క్రీడాభూమి

ఒక రంజీ మ్యాచ్.. రెండు పిచ్‌లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఒక రంజీ మ్యాచ్‌ని రెండు పిచ్‌లపై ఆడించే విధానాన్ని అమలు చేయాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రతిపాదించాడు. ఈ విధంగా ఆడితే, విదేశాల్లో టెస్టు సిరీస్‌లకు అద్భుతమైన జట్టును రూపొందించగలుగుతామని శనివారం ఇక్కడ జరిగిన లీడర్‌షిప్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ అన్నాడు. అదే విధంగా ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు సుదీర్ఘ విరామాల తర్వాత కాకుండా, బ్యాక్ అండ్ బ్యాక్ సిరీస్‌లుగా ఉండాలని సూచించాడు. అప్పుడే ఒక జట్టు స్వదేశంలో, విదేశంలో ఏ విధంగా ఆడుతుందనే విషయం తెలుస్తుందని అన్నాడు. రంజీ మ్యాచ్‌లను పోటీపడుతున్న రెండు జట్లలో ఏదో ఒక జట్టుకు చెందిన హోం గ్రౌండ్‌లో కాకుండా తటస్థ కేంద్రంలో ఆడిస్తే బాగుంటుందని తాను చాలాకాలంగా అనుకుంటున్నానని, అదే అంశాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల దృష్టికి ఇంతకు ముందే తీసుకెళ్లానని సచిన్ అన్నాడు. అదేవిధంగా రెండు వేరువేరు పిచ్‌లపై, వేరువేరు బంతులతో రంజీ మ్యాచ్‌ని ఆడిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలో దేశవాళీ పోటీలన్నీ కూకబురా బంతులతో ఆడతారని, మన దేశంలో ఎస్‌జి బంతులను వాడుతున్నామని వివరించాడు. రంజీ వంటి దేశవాళీ టోర్నీల్లో ఆడిన ఒక ఆటగాడు విదేశాలకు వెళ్లినప్పుడు, మ్యాచ్ ఆరంభంలో విపరీతమైన వేగంతో దూసుకొస్తూ, అనూహ్యంగా దిశను మార్చుకునే కూకబురా బంతులను ఏ విధంగా ఎదుర్కొంటాడని ప్రశ్నించాడు. ఎక్కువ మంది భారత ఆటగాళ్లు విదేశాల్లో నిలకడగా రాణించలేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. ఒక రంజీ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో కూకబురా బంతులతో ఆడించాలని, బంతి వేగంగా దిశను మార్చుకునే పరిస్థితుల్లో స్పిన్ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలో అప్పుడు బ్యాట్స్‌మెన్‌కు అర్థమవుతుందని చెప్పాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్‌లో సంప్రదాయబద్ధంగా వస్తున్న ఎస్‌జి బంతులను కొనసాగించాలని, అప్పటికి వికెట్‌పై పచ్చిక తగ్గడంతో దాని స్వభావంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నాడు. కాబట్టి స్పిన్‌లో వైవిధ్యాలను అర్థం చేసుకొని, నిలకడగా ఆడడం అలవాటు అవుతుందని చెప్పాడు.
స్పిన్ కీలకం
విదేశాల్లో పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, స్పిన్‌కు ప్రాధాన్యం ఉండదని చాలా మందిలో ఉన్న అభిప్రాయం తప్పని సచిన్ అన్నాడు. టెస్టు మ్యాచ్‌ల్లో స్పిన్ ఎంతో కీలకమని చెప్పాడు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగితేనే టెస్టు క్రికెట్‌లో రాణించడం సాధ్యమని చెప్పాడు. ఒక రంజీ మ్యాచ్‌ని రెండు పిచ్‌లపై ఆడించడం వల్ల టాస్‌కు ఉన్న ప్రాధాన్యం తగ్గుతుందని గుర్తుచేశాడు. టాస్ గెలిచిన జట్టుకు వచ్చే లాభాలే రెండో ఇన్నింగ్స్‌లో టాస్‌ను కోల్పోయిన జట్టుకు కూడా ఉంటాయని అన్నాడు. ఈ రకంగా రెండు పిచ్‌లపై ఆడడం వల్లే బ్యాటింగ్‌లో ప్రమాణాలు పెరుగుతాయని తెలిపాడు.
ఆరోగ్యకరమైన పోటీ ఎక్కడ?
క్రికెట్‌లో ఆరోగ్యకరమైన పోటీ ఇప్పుడు కనిపించడం లేదని సచిన్ అన్నాడు. ఒకప్పుడు క్రికెటర్ల మధ్య ఆధిపత్య పోరాటం ఉండేదని అన్నాడు. సునీల్ గవాస్కర్/ ఇమ్రాన్ ఖాన్ లేదా వివియన్ రిచర్డ్స్/ జెఫ్ థాంప్సన్ లేదా బ్రియాన్ లారా/ గ్లెన్ మెక్‌గ్రాత్.. ఈ విధంగా ఆటగాళ్లు ఆధిపత్య పోరాటం కొనసాగేదని గుర్తు చేశాడు. ఇప్పుడు ఆ విధంగా చెప్పేందుకు వీల్లేదని, పరస్పర పోటీ అదృశ్యమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. పోటీ ఉన్నప్పుడే ఎదుగుదల సాధ్యమని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ప్రస్తుత టెస్టు జట్టు 2000 నుంచి 2011 మధ్యకాలంలోని టీమిండియాను గుర్తుచేస్తున్నదని అన్నాడు. పేస్, స్పిన్ సమతూకంగా ఉన్నాయని, అదే విధంగా బ్యాటింగ్ విభాగంలోనూ పటిష్టంగా ఉందని చెప్పాడు. కనీసం మరో పదేళ్లు ఇదే జట్టు కొనసాగుతుందని వ్యాఖ్యానించాడు.

టెస్టులకు ఆదరణ తగ్గలేదు..
టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిందన్న వాదనను సచిన్ తోసిపుచ్చాడు. ఈ ఫార్మాట్‌ను కూడా ఆదరిస్తారని అంటూ, ప్రజల దృష్టికోణం మారాలని అన్నాడు. ఫార్మాట్‌ను బట్టి ఆట ఉంటుందన్న విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని చెప్పాడు. టెస్టులకు గౌరవం ఉందని అన్నాడు.

చిత్రం..లీడర్‌షిప్ సమిట్‌లో పాల్గొన్న
మాజీ క్రికెటర్ అజయ్ జడేజా