క్రీడాభూమి

ధైర్యమా? తెగింపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మొండి వైఖరిని మార్చుకోవడంలేదు. లోధా కమిటీ సిఫార్సుల అమలును వ్యతిరేకిస్తున్న అతను తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో, హడావుడిగా నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ అతను కొత్తగా చెప్పిందేమీ లేదు. గతంలో పేర్కొన్న అంశాలను తిగిరి ప్రస్తావించాడే తప్ప తాజా నిర్ణయాలు ఏవీ ప్రకటించలేదు. లోధా సిఫార్సులను అమలు చేస్తామని ప్రకటించిన విదర్భ, త్రిపుర క్రికెట్ సంఘాలుఈ ఎస్‌జిఎంకు హాజరుకాలేదు. కాగా, లోధా కమిటీ సిఫార్సుల అమలుపై గతంలో తీసుకున్న నిర్ణయాలకే కట్టుబడి ఉండాలని ఎస్‌జిఎం ఏకగ్రీవంగా తీర్మానించిందని ఠాకూర్ ప్రకటించాడు. తన పాత వాదనను మరోసారి వినిపించాడు. ఈ వాదన ఇటు లోధా కమిటీ, అటు సుప్రీం కోర్టు చాలాకాలంగా వింటూ వస్తున్నదే. లోధా సిఫార్సుల్లో కొన్ని ఆచరణకు సాధ్యం కావని, సభ్య సంఘాలు అంగీకరించడం లేదని సుప్రీం కోర్టులో వాదించి భంగపడిన ఠాకూర్ మళ్లీ పాత పాటనే ఎత్తుకొని, అఫిడవిట్‌ను దాఖలు చేయడం అతని ధైర్యానికి నిదర్శనమా? లేక ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న తెగింపా? అన్నది అర్థం కావడం లేదు. లోధా సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేస్తే, ముందుగా ఠాకూర్, అతనితోపాటు బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే తమ పదవులను కోల్పోవాల్సి వస్తుంది. ఏ క్షణమైనా పదవి ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో అతను చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా ఎన్నికైన శశాంక్ మనోహర్ తనకు మునిగిపోతున్న నావను అప్పచెప్పాడంటూ ఠాకూర్ గతంలో చేసిన వ్యాఖ్యలు అతను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి నిదర్శనం. లోధా కమిటీకి, సుప్రీం కోర్టుకు ప్రతిసారీ వినిపిస్తున్న వాదననే మళ్లీ ప్రస్తావించడం ద్వారా ఠాకూర్ ఏం ఆశిస్తున్నాడో అర్థం కాలేదు.
ఆర్థికాంశాలే కీలకం?
భారత క్రికెట్ కంటే బిసిసిఐకి ఉన్న అపారమైన ఆదాయం, ఆస్తులపైనే చాలా మందికి ఆసక్తి ఉందనేది వాస్తవం. స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగిన బిసిసిఐ దూకుడుకు సుప్రీం కోర్టు కళ్లెం వేయడంతో, పాలక మండలి సభ్యులంతా అల్లాడిపోతున్నారు. కోర్టును ధిక్కరించలేక.. లోధా సిఫార్సులను అమలు చేయలేక సతమతమవుతున్నారు. పరిస్థితులు ముందు నుయ్యి, వెనక గొయ్యిగా మారడంతో అటో ఇటో తేల్చుకోవడం మినహా ఠాకూర్ ముందు మరో మార్గం లేదన్న వాదన వినిపిస్తున్నది. ఆర్థికాంశాలపైనా లోధా కమిటీ, సుప్రీం కోర్టు దృష్టి పెట్టడంతో బిసిసిఐ కంగుతింది. లోధా సిఫార్సులను డిసెంబర్ 3వ తేదీలోగా అమలు చేసి తీరాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఇది వరకే స్పష్టం చేసింది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌ల ప్రసార హక్కులుసహా ఇతరత్రా కాంట్రాక్టుల బిడ్‌లను పరిశీలించి, ఖరారు చేయడానికి ప్రైవేటు ఆడిటర్‌ను నియమించే విషయంలో స్పష్టతనివ్వాలని లోధా కమిటీ ఆదేశించింది. అత్యధిక ఆదాయ వనరులతో కోట్లకు పడగలెత్తిన బోర్డు లావాదేవీలపై ఆంక్షలు విధించింది. సిఫార్సుల అమలుకు అంగీకరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేసిన సభ్య సంఘాలకు మాత్రమే చెల్లింపులు జరపాలని బోర్డును ఆదేశించింది. ఈ ముప్పేట దాడిని ఎదుర్కోలేక బిసిసిఐ అధ్యక్షుడు ఠాకూర్ మల్లగుల్లాలు పడుతున్నాడు. లోధా చేసిన సూచనల అమలుపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో అసలు విషయాన్ని పక్కకుపెట్టి, అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను తన 50 పేజీల అఫిడవిట్‌లో ఏకరువుపెట్టాడు. అయితే, ఇవన్నీ బిసిసిఐ ఇది వరకే సుప్రీం దృష్టికి తీసుకెళ్లినవే. అవే అంశాలను మళ్లీమళ్లీ ప్రస్తావించడం వెనుక ఠాకూర్ ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఆసక్తి రేపుతున్నది.
సోమవారం తీర్పు?
లోధా సిఫార్సుల అమలుకు గడువు దాదాపుగా ముగిసింది. వాటి అమలుకు సుప్రీం కోర్టు విధించిన డెడ్‌లైన్‌ను చాలాసార్లు పొడిగించింది. సోమవారం కోర్టు ఈ కేసుపై తుది తీర్పునిస్తుందని అంటున్నారు. కోర్టు డెడ్‌లైన్‌కు ముందు ఏర్పాటు చేసిన ఎస్‌జిఎంలో ఏ నిర్ణయం తీసుకోకుండా బిసిసిఐ దాటవేత వైఖరిని అనుసరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. సిఫార్సుల అమలు దిశగా అడుగులు వేయకుండా, ‘సిఫార్సుల అమలు చాలా కష్టం.. అధిక శాతం సభ్య సంఘాలు సిఫార్సులను వ్యతిరేకిస్తున్నాయి.. సర్వసభ్య సమావేశంలో అధిక సంఖ్యాల మద్దతు ఉంటేగానీ నిబంధనావళిని మార్చడానికి వీల్లేదు.. తమిళనాడులో ప్రభుత్వేతర సంస్థల చట్టం కింద నమోదైంది కాబట్టి అక్కడి చట్టాలకు మేం లోబడి ఉండాలి.. మా ఆంతరంగిక వ్యవహారాల్లో ఎవరి జోక్యం కూడా ఉండరాదు..’ వంటి మాటలను తిప్పితిప్పి చెప్తున్నది. అయితే, సుప్రీం కోర్టులో వాదించి భంగపడిన అంశాలనే లోధా కమిటీకి సమర్ఫించిన నివేదికలో ఠాకూర్ మరోసారి ప్రస్తావించాడు. గడువు ముగిసినప్పటికీ లోధా సిఫార్సుల అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదంతా చూస్తుంటే అతను ధైర్యం చేస్తున్నాడని అనుకోవడానికి వీల్లేదు. ఎలాగూ చేజారిపోయే హోదా కాబట్టి, చివరి క్షణం వరకూ ఏదో ఒక రకంగా వాయిదా కోసం ప్రయత్నిస్తూ, అవసరమైతే తెగించడానికి అతను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది.