క్రీడాభూమి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం వాట్సన్‌కు రూ. 9.5 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో ఈసారి ఆస్ట్రేలియా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు అత్యధికంగా 9.5 కోట్ల రూపాయలు లభించాయి. భారత ఆటగాడు యువరాజ్ సింగ్‌కు అత్యధిక మొత్తం లభిస్తుందని, అతనే ఈసారి ఐపిఎల్‌లో రికార్డు మొత్తాన్ని పొందుతాడని అందరూ ఊహించినప్పటికీ, అందుకు భిన్నంగా 34 ఏళ్ల వాట్సన్‌కు అత్యధిక ధర పలికింది. భారత్‌తో జరిగిన చివరి టి-20 మ్యాచ్‌లో అద్భుత సెంచరీని నమోదు చేయడం అతని భారీ ధరకు ఒకానొక కారణమైంది. దీనితో యువీ రేసులో వెనుకబడ్డాడు. డాలర్లలో చూస్తే వాట్సన్‌కు 1.39 మిలియన్ డాలర్లు లభించాయి. ఈ వేలం పాటలో మిలియన్ డాలర్ల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ అతనే. మూడు ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీపడగా, అత్యధిక ధరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) అతనిని దక్కించుకుంది. మొత్తం 351 మంది ఆటగాళ్లను ఈ వేలంలో చేర్చారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై రెండేసి సంవత్సరాల వేటు పడగా, ఆ రెండు జట్లలోని ఆటగాళ్లు కూడా చేరడంతో ఈవేలం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యువీకి భారీ ధర లభిస్తుందన్న అభిప్రాయం చివరి క్షణం వరకూ వ్యక్తమైంది. కానీ, ఆటగాళ్లందరిలోనూ షేన్ వాట్నన్, భారతీయుల్లో పవన్ నేగీ భారీ మొత్తాలను సంపాదించుకోగా, గత ఏడాది రికార్డు మొత్తాన్ని దక్కించుకున్న యువీ దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌తో కలిసి ఈఏడు తృతీయ స్థానాన్ని పంచుకోవాల్సి వచ్చింది.
నేగీకి భారీ ధర
యువ ఆటగాడు పవన్ నేగీకి భారత క్రికెటర్లు అందరిలోకీ భారీ ధర పలికింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అతనికి ఏకంగా 8.5 కోట్ల రూపాయలు చెల్లించింది. శ్రీలంకతో టి-20 సిరీస్‌లో ఆడబోయే టీమిండియా జట్టుకు ఎంపికైన అతనికి ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్థానం దక్కింది. ఈ ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అతనికి మరో జాక్‌పాట్ తగిలింది. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి వెళ్లిన అతనికి ఏకంగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు లభించాయి. 2011 వరల్డ్ కప్‌ను భారత్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ కంటే నేగీకి ఎక్కువ మొత్తం లభించడం విచిత్రం. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల ఈ యువ ఎడమ చేతివాటం బౌలర్ కెరీర్‌లో కేవలం రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 54 పరుగులు చేశాడు. 126 బంతులు బౌల్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. గతంలో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. మొత్తం మీద 56 టి-20 మ్యాచ్‌ల్లో సగటున 19.16 పరుగులు సాధించాడు. 46 వికెట్లు కూల్చాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి, తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. మొత్తం మీద గణాంకాలుగానీ, సామర్థ్యంగానీ అతనిని ఐపిఎల్ వేలంలో అత్యుత్తమ భారత క్రికెటర్‌గా నిలబెట్టలేవు. కానీ, ఎవరూ అనుకోని విధంగా అతనికి అత్యధిక ధర పలికింది.