుసగా 25వ విజయాన్ని నమోదు చేయడంతో పాటు 2012లో ఇటలీ జోడీ సరా ఎరానీ, రాబెర్టా విన్సీ సాధించిన 25 వరుస విజయాల రికార్డును సమం చేసినట్లయింది. అప్పట్లో వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నీలో ఓటమికి ముందు ఎరానీ, విన్సీ కూడా బార్సిలోనా, మాడ్రిడ్, రోమ్, ఫ్రెంచ్ ఓపెన్, హెర్టోగెన్‌బాష్ టోర్నమెంట్లలో వరుసగా ఐదు టైటిళ్లు సాధించారు.