క్రీడాభూమి

కివీస్ కరెన్సీలేక అఫ్రిదీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 12: న్యూజిలాండ్ కరెన్సీ లేకపోవడం పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీని కష్టాల్లోకి నెట్టింది. జేబుల్లో అమెరికా డాలర్లు ఉన్నప్పటికీ, కివీస్ స్థానిక కరెన్సీలోకి మార్చుకోకుండానే అఫ్రిదీ అతని సహచర ఆటగాడు అహ్మద్ షెజాద్ వెల్లింగ్టన్ విమానాశ్రయంలోని ఒక రెస్టారెంట్‌లోకి వెళ్లారు. తీరా బిల్లు చెల్లించే సమయంలో యుఎస్ డాలర్లు ఇవ్వబోతే, రెస్టారెంటు సిబ్బంది వాటిని తీసుకోలేదు. న్యూజిలాండ్ డాలర్లు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అయోమయంలో పడ్డారు. అదే సమయంలో వారి వెనకనే ఉన్న వకాస్ నవేద్ అనే యువకుడు ఆ బిల్లును చెల్లించాడు. ఈ విషయాన్ని అఫ్రిదీ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తావించాడు. న్యూజిలాండ్‌కు పాక్ జట్టును ఆహ్వానించే క్రమంలో ఆ మొత్తాన్ని చెల్లించినట్టు నవేద్ పేర్కొన్నాడని అన్నాడు. అయితే, ఈ మొత్తం సంఘటనను వీడియో తీసిన గుర్తుతెలియని వ్యక్తులు దానిని మీడియాకు ఇచ్చారని వాపోయాడు. న్యూజిలాండ్ మీడియా తన వివరణ తీసుకోకుండానే వార్తను ప్రసారం చేస్తున్నదని అన్నాడు. ఇలావుంటే, ఇటీవలే లాహోర్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో చిరాకును ప్రదర్శించిన అఫ్రిదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నిరాకరించిన అతను సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. కాగా, అఫ్రిదీ క్షమాపణ చెప్పాలంటూ పాత్రికేయులు ప్రదర్శన నిర్వహించడంతో, మరో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తన తొందరపాటుకు చింతిస్తున్నట్టు ప్రకటించాడు. దీనితో సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. న్యూజిలాండ్‌లో సిరీస్‌లు ఆడేందుకు వచ్చిన వెంటనే అతను మరోసారి మీడియాకు చిక్కడంతో పరిస్థితి ఎటుపోయి ఎటు వస్తుందోనని పాక్ జట్టు ఆందోళన పడుతున్నది.