క్రీడాభూమి

ఆసీస్‌కు వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 31: ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన భారత క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని ఈ జట్టు టి-20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి క్షణం వరకూ విజయం కోసం ప్రయత్నించినప్పటికీ ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ తప్పలేదు. చివరి బంతిని ఫోర్‌గా మలచిన సురేష్ రైనా విన్నింగ్ షాట్‌తో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. చివరి మ్యాచ్ ఆరంభానికి ముందే టి-20 సిరీస్‌ను 0-2 తేడాతో ఓడిన ఆస్ట్రేలియా జట్టు రెగ్యులర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న కారణంగా షేన్ వాట్సన్ నాయకత్వంలో బరిలోకి దిగింది. టాస్ గెలిచిన వాట్సన్ బ్యాటింగ్ ఎంచుకొని, కెరీర్‌లో తొలి టి-20 ఆడిన ఉస్మాన్ ఖాజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే, 16 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరు బంతుల్లో 14 పరుగులు చేసిన ఖాజాను ధోనీ క్యాచ్ అందుకోగా ఆశిష్ నెహ్రా పెవిలియన్ దారి పట్టించాడు. షాన్ మార్ష్ 9 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కాగా, మాక్స్‌వెల్ మూడు పరుగులకే యువరాజ్ సింగ్ బంతిని సక్రమంగా ఆడలేక సురేష్ రైనాకు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు కూలుతున్నప్పటికీ రెండోవైపు వాట్సన్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ట్రావిస్ హెడ్ 26 పరుగులు చేసి అతనికి అండగా నిలిచే ప్రయత్నం చేశాడు. అయితే, జడేజా వేసిన ఒక అద్భుతమైన బంతికి అతను అవుటయ్యాడు. క్రిస్ లిన్ 13 పరుగులు చేసి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జడేజాకు చిక్కి వెనుదిరిగాడు. చివరిలో కామెరొన్ బాన్‌క్రాఫ్ట్ ఒక బంతిని ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండా నాటౌట్‌గా నిలవగా, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన వాట్సన్ 124 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 86 నిమిషాలు ఆడిన అతను 71 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. భారత బౌలర్లలో ఆరుగురు బౌలింగ్ చేయగా, హార్దిక్ పాండ్య మినహా మిగతా ఐదుగురు, ఆశిష్ నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు. పాండ్య రెండు ఓవర్లలో 24 పరుగులు సమర్పించుకున్నాడుగానీ వికెట్ దక్కలేదు.
పరుగుల వేట
విజయానికి అవసరమైన 198 పరుగులను సాధించేందుకు భారత జట్టు ఆరంభం నుంచే వేగంగా ముందుకు దూకింది. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శిఖర్ ధావన్ కేవలం 9 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 46 పరుగుల వద్ద వాట్సన్ బౌలింగ్‌లో అతను బాన్‌క్రాఫ్ట్ క్యాచ్ పట్టగా వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటిగ్‌కు దిగిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ స్కోరు రెండో వికెట్‌కు 78 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించాడు. 38 బంతుల్లో అతను ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసి బాయిస్ బౌలింగ్‌లో వాట్సన్‌కు దొరికిపోయాడు. కోహ్లీ 36 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేసి బాయిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌కావడంతో భారత్ 147 పరుగుల వద్ద మూడో వికెట్‌ను చేజార్చుకుంది. ఆతర్వాత జట్టును గెలిపించే బాధ్యతను సురేష్ రైనా, యువరాజ్ సింగ్ స్వీకరించారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు స్కోరుబోర్డును దూకించే ప్రయత్నం చేశారు. అయితే, ఆస్ట్రేలియా ఫీల్డింగ్ అద్భుతంగా ఉన్న కారణంగా భారత్ అనుకున్నంత వేగంగా లక్ష్యం దిశగా పరుగులు తీయలేకపోయింది.
చివరి ఓవర్‌లో ఉత్కంఠ
భారత ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్ ఉత్కంఠ రేపింది. చివరి ఆరు బంతుల్లో విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. ఆండ్రూ టే వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని యువరాజ్ ఫోర్‌గా మార్చాడు. రెండో బంతిని సిక్స్ కొట్టాడు. మూడో బంతి వికెట్లకు దూరంగా దూసుకెళ్లగా, యువీ సింగిల్ తీయడంతో స్ట్రయికింగ్ సురేష్ రైనాకు లభించింది. ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు టీమిండియా ఆరు పరుగుల దూరంలో ఉంది. నాలుగో బంతిలో రెండు పరుగులు చేసిన రైనా ఐదో బంతిలోనూ మరో రెండు పరుగులు సాధించాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరంకాగా, దానిని రైనా ఫోర్‌గా మార్చాడు. అతని విన్నింగ్ షాట్‌తో భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లకు 200 పరుగులకు చేరుకొని, ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయభేరి మోగించింది.
అద్భుత సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్ షేన్ వాట్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

* ద్వైపాక్షిక టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు కంటే ఎక్కువ అర్ధ శతకాలను సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌లో అతను మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 90 (నాటౌట్), 59 (నాటౌట్), 50 చొప్పున పరుగులు సాధించాడు.
* ఆస్ట్రేలియా, భారత జట్లు తమతమ ఇన్నింగ్స్ మొదటి ఆరు ఓవర్లలో 131 పరుగులు చేశాయి. ఆస్ట్రేలియాలో జరిగిన టి-20 మ్యాచ్‌ల్లో ఇదే అత్యంత వేగవంతమైన స్కోరు. గతంలో సిడ్నీ మైదానంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మొదటి ఆరు ఓవర్లలో 126 పరుగులు జోడించాయి. ఆ రికార్డు ఆదివారం బద్దలైంది.
* షాన్ టైట్ తన మూడో ఓవర్‌లో 24 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్‌పై ఒక బౌలర్ టి-20 మ్యాచ్‌ల్లో ఇచ్చిన అత్యధిక పరుగుల జాబితాలో ఇది మూడోది. 2007లో దర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ 36, 2010 సంవత్సరంలో గ్రాస్ ఇస్లెట్ మ్యాచ్‌లో క్లెవెడెట్ 25 చొప్పున పరుగులిచ్చి, జాబితాలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకున్నారు.

విరాట్ కోహ్లీ