క్రీడాభూమి

దక్షిణాసియా గేమ్స్‌లో భారత్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల హాకీలో గోల్స్ వరద
దక్షిణాసియా గేమ్స్ మహిళల హాకీలో భారత్ గోల్స్ వరద పారించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ను 24-0 తేడాతో చిత్తుచేసింది. భారత్‌కు ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌గా కనిపించగా, నేపాల్ ఎలాంటి ప్రతిఘటన ఇవ్వలేక చేతులెత్తేసింది. భారత్ తరఫున సౌందర్య యెండెల, పూనమ్ బర్లా చెరి నాలుగు గోల్స్ చేశారు. రాణి, జస్‌ప్రీత్ కౌర్, నేహా గోయల్, దీపిక తలా మూడు గోల్స్ సాధించారు. గుర్జీత్ కౌర్, ప్రీతి డూబీ చెరి రెండేసి గోల్స్ నమోదు చేశారు. 36 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన భారత మహిళల హాకీ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, పతకంపై ఆశలు పెంచింది.

గౌహతి: దక్షిణాసియా గేమ్స్ (శాగ్)లో భారత్ దూకుడును కొనసాగిస్తున్నది. రెజ్లింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆర్చరీలో క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. ఆదివారం నాటి పోటీలు ముగిసే సమయానికి భారత్ 28 స్వర్ణం, 12 రజతం, 3 కాంస్యాలతో మొత్తం 43 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంక 8 స్వర్ణం, 17 రజతం, 13 కాంస్యాలతో మొత్తం 38 పతకాలు కైవసం చేసుకొని రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ 13 (2 స్వర్ణం, 3 రజతం, 13 కాంస్యం), బంగ్లాదేశ్ 18 (2 స్వర్ణం, 3 రజతం, 13 కాంస్యం), నేపాల్ 8 (3 రజతం, 5 కాంస్యం), అఫ్గానిస్తాన్ 4 (ఒక రజతం, 3 కాంస్యం) పతకాలను సాధించాయి.
స్విమ్మింగ్: ఈత కొలనులో భారత్‌కు ఆదివారం పది పతకాలు లభించాయి. వీటిలో నాలుగు స్వర్ణాలు. ఐదు గేమ్స్ రికార్డులు కూడా నమోదయ్యాయి.
లిఫ్టింగ్‌లో మరో మూడు స్వర్ణాలు
వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో మూడు స్వర్ణాలు లభించాయి. మహిళల 58 కిలోల విభాగంలో సరస్వతి రౌత్, 69 కిలోల విభాగంలో సాంబూ లాపంగ్, 77 కిలోల విభాగంలో అజయ్ సింగ్ భారత్‌కు స్వర్ణాలను అందించారు. తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన సరస్వతి స్నాచ్‌లో 80, క్లీన్ అండ్ జెర్క్‌లో 107 కిలోల బరువునెత్తింది. మొత్తం 187 కిలోలను ఎత్తిన ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, 144 (స్నాచ్ 63, క్లీన్ అండ్ జెర్క్ 81) కిలోల బరువునెత్తి బంగ్లాదేశ్ లిఫ్టర్ ఫలాపటి చక్మా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకకు చెందిన మొహిదీన్ ఉమేరియా స్నాచ్‌లో 61, క్లీన్ అండ్ జెర్క్‌లో 81 చొప్పున మొత్తం 142 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని అందుకుంది. కాగా, పురుషుల 69 కిలోల విభాగంలో లాపంగ్ మొత్తం 281 కిలోల బరువునెత్తాడు. శ్రీలంకకు చెందిన దిశనాయకే కూడా అనే్న కిలోల బరువునెత్తడంతో ఇద్దరి మధ్య టై ఏర్పడింది. అయితే, శరీర బరువును ప్రాతిపదికగా తీసుకొని లాపంగ్‌ను విజేతగా ప్రకటించారు. అతని బరువు 68.8 కిలోలుకాగా, దిశనాయకే బరవు 69 కిలోలు. ఈ తేడానే లాపంగ్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. పాకిస్తాన్‌కు చెందిన సుఫియా అబూ 275 కిలోల బరువునెత్తి కాంస్య పతకాన్ని సాధించాడు. కాగా, 77 కిలోల విభాగంలో అజయ్ సింగ్ స్నాచ్‌లో 136, క్లీన్ అండ్ జెర్క్‌లో 169 చొప్పున మొత్తం 305 కిలోల బరువునెత్తి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. శ్రీలంకకు చెందిన చింతనా (300 కిలోలు) రజత పతకాన్ని సాధించగా, పాకిస్తాన్‌కు చెందిన ఉమర్ రసూల్ (281 కిలోలు) కాంస్య పతకాన్ని స్వీకరించాడు. వెయిట్ లిఫ్టింగ్‌లో శనివారం భారత్ మూడు స్వర్ణ పతకాలను గెల్చుకున్న విషయం తెలిసిందే.
ఆర్చరీలో క్లీన్‌స్వీప్ ఖాయం: ఆర్చరీలో భారత్ క్లీన్‌స్వీప్ సాధించడాన్ని ఖాయం చేసుకుంది. రికర్వ్, కాంపౌండ్ టీం ఈవెంట్స్‌తోపాటు మిక్స్ పెయిర్ ఈవెంట్‌లోనూ భారత్ ఫైనల్స్ చేరడంతో, ఈ పోటీల్లోని 10 స్వర్ణ పతకాలను కూడా సొంతం చేసుకోవడం ఖాయమైంది. మహిళలు, పురుషుల ఇండివిజువల్ ఈవెంట్స్‌లో భారత్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈవెంట్స్‌లో పురుషుల కాంపౌండ్, మహిళల రికర్వ్ జట్లు సెమీ ఫైనల్స్‌ను సమర్థంగా పూర్తి చేసి, ఫైనల్ చేరాయి. ఫైనల్‌లో ఈరెండు జట్లు శ్రీలంకకు చెందిన పురుషులు, మహిళల జట్లను ఢీ కొంటాయి. పురుషుల కాంపౌండ్ ఈవెంట్‌లో భూటాన్‌తో భారత జట్టు తలపడుతుంది. మహిళల విభాగంలో బంగ్లాదేశ్‌ను భారత్ ఎదుర్కొంటుంది.
మిక్స్‌డ్ కర్వ్‌లో తరుణ్‌దీప్ రాయ్‌తో కలిసి బరిలోకి దిగిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఎలాంటి ఆటంకం లేకుండా విజయభేరి మోగించిన ఈ జోడీ టైటిల్ కోసం బంగ్లాదేశ్‌కు చెందిన జోడీతో తలపడుతుంది. మిక్స్‌డ్ కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన జోడీని అభిషేక్ వర్మ, పూర్వాషా షిండే ఢీ కొంటారు.
సైక్లింగ్: సైక్లింగ్‌లో భారత్‌కు ఆదివారం మూడు పతకాలను లభించాయి. వీటిలో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకాలున్నాయి. మహిళల 40 కిలోమీటర్ల క్రటెరియం ఈవెంట్‌లో భారత్‌కు చెందిన లిడియామోల్ సన్నీ, తొంగ్‌బ్రామ్ మనోరమ దేవి వరుసగా స్వర్ణ, రజత పతకాలను సాధించారు. కాంస్య పతకాన్ని సుధారికా ప్రియదర్శిని (శ్రీలంక) గెల్చుకుంది. సన్నీకి 30 పాయింట్లు లభించగా, మనోరమకు 26 పాయింట్లు దక్కాయి. ఒక్కో సైక్లిస్టు, ఒకొక్కటి 5 కిలోమీటర్ల దూరం ఉండే ఎనిమిది ల్యాప్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా, పురుషుల 60 కిలోమీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు పంకజ్ కుమార్ కాంస్య పతకాన్ని అందించాడు. ఈ విభాగంలో జీవన్ మంజుల జయసింఘె సిల్వ (శ్రీలంక) స్వర్ణ పతకాన్ని సాధించగా, నవీన్ రుచిర అపుహమీ (శ్రీలంక) రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
స్క్వాష్‌లో నిరాశే: స్క్వాష్‌లో ఆదివారం భారత్‌కు నిరాశ తప్పలేదు. టాప్ ఆటగాళ్లు సౌరవ్ గోసల్, హరీందర్ పాల్ సింగ్ సంధు పాకిస్తాన్‌కు చెందిన తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను ఎదుర్కొన్నారు. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన గోసల్ 4-11, 5-11, 12-10, 5-11 తేడాతో ఫర్హాన్ జమాన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. నాసిర్ ఇక్బాల్‌తో తలపడిన సంధు 7-11, 14-12, 7-11 తేడాతో వెనుకబడ్డాడు. నాలుగో సెట్‌లో చెరి ఆరు పాయింట్లు సంపాదించారు. ఈ దశలో కండరాలు బెణకడంతో సంధు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలావుంటే, మహిళల విభాగంలో జోత్న్స చిన్నప్ప 11-9, 11-7, 11-5 తేడాతో పాకిస్తాన్‌కు చెందిన సైదా గుల్‌పై విజయాన్ని సాధించి, అభిమానులకు ఊరటనిచ్చింది.
ఉషులో రెండు పతకాలు: మహిళల ఉషు పోటీల్లో భారత్‌కు ఆదివారం రెండు పతకాలు లభించాయి. సప్నా దేవి స్వర్ణ పతకాన్ని అందుకోగా, అంజుల్ నాందియో కాంస్య పతకాన్ని సాధించింది.
బాడ్మింటన్‌లో శుభారంభం: బాడ్మింటన్‌లో భారత్ శుభారంభాన్ని చేసింది. మహిళల సింగిల్స్‌లో పివి సింధు కేవలం 15 నిమిషాల్లోనే సారా దేవి తమాంగ్‌ను 21-2, 21-8 తేడాతో చిత్తుచేసింది. 18 ఏళ్ల గాదే రుత్వికా శివానీ 21-6, 21-2 ఆధిక్యంతో నంగ్‌సల్ తమాంగ్‌పై గెలిచింది. ఈ మ్యాచ్ కూడా కేవలం 15 నిమిషాల్లోనే ముగిసింది. అనంతరం డబుల్స్ విభాగంలో అశ్వినీ పొన్నప్పతో కలిసి బరిలోకి దిగిన సింధు 21-10, 21-8 ఆధిక్యంతో సారా దేవి, నంగ్‌సల్ తమాంగ్ జోడీపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్, అక్షయ్ దివాల్కర్/ప్రణయ్ చోప్రా తమతమ విభాగాల్లో విజయాలు సాధించారు.

చిత్రం... మహిళల వెయిట్ లిఫ్టింగ్ 56 కిలోల విభాగంలో
పతకాలు సాధించిన లిఫ్టర్లు (ఎడమ నుంచి కుడికి)
ఫలాపటి చక్మా (బంగ్లాదేశ్/ రజతం), సరస్వతి రౌత్ (్భరత్/ స్వర్ణం), మొహిదీన్ ఉమేరియా (శ్రీలంక/ కాంస్యం)

సత్తా చాటుతున్న భారత ఆర్చర్ దీపికా కుమారి