క్రీడాభూమి

చేతులెత్తేసిన బిసిసిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: దేశంలో క్రికెట్ పాలనా వ్యవహారాలు పారదర్శంగా ఉండేందుకు లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏ మాత్రం ఇష్టపడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త ఎత్తుగడతో ముందుకు సాగాలని నిర్ణయించినట్టు స్పష్టమవుతున్నది. ఇంగ్లాండ్‌తో ఈనెల తొమ్మిది నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఖర్చులు చెల్లించే పరిస్థితులో లేమంటూ చేతులెత్తేసింది. ‘మీ ఖర్చులు మీరే భరించుకోండి’ అంటూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి లేఖ రాసింది. సిరీస్ ఆడేందుకు దేశంలో అడుగుపెట్టిన జట్టుకు ఖర్చు పెట్టడం సాధ్యం కాదంటూ లోధా కమిటీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. సిరీస్‌కు ముందే ఇసిబితో ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకూ దాని జోలికి వెళ్లకుండా తాత్సారం చేస్తున్నది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లోని ఒక రాష్ట్రానికి ఒకే ఓటు.. పాలక మండలి సభ్యులకు వయో పరిమితి.. కూల్ ఆఫ్ పీరియడ్.. వంటి అంశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న బిసిసిఐ ఇప్పుడు ఏకంగా బ్లాక్‌మెయిల్‌కు దిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టుకు ఖర్చులు కూడా చెల్లించలేని దీన స్థితిలో ఉన్నామంటూ, దానికి లోధా కమిటీనే కారణమన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నదన్న వాదన వినిపిస్తున్నది. ఇసిబికి బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే లేఖ రాయడం, ఖర్చులను వారే పెట్టుకోవాలని సూచించడం, అందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం భారత క్రికెట్ పరువు తీయడమే అవుతుందని పలువురి వాదన.
అమీతుమీకి బోర్డు సిద్ధం!
లోధా కమిటీతో అమీతుమీ తేల్చుకోవడానికి బిసిసిఐ సిద్ధమవుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు పలుమార్లు స్పష్టం చేసినా బిసిసిఐ పట్టించుకోవడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణాన్ని తెరపైకి తెచ్చి సిఫార్సుల అమలును వాయిదా వేస్తున్నది. డబ్బులు లేకపోతే, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను నిర్వహించడం సాధ్యం కాదని బిసిసిఐ చేసిన వ్యాఖ్యలపై లోధా కమిటీ విస్పష్టమైన ప్రకటన చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ తమ పరిధిలోని అంశం కాదని తేల్చిచెప్పింది. సభ్య సంఘాలకు జరిపే చెల్లింపుల వివరాలు ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేగాక, ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కేటాయించడానికి అనుసరించబోయే విధివిధానాలను, ప్రైవేటు ఆడిటర్ నియామకంపై వివరాలను ఈనెల 8వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది. ఇంగ్లాండ్ జట్టు మన దేశంలో పర్యటిస్తున్నది కాబట్టి, మ్యాచ్‌లు జరిగే కేంద్రాలున్న సభ్య సంఘాలకు నిధులను పంపిణీ ఏ ప్రాతిపదికన చేయాలో వివరించాలని కోరుతూ లోధా కమిటీకి బిసిసిఐ లేఖ రాసింది. దీనిపై కమిటీ స్పందిస్తూ, ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తమ సిఫార్సులను ఇంగ్లాండ్ జట్టు ఆడబోయే సిరీస్‌లతో ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. కాగా, తాము చెల్లింపులు చేయలేని పరిస్థితిలో ఉన్నామని, కాబట్టి ఆటగాళ్ల ఖర్చులను సొంతంగా భరించుకోవాల్సిందిగా ఇసిబిని కోరతామన్న బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే అన్నంత పనీ చేశాడు. సభ్య సంఘాలకు చెల్లింపులపై గతంలో లోధా కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనలు, జారీ చేసిన ఆదేశాలను ఇసిబికి రాసిన లేఖలో వివరించాడు. బిసిసిఐ తరఫున ఎలాంటి చెల్లింపులు జరపరాదని బ్యాంకులకు లోధా కమిటీ లేఖ రాసిన అంశాన్ని కూడా షిర్కే ఇసిబి దష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సెప్టెంబర్ 30న పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి, కొన్ని సభ్య సంఘాలకు భారీ మొత్తాలను చెల్లించేందుకు బిసిసిఐ చేసిన తీర్మానాన్ని లోధా కమిటీ తప్పుబట్టడంతో, మొత్తం బిసిసిఐ ఖాతాలనే స్తంభింప చేసిందనే అనుమానం వచ్చేలా షిర్కే లేఖ కొనసాగిందని తెలుస్తున్నది. నిజానికి ఐదు సభ్య సంఘాలకు భారీ చెల్లింపులు చేయడానికి బిసిసిఐ హడావుడిగా తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే లోధా కమిటీ వ్యతిరేకించింది. అంతేగాక, సిఫార్సుల అమలును అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన సభ్య సంఘాలకు నిధులు ఇవ్వచ్చని పేర్కొంది. కానీ, అఫిడవిట్ విషయంపై సంఘాలకు బిసిసిఐ ఎలాంటి సూచన చేయలేదు. ఇంగ్లాండ్ టూర్ ముంచుకొస్తున్నదని తెలిసినప్పటికీ చివరి క్షణం వరకూ కాలయాపన చేసింది. నాలుగైదు సభ్య సంఘాలకు భారీ మొత్తాలను చెల్లించడం ఏ విధంగానూ సాధారణ పాలనా వ్యవహారాల్లో భాగం కాదని లోధా కమిటీ స్పష్టం చేసినప్పటికీ, అసలు చేతిలో ఒక్క పైసాకూడా లేదన్న రీతిలో బిసిసిఐ హడావుడి చేయడం గమనార్హం. లోధా కమిటీ చేసిన సిఫార్సులు అమలు చేయాల్సిందేనని, దానిపై స్పష్టమైన హామీనిచ్చి, అఫిడవిట్‌ను దాఖలు చేసే వరకూ సభ్య సంఘాలకు ఎలాంటి చెల్లింపులు చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశించే స్థాయికి పరిస్థితిని దిగజార్చుకుంది. ఇప్పుడు భారత క్రికెట్ పరువును బజారుకీడ్చే విధంగా, ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభమయ్యే చివరి క్షణాల్లో చెల్లింపులపై అశక్తతను వ్యక్తం చేస్తూ ఇసిబికి షిర్కే లేఖ రాశాడు. అభిమానుల కోసమైనా సభ్య సంఘాలకు చెల్లింపుల విషయంలో లోధా కమిటీ గతంలో జారీ చేసిన ఆదేశాలను వెనక్కు తీసుకుంటుందన్నది బోర్డు ఆశ కావచ్చు. కానీ, లోధా కమిటీ గురువారం చేసిన ప్రకటనను బట్టి చూస్తే, బోర్డు పాచిక పారేలా కనిపించడం లేదు. సిరీస్‌ను కొనసాగించడం లేదా ఆపేయడం తమ బాధ్యత కాదని లోధా కమిటీ ప్రకటించింది. ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను ఇవ్వడానికి అనుసరించే బిడ్డింగ్ వ్యవహారంతోపాటు స్వతంత్ర ప్రతిపత్తిగల ఆడిటర్‌ను నియమించే అంశాలపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మంగళవారం వరకూ గడువుపెట్టింది. అంతేగాక, వ్యక్తులు లేదా సంస్థలతో ఇది వరకే చేసుకున్న లేదా భవిష్యత్తులో చేసుకోబోయే ఒప్పందాల వివరాలను తెలపాలని స్పష్టం చేసింది. ఐపిఎల్ ప్రత్యక్ష ప్రసార హక్కులపై తాజాగా ఓపెన్ బిడ్‌కు ఏఏ అంశాల ఆధారంగా ప్రకటన ఇచ్చారో వివరించాలని కోరింది. బోర్డు జరుపుతున్న వివిధ కాంట్రాక్టుల మొత్తం విలువ ఎంతో చెప్పాలని సూచించింది. లోధా కమిటీ ప్రకటనను గమనిస్తే, అవి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లను దెబ్బతీసేవిగా కనిపించడం లేదు. టెస్టు, వనే్డ, టి-20 సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చే కేంద్రాలున్న ప్రాంతాల్లోని సభ్య సంఘాలకు చెల్లింపులు జరగకుండా లోధా కమిటీ అడ్డుకుంటున్నదనే అభిప్రాయాన్ని అందరికీ కలిగించేందుకు షిర్కే ప్రయత్నిస్తున్నాడన్న వాదన వినిపిస్తున్నది. లోధా కమిటీనే తప్పులు చేస్తున్నదని క్రికెట్ ప్రపంచ అనుకునేలా వ్యూహ రచన జరుగుతున్నదని అంటున్నారు. అయితే, షిర్కే లేఖలోని అంశాలను లోధా కమిటీ ఇది వరకే ప్రస్తావించింది. సమాధానం కూడా ఇచ్చింది. కాబట్టి, ఖర్చులు చెల్లించలేమని ఒకసారి, ఎంవోయును కుదుర్చుకోకుండా మరోసారి చేస్తున్న రాద్ధాంతం వల్ల బోర్డుకు అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

సిరీస్‌కు వచ్చిన
ప్రమాదం లేదు

ఇసిబి ప్రతినిధి ఆశాభావం

న్యూఢిల్లీ: ఖర్చులు భరించే స్థితిలో లేమంటూ బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే రాసిన లేఖ వల్ల ఎలాంటి సమస్య ఉండదని, సిరీస్ ఇబ్బందుల్లేకుండా జరుగుతుందని ఇసిబి అధికార ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే భారత్‌కు వచ్చేశామని, కాబట్టి షెడ్యూల్‌ను మార్చుకునే అవకాశం ఏమాత్రం లేదని ఫోన్ ద్వారా పిటిఐతో మాట్లాడుతూ అతను అన్నాడు. ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే సిరీస్‌లు జరుగుతాయన్న నమ్మకం తనకు ఉందన్నాడు. ఇసిబికి షిర్కే లేఖ రాసినట్టు వచ్చిన వార్తలను ప్రస్తావించగా, దాని గురించి తనకు తెలియదన్నాడు. ఒకవేళ అది నిజమైనా ఇప్పుడు తాము చేయగలిగింది ఏమీ లేదని చెప్పాడు. టూర్‌ను రద్దు చేసుకోవడంగానీ, సిరీస్‌లను మార్చుకోవడంగానీ జరగదని అన్నాడు. టెస్టు, వనే్డ, టి-20 సిరీస్‌లకు అయ్యే ఖర్చులను బిసిసిఐ చూసుకుంటుందని వ్యాఖ్యానించాడు.