క్రీడాభూమి

హోరాహోరీలో యు ముంబా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 30: విశాఖలోని పోర్టు స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ప్రోకబడ్డీ టోర్నమెంట్ తొలిమ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టుపై యు ముంబా జట్టు ఘన విజయాన్ని సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చివరి వరకూ పోరాడి ఓటమిని చవిచూసింది. ఆట సగభాగం పూర్తయ్యే సమయానికి తెలుగు టైటాన్స్ ఎనిమిది పాయింట్లతో, ముంబా జట్టు 18 పాయింట్లతో నిలిచాయి. ఆట రెండో అర్ధ భాగంలో తెలుగు టైటాన్స్ అద్భుతంగా ఆడినప్పటికీ కేవలం రెండు పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రోకబడ్టీ సీజన్-3 తొలి లీగ్ మ్యాచ్‌లో పోటీలకు ఆతిథ్యమిచ్చిన తెలుగు టైటాన్స్ జట్టు పోరాడి ఓడిపోయి అభిమానులను నిరాశపరచింది. ఈ మ్యాచ్‌లో యు ముంబా జట్టు 27-25 పాయింట్ల తేడాతో తెలుగు టైనాన్స్ జట్టును ఓడించింది. ఆట ప్రారంభమైన ఐదు నిముషాల వరకూ 5-5 పాయింట్లతో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడుకున్న ముంబై జట్టు రైడింగ్‌లో షబ్బీర్ బాబు స్థానంలో రిషాంత్ దేవడిగను మార్పు చేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. దేవడిగ తొలి రెండు రైడ్లలోనే ఏడు పాయింట్లు సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. మ్యాచ్ విరామ సమయానికి 18-8 పాయింట్లతో ఆధిక్యతలో ఉన్న ముంబా జట్టు చివరి నిముషాల వరకూ 26-14 పాయింట్లతో ఆధిక్యాన్ని కొనసాగించింది. తెలుగు టైటాన్స్ జట్టు చివరి ఐదు నిముషాల్లో అత్యంత ప్రతిభ చూపి పోరాడింది. చివరి ఐదు నిముషాల్లో ఈ జట్టు 10 పాయింట్లు సాధించింది. అయితే, సమయం దాటిపోవడంతో చివరికి రెండు పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 35-29 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. వి రామ సమయానికి 25-9 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్న బెంగళూరు చివరకు 6 పాయింట్ల తేడాతో 35-29 పాయింట్లతో గెలిచింది.

అండర్-19 వరల్డ్ కప్
క్వార్టర్స్ చేరిన భారత్
మీర్పూర్, జనవరి 30: అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిన ఈ జట్టు 120 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. ఆల్‌రౌండర్ మహిమాల్ లొమ్‌రొర్ ప్రతిభ భారత్‌కు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగుల భారీ స్కోరు చేసింది. సర్ఫ్‌రాజ్ ఖాన్ 74, రిషబ్ పంత్ 57, అర్మాన్ జాఫర్ 46 పరుగులతో రాణించారు. మహిపాల్ 45 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 31.3 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. మహిమాల్ 47 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టగా, ఆవేష్ ఖాన్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 33 పరుగుల ఆధిక్యంతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో కెనడాపై విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌పై నేపాల్ సంచలన విజయాన్ని సాధించింది. ఐర్లాండ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 131 పరుగులు చేయగా, నేపాల్ మరో 147 బంతులు మిగిలి ఉండగానే, రెండువికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

సందీప్ విన్నింగ్ గోల్
పంజాబ్‌పై రాంచీ గెలుపు
హాకీ ఇండియా లీగ్
రాంచీ, జనవరి 30: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ కీలక గోల్ సాధించి, జేపీ పంజాబ్ వారియర్స్‌పై డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్‌కు విజయాన్ని అందించాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ మ్యాచ్ ఏడో నిమిషంలో వరుణ్ కుమార్ ద్వారా పంజాబ్‌కు తొలి గోల్ లభించింది. ఆ వెంటనే ఎదురుదాడికి దిగిన రాంచీకి 18వ నిమిషంలో కొతాజిత్ సింగ్, 28వ నిమిషంలో డానియల్ బియేల్ గోల్స్ చేసి, 2-1 ఆధిక్యాన్ని అందించారు. అయితే, మరో మూడు నిమిషాల్లోనే సత్బీర్ సింగ్ ద్వారా పంజాబ్‌కు ఈక్వెలైజర్ లభించింది. స్కోరు సమం కావడంతో ఇరు జట్లు విజయాన్ని అందించే గోల్ కోసం హోరాహోరీగా పోరాటం సాగించాయి. 43వ నిమిషంలో సందీప్ సింగ్ చేసిన గోల్‌తో 3-2 ఆధిక్యాన్ని సంపాదించిన రాంచీ అదే తేడాతో విజయభేరి మోగించింది.

గాగరేకు గ్రాండ్‌మాస్టర్ హోదా
ముంబయి, జనవరి 30: మహారాష్టక్రు చెందిన శార్దూల్ గాగరేకు గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది. ఇక్కడ జరుగుతున్న ఐఐఎఫ్‌ఎళ్ వెల్త్ ముంబయి ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో శేఖర్‌ను ఓడించిన అతను అత్యంత కీలకమైన చివరి నార్మ్‌ను సంపాదించి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు.
నారైన్‌కు టి-20 జట్టులో స్థానం
సెయింట్ జాన్స్, జనవరి 30: వివాదాస్పదమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్‌కు గురైన సునీల్ నారైన్‌కు ఈఏడాది భారత్‌లో జరిగే టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో స్థానం లభించింది. గత ఏడాది నవంబర్‌లో నారైన్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు ఫిర్యాదు చేయడంతో ఐసిసి అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అయితే, టి-20 వరల్డ్ కప్ ఆరంభమయ్యేలోగా అతను క్లీన్‌చిట్ పొందుతాడన్న నమ్మకంతో జట్టులోకి తీసుకున్నారు.