క్రీడాభూమి

ముగ్గురు మొనగాళ్ల జోరుకు బెంబేలెత్తిన ఆసీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, మార్చి 27: కంగారూలతో జరుగుతున్న నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా రంగాన్ని సిద్ధం చేసుకుంది. ధర్మశాలలోని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) స్టేడియంలో జరుగుతున్న నిర్ణాయక చివరి మ్యాచ్‌లో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను కేవలం 137 పరుగులకే కుప్పకూల్చి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశారు. అనంతరం 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు సాధించిన భారత జట్టు విజయానికి మరో 87 పరుగుల దూరంలో నిలిచింది. 63 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడంతో పాటు 18 ఓవర్లలో ప్రత్యర్థులకు 24 పరుగులిచ్చి 3 వికెట్లు కైవసం చేసుకుని ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించిన రవీంద్ర జడేజా సోమవారం ఈ మ్యాచ్‌లో స్టార్ పెర్ఫార్మర్‌గా నిలువగా, అతనికి తోడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (3/29), పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ (3/29) పదునైన బంతులతో విజృంభించి 53.5 ఓవర్లకే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జడేజా అర్థ శతకంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులను రాబట్టుకోవడం, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేలవమైన షాట్‌ను ఎంచుకుని భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో నిష్క్రమించడం ఈ మ్యాచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చాయి.
అంతకుముందు 6 వికెట్ల నష్టానికి 248 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టుకు నైట్‌వాచ్‌మన్లు వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా 96 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం జడేజా (95 బంతుల్లో 63 పరుగులు) ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో 317 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన భారత జట్టు మరో పరుగుకే భువనే్వశర్ కుమార్ (0), వృద్ధిమాన్ సాహా (102 బంతుల్లో 31 పరుగులు) వికెట్లతో పాటు ఇంకో 14 పరుగులకు కుల్దీప్ యాదవ్ వికెట్లను కూడా చేజార్చుకోగా, ఉమేష్ యాదవ్ (2) అజేయంగా నిలిచాడు. దీంతో 118.1 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యత సాధించింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ 5 వికెట్లు కైవసం చేసుకోగా, ప్యాట్ కమ్మిన్స్‌కు 3 వికెట్లు, జోష్ హాజెల్‌వుడ్, స్టీవ్ ఒకీఫ్‌లకు చెరో వికెట్ లభించాయి.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుపై భారత బౌలర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరిగారు. ఓపెనర్లు మ్యాట్ రెన్షా (8), డేవిడ్ వార్నర్ (6)లను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ (17)ను భువనేశ్వర్ కుమార్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 31 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్థిమితంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత పీటర్ హ్యాండ్స్‌కూంబ్ (18) అశ్విన్ బౌలింగ్‌లో అజింక్యా రహానే చేతికి చిక్కగా, అతని స్థానంలో వచ్చిన షాన్ మార్ష్ (1) జడేజా బౌలింగ్‌లోనూ, మ్యాక్స్‌వెల్ (45) అశ్విన్ బౌలింగ్‌లోనూ నిష్క్రమించారు. ఆ తర్వాత వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ (25-నాటౌట్), ప్యాట్ కమ్మిన్స్ (12) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరడంతో ఆస్ట్రేలియా జట్టు 53.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు సాధించింది. ఓపెనర్లు లోకేష్ రాహుల్ (13), మురళీ విజయ్ (6) మంగళవారం టీమిండియా ఇన్నింగ్స్‌ను కొనసాగించనున్నారు.

చిత్రాలు..ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించిన రవీంద్ర జడేజా
* బౌలింగ్‌లో దుమ్ము రేపిన రవిచంద్రన్ అశ్విన్ (3/29), ఉమేష్ యాదవ్ (3/29)