క్రీడాభూమి

క్రీడా రంగంలో 8 మందికి ‘పద్మశ్రీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీసహా మొత్తం ఎనిమిది మంది ఎంపికయ్యారు. వీరిలో అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ శేఖర్ నాయక్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, పారాలింపిక్స్ పతక విజేతలు తంగవేలు పరియప్పన్, దీపా మాలిక్, రియోలో కాంస్యాన్ని తృటిలో చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, భారత హాకీ జట్టు సారథి పిఆర్ శ్రీజేష్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఉన్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులకు క్రీడాకారులు ఎవరూ ఎంపిక కాలేదు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బాడ్మింటన్ స్టార్ పివి సింధు, జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్లు పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించారు. కానీ, అవార్డుల కమిటీ వీరిలో ఎవరినీ ఎంపిక చేయలేదు.
ప్రతిభావంతుడు కోహ్లీ
ఇప్పటి వరకూ భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన వారికి పూర్తి భిన్నంగా, మైదానంలో దూకుడుగా వ్యవహరించే విరాట్ కోహ్లీ అత్యంత ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకటిగా గుర్తింపు సంపాదించాడు. 2014 చివరిలో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలే వనే్డ, టి-20 నాయకత్వ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడంతో, ఆ ఫార్మాట్లలోనూ పగ్గాలు కోహ్లీకి లభించాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు, వనే్డ సిరీస్‌ల్లో జట్టుకు విజయాలను సాధించిపెట్టిన కోహ్లీ ఇప్పుడు టి-20 సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. మొత్తం మీద సమర్థుడికి తగిన గుర్తింపు లభించింది.
సంచలనాల సాక్షి
రియో ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా సంచలనాల సాక్షి పేరు యావత్ దేశంలో మారుపోగింది. భారత జట్టుకు ఒక్క పతకం కూడా దక్కలేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో, సాక్షి సాధించిన పతకం అందరికీ ఊరటనిచ్చింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, బాడ్మింటన్‌లో పివి సింధు రజత పతకాన్ని దేశానికి అందించింది. రియోలో భారత్‌కు లభించినవి ఈరెండు పతకాలే. కిర్గిస్థాన్‌కు చెందిన అయిసలు తినిబెకొవాతో అత్యంత కీలక బౌట్‌లో తలపడి 0-5 తేడాతో వెనుకబడిన సాక్షి అనూహ్యంగా ఎదురుదాడికి దిగి, ప్రత్యర్థిని మట్టికరిపించడం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
పోరాట స్ఫూర్తి దీప
రియో ఒలింపిక్స్‌లో భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చున్నప్పటికీ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అయితే, ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో బందూ బోస్లే పాల్గొన్నాడు. అతని తర్వాత ఒలింపిక్స్‌కు భారత్ తరఫున పాల్గొన్న రెండో జిమ్నాస్ట్‌గా దీప పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అత్యంత ప్రమాదరకమైది కాబట్టి, ఎక్కువ మంది ప్రయత్నించని ప్రొడునొవా విన్యాసాన్ని ఎంతో దీక్షతో ప్రాక్టీస్ చేసిన దీప తన ప్రత్యేకతను చాటుకొని, పద్మ అవార్డుకు ఎంపికైంది.
మేటి హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్
భారత హాకీ చరిత్రలోనే అత్యుత్తమ గోల్‌కీపర్లలో ఒకడిగా ఎదిగిన శ్రీజేష్ ఇప్పుడు నాయకత్వ బాధ్యతలను కూడా సమర్థంగా పోషిస్తున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్, 2014 వరల్డ్ కప్‌లో ఆడాడు. 2014లోనే దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో, ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. శ్రీజేష్ అసాధారణ ప్రతిభ కనబరచడంతో, ఆ మ్యాచ్‌ని భారత్ 6-5 తేడాతో గెల్చుకుంది. అదే ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఉత్తమ కీపర్‌గా అవార్డు తీసుకున్నాడు. నిరుడు జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అతని నాయకత్వంలో భారత జట్టు టైటిల్ సాధించింది.
డిస్కస్‌త్రో వీరుడు వికాస్
అంతర్జాతీయ వేదికలపై డిస్కస్‌త్రోలో ప్రధానంగా వినిపించే భారత అథ్లెట్ పేరు వికాస్ గౌడ. అమెరికాలో స్థిరపడినప్పటికీ, భారత్ తరఫున పోటీల్లో పాల్గొంటున్న కామనె్వల్త్ గేమ్స్‌లో ఒక స్వర్ణం (2014), ఒక రజతం (2010) సాధించాడు. ఆసియా క్రీడల్లో అతనికి రెండు పతకాలు లభించాయి. 2010లో కాంస్య పతకాన్ని, 2014లో రజత పతకాన్ని అతను స్వీకరించాడు. ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో ఐదు పతకాలు కైవసం చేసుకున్నాడు. 2013, 2015 సంవత్సరాల్లో స్వర్ణ పతకాలను సాధించాడు. 2011లో రజతం, 2005లో కాంస్య పతకం అతను దక్కించుకున్నాడు. ఇనే్నళ్లకు అతని కృషికి తగిన గుర్తింపు లభించింది.
క్రికెట్‌లో మేటి శేఖర్
అంధత్వం అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ, పట్టుదలతో కృషి చేసి, క్రికెట్‌లో ఉన్నత ప్రమాణాలను అందుకున్నాడు శేఖర్ నాయక్. ఒక్కో మెట్టు ఎక్కుతూ, భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రపంచ టి-20 చాంపియన్‌షిప్‌ను సాధించిపెట్టాడు. అతని సేవలను ప్రభుత్వం గుర్తించింది. పద్మశ్రీ అవార్డును అందుకున్న తొలి అంధ క్రికెటర్‌గా శేఖర్ చరిత్రకెక్కాడు.

పారాథెట్లకు గుర్తింపు
న్యూఢిల్లీ: పారాథెట్లకు మొట్టమొదటిసారి పద్మశ్రీ అవార్డు దక్కింది. రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తంగవేలు మరియప్పన్, దీపా మాలిక్‌లను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. పేదరికాన్ని జయించి, అంగవైకల్యాన్ని ఎదిరించి, హైజంప్ ప్రాక్టీస్ చేసిన తంగవేలు రియో పారాలింపిక్స్ టి-42 విభాగంలో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఫైనల్‌లో అతను 5.10 అడుగల ఎత్తును సమర్థంగా పూర్తిచేసి విజేతగా నిలిచాడు. కాగా, వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికీ, మొక్కవోని దీక్షతో షాట్‌పుట్‌ను ప్రాక్టీస్ చేసిన దీప రియోలో రజత పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒక పతకాన్ని అందించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్‌తోపాటు పలు సాహస క్రీడల్లోనూ రాణిస్తూ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలస్తున్నది. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన తొలి పారాలింపియన్లుగా తంగవేలు, దీపా మాలిక్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు.