క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన ధోనీసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 29: కంగారూలతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించి మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు శిఖర్ ధావన్ (42), రోహిత్ శర్మ (60)తో పాటు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (59) మరోసారి చక్కగా రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించిన భారత జట్టు ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చక్కగా రాణించి కంగారూలను 20 ఓవర్లలో 157/8 స్కోరుకే పరిమితం చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడి భారత్ విజయానికి రాచబాట వేసిన విరాట్ కోహ్లీ (33 బంతుల్లో 1 సిక్సర్, 7 ఫోర్లు సహా 59 పరుగులు) మరోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కగా రాణించి 97 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. అనంతరం ధావన్ (32 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లు సహా 42 పరుగులు) 11వ ఓవర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన చివరి బంతిని ఎదుర్కోబోయి క్రిస్ లిన్‌కు క్యాచ్ ఇవ్వడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 37 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించి 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా నిష్క్రమించాడు. అయితే అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (9 బంతుల్లో 14 పరుగులు)తో కలసి 37 పరుగులు జోడించడంతో పాటు 59 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆండ్రూ టై, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెరో వికెట్‌తో సరిపుచ్చుకున్నారు.
అనంతరం 185 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా క్రీజ్‌లో పాతుకుపోయి ధాటిగానే ఆడాడు. భారత బౌలర్లను చక్కగా ప్రతిఘటించిన అతను నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ షాన్ మార్ష్ (23)తో కలసి 94 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేశాడు. అయితే మార్ష్ నిష్క్రమణ తర్వాత క్రిస్ లిన్ (2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1), షేన్ వాట్సన్ (15) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా, 74 పరుగులు సాధించిన ఫించ్ 16వ ఓవర్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆస్ట్రేలియా జట్టులో మాథ్యూ వేడ్ (16-నాటౌట్), జేమ్స్ ఫాల్క్‌నర్ (10) మినహా ఎవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే సాధించి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు కైవసం చేసుకోగా, యువరాజ్ సింగ్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ సాధించారు. ఆస్ట్రేలియాలో ఇంతకుముందు భారత జట్టు 1985లో జరిగిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు 2007-08 సీజన్‌లో జరిగిన ముక్కోణ సిరీస్‌లో విజయం సాధించినప్పటికీ ద్వైపాక్షిక సిరీస్‌లో కంగారూలను సొంత గడ్డపై ఓడించడం ఇదే తొలిసారి. ఈ విజయంతో భారత జట్టు కొద్ది రోజుల క్రితం కంగారూలతో జరిగిన ఐదు వనే్డ సిరీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

సంక్షిప్తంగా స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 184/3 (రోహిత్ శర్మ 60, శిఖర్ ధావన్ 42, విరాట్ కోహ్లీ 59-నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ 14). వికెట్ల పతనం: 1-97, 2-143, 3-181. బౌలింగ్: షేన్ వాట్సన్ 3-0-17-0, జాన్ హేస్టింగ్స్ 3-0-35-0, స్కాట్ బోలాండ్ 4-0-30-0, జేమ్స్ ఫాల్క్‌నర్ 3-0-35-0, ఆండ్రూ టై 4-0-28-1, నాథన్ లియోన్ 1-0-15-0, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2-0-17-1.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 157/8 (ఆరోన్ ఫించ్ 74, షాన్ మార్ష్ 23, షేన్ వాట్సన్ 15, మాథ్యూ వేడ్ 16-నాటౌట్, జేమ్స్ ఫాల్క్‌నర్ 10). వికెట్ల పతనం: 1-94, 2-99, 3-101, 4-121, 5-124, 6-137, 7-152, 8-157. బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-34-0, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-37-2, రవీంద్ర జడేజా 4-0-32-2, రవిచంద్రన్ అశ్విన్ 4-0-27-1, హార్దిక్ పాండ్యా 2-0-17-1, యువరాజ్ సింగ్ 2-0-7-1.

రోహిత్ శర్మ (47 బంతుల్లో 60 పరుగులు)