క్రీడాభూమి

సర్వీసెస్‌పై హైదరాబాద్ ఘన విజయం (రంజీ రౌండప్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: రంజీ ట్రోఫీ క్రికెట్‌లో భాగంగా సర్వీసెస్‌ను ఢీకొన్న హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొమ్మిది వికెట్లకు 580 పరుగుల భారీ స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సందీప్ 203 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, చామా మిలింద్ 136 పరుగులు సాధించాడు. ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌లో గట్టిపోటీని ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ సర్వీసెస్ 360 పరుగులకు ఆలౌటైంది. దీనితో ఫాలోఆన్‌కు దిగక తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో విఫలమై, 239 పరుగులకే ఆలౌటైంది. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకున్నప్పటికీ, ప్రత్యర్థి ముందు కేవలం రెండు పదుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. కాగా, సర్వీసెస్‌ను ఓడించడానికి చేయాల్సిన 20 పరుగులను హైదరాబాద్ ఒక వికెట్ కూడా నష్టపోకుండా సాధించింది.
ఆంధ్రకు ఇన్నింగ్స్ గెలుపు
వల్సాద్: త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్ తేడాతో విజయభేరి మోగించింది. త్రిపుర మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. విజయ్ కుమార్ 56 పరుగులకు 4, సిహెచ్ స్టీఫెన్ 47 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టి త్రిపుర బ్యాటింగ్ లైనప్‌ను దారుణంగా దెబ్బతీశారు. అనంతరం ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 524 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విహారీ 233 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ప్రశాంత్ కుమార్ 129 పరుగులు సాధించాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర 315 పరుగులకు ఆలౌటై, ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. యశ్పాల్ సింగ్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా, మిగతా బ్యాట్స్‌మెన్ పూర్తి స్థాయిలో ఎదురుదాడి చేయలేకపోయారు. విజయ్ కుమార్ 84 పరుగులకు 4, భార్గవ్ భట్ 85 పరుగులకు 4 చొప్పున వికెట్లు కూల్చారు.
రైల్వేస్/ బరోడా: ఇతర మ్యాచ్‌ల్లో, బరోడాపై రైల్వేస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేస్తే, అందుకు సమాధానంగా రైల్వేస్ 310 పరుగులు సాధించింది. బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులు చేసి, రైల్వేస్ ముందు 113 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని రైల్వేస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బెంగాల్/ తమిళనాడు: రాజ్‌కోట్‌లో బెంగాల్, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేయగా, తమిళనాడు 354 పరుగులు సాధించి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
గుజరాత్/ మధ్య ప్రదేశ్: నొగోథనేలో గుజరాత్, మధ్య ప్రదేశ్ జట్లు మ్యాచ్‌ని డ్రాగా ముగించాయి. గుజరాత్ మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 252 పరుగులకు ముగిసింది. గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 324 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మధ్య ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఉత్తర ప్రదేశ్/ ముంబయి: ఉత్తర ప్రదేశ్‌తో మైసూర్‌లో జరిగిన మ్యాచ్‌ని ముంబయి 121 పరుగుల తేడాతో గెల్చుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ముంబయి 233, ఉత్తర ప్రదేశ్ 225 చొప్పున పరుగలు చేశాయి. అనంతరం ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసి, ఉత్తర ప్రదేశ్ ముందు 295 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించలేకపోయిన ఉత్తర ప్రదేశ్ 67.2 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది.
అసోం/ ఒడిశా: హైదరాబాద్‌లో అసోం, ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. అసోం తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసింది. అనంతరం ఒడిసా తొలి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 459 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అసోం రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, చివరి రోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 166 పరుగులు చేసింది.
జార్ఖండ్/ సౌరాష్ట్ర: అగర్తాలాలో జార్ఖండ్, సౌరాష్ట్ర జట్లు ఢీకొన్నాయి. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచింది. సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు చేయగా, జార్ఖండ్ 467 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకునేందుకు కనీసం 190 పరుగులు చేయాల్సి ఉండగా, సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది.
కర్నాటక/ రాజస్థాన్: జాతీయ జట్టుకు ఎంపికైన లోకేష్ రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నాటక విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 393 పరుగుల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాటక మొదటి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేయగా, రాజస్థాన్ 148 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కర్నాటక ఆరు వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 525 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ 131 పరుగులకే ఆలౌటైంది.
మహారాష్ట్ర/ విదర్భ: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో విదర్భను మహారాష్ట్ర ఇన్నింగ్స్ మూడు పరుగుల తేడాతో ఓడించింది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే ఆలౌటైంది. అనంతరం మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 332 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ కొంత వరకూ పోరాడినప్పటికీ 270 పరుగులకు ఆలౌటై, ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లు ఏమాత్రం ఆసక్తిని రేపకుండా ముగిసాయ. బౌలర్లపై బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం మరోసారి చాలా స్పష్టంగా కనిపించింది. జాతీయ జట్టుకు ఎంపికైన కర్నాటక బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్ తాజా మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగడం విశేషం. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన ఫామ్‌ను నిరూపించుకున్న అతను ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టులో ఆడడం ఖాయంగా కనిపిస్తున్నది.