క్రీడాభూమి

రోహిత్ శతకం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 12: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. ఇక్కడ వకా మైదానంలో మంగళవారం జరిగిన మొదటి వనే్డని ఐదు వికెట్ల తేడాతో కైవసం చేసుకొని, సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ వీరవిహారం చేసి సాధించిన అజేయ సెంచరీ వృథాకాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జార్జి బెయిలీ శతకాలతో కదంతొక్కి జట్టును విజయపథంలో నడిపించారు. భారత్ తమ ముందు ఉంచిన 310 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా అందుకుంది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, శిఖర్ ధావన్ వికెట్ 36 పరుగుల వద్ద కూలింది. అతను 22 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులు చేసి జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు దొరికాడు. అనంతరం రోహిత్‌తో కలిసిన టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చక్కటి సహకారాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను సులభంగా ఎదుర్కొన్న వీరిద్దరూ స్కోరుబోర్డును వేగంగా ముందుకు కదిలించారు. వికెట్ల మధ్య అద్భుతంగా పరుగులు తీస్తూ, ఆసీస్ బౌలర్లు, ఫీల్డర్లపై ఏకకాలంలో ఒత్తిడి తెచ్చారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను స్ఫూర్తిగా తీసుకొని, ఆస్ట్రేలియాలో ఆసీస్ జట్టుపై ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన కోహ్లీ కూడా పదునైన షాట్లతో అభిమానులను అలరించాడు. కెరీర్‌లో 35వ అర్ధ శతకాన్ని సాధించిన అతను సెంచరీ పూర్తి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపించాయి. అయితే, 91 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అతను జేమ్స్ ఫాల్క్‌నెర్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. తొమ్మిది పరుగుల తేడాతో 24వ వనే్డ శతకాన్ని చేజార్చుకున్న కోహ్లీ 97 బంతులు ఎదుర్కొన్నాడు. అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కెప్టెన్ ధోనీ 13 బంతుల్లో, ఒక ఫోర్, మరో సిక్సర్‌సాయంతో 18 పరుగులు చేసి ఫాల్క్‌నెర్ బౌలింగ్‌లోనే స్కాట్ బోలాండ్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. చివరిలో రవీంద్ర జడేజా (10 నాటౌట్)తోపాటు రోహిత్ నాటౌట్‌గా నిలిచాడు. 205 నిమిషాలు క్రీజ్‌లో నిలిచిన రోహిత్ 163 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 171 పరుగులు చేశాడు. అతనికి ఇది 9వ వనే్డ శతకం.
భారత్‌ను ఓడించి, ఈ సిరీస్‌లో శుభారంభం చేయడానికి 310 పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియా కేవలం తొమ్మిది పరుగుల వద్ద ఓపెనర్ అరోన్ ఫించ్ వికెట్‌ను కోల్పోయింది. అతను 11 బంతుల్లో 8 పరుగులు చేసి, కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన బరీందర్ శరణ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ 10 బంతుల్లో ఐదు పరుగులు చేసి, శరణ్ బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 21 పరుగులకే రెండు వికెట్లు పడిపోగా కష్టాల్లో చిక్కుకున్న ఆస్ట్రేలియాను కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఆసీస్ టి-20 జట్టు కెప్టెన్ జార్జి బెయిలీ ఆదుకున్నారు. వీరిద్దరూ శతకాలు సాధించడంతో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనుకున్న టీమిండియా ఆశలకు గండిపడింది. కెరీర్‌లో స్మిత్ 5వ, బెయిలీ 3వ శతకాన్ని పూర్తి చేశారు. రెండో వికెట్‌కు 242 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన వీరు ఆసీస్‌ను విజయం ముంగిట నిలిపారు. 120 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 112 పరుగులు చేసిన బెయిలీని భువనేశ్వర్ కుమార్ క్యాచ్ అందుకోగా అశ్విన్ వెనక్కు పంపాడు. హార్డ్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఆరు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. జట్టు స్కోరు 300 పరుగుల మైలురాయిని దాటించిన స్మిత్, చివరి ఓవర్ మొదటి బంతిలో అవుటయ్యాడు. శరణ్ వేసిన బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన అతను లూజ్ షాట్ కొట్టి, కోహ్లీ చక్కటి క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. ఫాల్క్‌నెర్ చివరి పరుగు చేసి, మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్‌కు విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగులు చేసే సమయానికి మిచెల్ మార్ష్ (12)తోపాటు అతను (ఒక పరుగు) నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నాడు.
స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ నాటౌట్ 171, శిఖర్ ధావన్ సి మిచెల్ మార్ష్ బి జొస్ హాజెల్‌వుడ్ 9, విరాట్ కోహ్లీ సి ఆరోన్ ఫించ్ బి జేమ్స్ ఫాల్క్‌నెర్ 91, మహేంద్ర సింగ్ ధోనీ సి స్కాట్ బోలాండ్ బి జేమ్స్ ఫాల్క్‌నెర్ 18, రవీంద్ర జడేజా నాటౌట్ 10, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (50 ఓవర్లలో 3 వికెట్లకు) 309.
వికెట్ల పతనం: 1-36, 2-243, 3-286.
బౌలింగ్: జొస్ హాజెల్‌వుడ్ 10-0-41-1, జోల్ పారిస్ 8-0-53-0, మిచెల్ మార్ష్ 9-0-53-0, స్కాట్ బోలాండ్ 10-0-74-0, జేమ్స్ ఫాల్క్‌నెర్ 10-0-60-2, గ్లేన్ మాక్స్‌వెల్ 3-0-22-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్ సి అండ్ బి బరీందర్ శరణ్ 8, డేవిడ్ వార్నర్ సి కోహ్లీ బి బరీందర్ శరణ్ 5, స్టీవెన్ స్మిత్ సి కోహ్లీ బి బరీం దర్ శరణ్ 149, జార్జి బెయలీ సి భువనేశ్వర్ కు మార్ బి అశ్విన్ 112, గ్లేన్ మాక్స్‌వెల్ సి శిఖర్ ధావన్ బి అశ్విన్ 6, మిచెల్ మార్ష్ నాటౌట్ 12, జేమ్స్ ఫాల్క్‌నెర్ నాటౌట్ 1, ఎక్‌స్ట్రాలు 17, మొ త్తం (49.2 ఓవర్లలో 5 వికెట్లకు) 310.
వికెట్ల పతనం: 1-9, 2-21, 3-263, 4-273, 5-308.
బౌలింగ్: బరీందర్ శరణ్ 9.2-0-56-3, భువనేశ్వర్ కుమార్ 9-0-42-0, రోహిత్ శర్మ 1-0-11-0, ఉమేష్ యాదవ్ 10-0-54-0, రవీంద్ర జడేజా 9-0-61-0, అశ్విన్ 9-0-68-2, విరాట్ కోహ్లీ 2-0-13-0.

రిచర్డ్స్ రికార్డు బద్దలు..
* రోహిత్ శర్మ (171 నాటౌట్) ఆస్ట్రేలియాలో ఆసీస్ జట్టుపై అత్యధిక స్కోరు చేసిన ఒక విదేశీ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 1979 డిసెంబర్ 9న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో వెస్టిండీస్ స్టార్ వివియన్ రిచర్డ్స్ 153 (నాటౌట్) పరుగులతో నెలకొల్పిన రికార్డును రోహిత్ బద్దలు చేశాడు. వివిధ టోర్నీలలో భాగంగా ఆస్ట్రేలియాలో జరిగిన వనే్డల్లో రోహిత్‌ది ఐదో అత్యధిక స్కోరు. ఆస్ట్రేలియాలో అతనికి ఇది మూడో సెంచరీ. ఈ విషయంలో అతను వివిఎస్ లక్ష్మణ్‌తో కలిసి రికార్డును పంచుకుంటున్నాడు.
* వనే్డల్లో రోహిత్ 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాలుగోసారి. సచిన్ తెండూల్కర్ ఐదు పర్యాయాలు నూటయాభై కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతని తర్వాత నాలుగు పర్యాయాలు ఈ ఫీట్‌ను సాధించిన బ్యాట్స్‌మన్‌గా సనత్ జయసూర్య, క్రిస్ గేల్‌తో కలిసి రోహిత్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
* సచిన్ తెండూల్కర్ శతకాన్ని సాధించిన 14 పర్యాయాలు భారత జట్టు పరాజయాలను ఎదుర్కొంది. రోహిత్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో టీమిండియా ఓడడం ఇది నాలుగోసారి.
* వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగంగా 1,000 పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్స్‌మన్‌గా కూడా రోహిత్ పేరు రికార్డు పుస్తకాల్లో నమోదైంది. అతను తన 19వ ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. బ్రియాన్ లారా, సచిన్ తెండూల్కర్ 20 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులను పూర్తి చేసి సంయుక్తంగా పంచుకుంటున్న రికార్డును రోహిత్ అధిగమించాడు. అంతేగాక, ఆస్ట్రేలియాపై 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక సగటు కూడా రోహిత్‌దే. అతను సగటున 68.46 పరుగులు సాధించాడు.