క్రీడాభూమి

ఫిక్సింగ్‌పై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: ఇటీవల వెల్లువెత్తిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రపంచ టెన్నిస్ అధికారులు నిర్ణయించారు. ఎటిపి, డబ్ల్యుటిఎ, ఐటిఎఫ్‌తోపాటు నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల కీలక అధికారులు బుధవారం ఇక్కడ సమావేశమై మ్యాచ్ ఫిక్సింగ్‌పై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఉందని, దర్యాప్తు జరిపించిన తర్వాత దోషులపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానించారు. బిబిసి, బజ్‌ఫీడ్ సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో సుమారు దశాబ్దకాలంగా పలు టెన్నిస్ మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురవుతున్నట్టు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-50’లో ఉన్న పలువురు ఆటగాళ్లకు ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. అంతేగాక, ఫిక్సింగ్ దోషుల్లో ఎనిమిది మంది ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో ఆడుతున్నారని పేర్కొంది. దీనికితోడు మిక్స్‌డ్ డబుల్స్‌లో డేవిడ్ మరెరో, లారా అరుబరెనా 6-0, 6-3 తేడాతో తమ కంటే తక్కువ స్థానంలో ఉన్న ఆండ్రియా హ్లవకొవ, లుకాస్ కబోట్ జోడీ చేతిలో ఓటమిపాలుకావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈమ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైందని స్పోర్ట్స్ బెట్టిగ్‌లో ప్రపంచ నంబర్ వన్ సంస్థ పినాకిల్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో పేర్కోవడం ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులను ఆందోళనకు గురి చేసింది. ఫిక్సింగ్ వ్యవహారం మరింత ముదరక ముందే జాగ్రత్తలు తీసుకునేందుకు అత్యవసరంగా సమావేశమైన ప్రపంచ టెన్నిస్ అధికారులు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయించాలని నిర్ణయించారు. ఫిక్సింగ్‌ను కఠిన చర్యలు తీసుకునే నేరాల జాబితాలో చేర్చాలని అన్ని దేశాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం టెన్నిస్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదని, అన్ని క్రీడల్లోనూ ఫిక్సింగ్ వ్యాపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. టెన్నిస్‌ను మరింత పారదర్శకంగానూ, వివాదాలకు తావులేని విధంగానూ తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని సమావేశం అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఫిక్సింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించిన తర్వాత, దోషులుగా తేలిన వారిపై తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.