క్రీడాభూమి

ప్లే ఆఫ్‌లో స్థానమే సన్‌రైజర్స్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, మే 12: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగే పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇప్పటి వరకూ జరిగిన 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఏడింటిని గెల్చుకుంది. ఐదు పరాజయాలను ఎదుర్కొంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొత్తం మీద 15 పాయింట్లు సంపాదించిన డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. 13 మ్యాచ్‌ల్లో కేవలం 8 పాయింట్లు సాధించిన గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కాబట్టి శనివారం నాటి మ్యాచ్ ఫలితం వల్ల ఆ జట్టుకు ఎలాంటి లాభం లేదా నష్టం లేదు. అందుకే, చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆ జట్టు ఒత్తిడి లేకుండా ఆడనుండగా, ప్లే ఆఫ్‌లో స్థానం సంపాదించడానికి తప్పనిసరిగా గెలవాలన్న ఆలోచన సహజంగానే సన్‌రైజర్స్‌పై ఒత్తిడిని పెంచనుంది. కాగితంపై చూస్తే సురేష్ రైనా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గుజరాత్ కంటే సన్‌రైజర్స్ పటిష్టంగా కనిపిస్తున్నది. ఈసారి పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్, ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ ఈ జట్టులోని వారే కావడం విశేషం. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 535 పరుగులు సాధిస్తే, శిఖర్ ధావన్ కూడా మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతను ఇప్పటి వరకూ 450 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగానికి వస్తే, భువనేశ్వర్ కుమార్ మొత్తం 23 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. సిద్ధార్థ్ కౌల్ 15, రషీద్ ఖాన్ 14 చొప్పున వికెట్లు పడగొట్టి సత్తా నిరూపించుకున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో బలంగా ఉన్న సన్‌రైజర్స్ శనివారం నాటి మ్యాచ్‌లో ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది.
సురేష్ రైనా నాయకత్వంలోని గుజరాత్ నిలకడ లేని కారణంగా, ఎప్పుడు ఏ విధంగా ఆడుతుందో తెలియని పరిస్థితి. రైనా ఈ టోర్నీలో ఇంత వరకూ 440 పరుగులు చేసి, ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో 10న జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 69 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, 28 బంతుల్లో 40 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ తమను తాము నిరూపించుకున్నారు. వీరి ప్రతిభతోనే గుజరాత్ ఆ మ్యాచ్‌లో 5 వికెట్లకు 195 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే, శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 96 పరుగులు సాధించడంతో, డేర్‌డెవిల్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా, రెండు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్ తృటిలో చేజారినప్పటికీ, గుజరాత్ బ్యాటింగ్ బలాన్ని నిరూపించింది. ఈ విభాగంలో మెరుగ్గా ఉన్నప్పటికీ, బౌలింగ్ మాత్రం గుజరాత్ కెప్టెన్ రైనాను తీవ్రంగా వేధిస్తున్నది. హ్యాట్రిక్ వీరుడు ఆండ్రూ టై గాయపడడం ఆ జట్టును బౌలింగ్‌లో బలహీన పరచింది. అయితే, బాసిల్ థంపి, జేమ్స్ ఫాల్క్‌నెర్ తదితరులు రాణించే అవకాశాలున్నాయి. స్థూలంగా చూస్తే మాత్రం, సన్‌రైజర్స్‌ను ఓడించడం గుజరాత్‌కు సాధ్యం కాదనే అనుకోవాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్‌కు దూసుకుపోయే వార్నర్ బృందం అందుకు విరుద్ధమైన ఫలితం వస్తే మాత్రం పంజాబ్‌పై పుణే సూపర్‌జెయింట్ విజయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.
(కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మరో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ ఢీ కొంటాయి).

ఓడితే ఏమవుతుంది?
గుజరాత్ లయన్స్‌తో శనివారం జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ దశకు చేరే అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోయినట్టేనా? ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే, ఒకవేళ గుజరాత్ చేతిలో ఓడినా ఈ జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అయితే, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం సన్‌రైజర్స్‌కు అనుకూలంగా ఉండాలి. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌పై పుణే సూపర్‌జెయింట్ గెలిస్తేనే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ చేరుతుంది. లేకపోతే, టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అందుకే, గణాంకాలతో పనిలేకుండా, ఇతర మ్యాచ్‌లతో సంబంధం లేకుండా, గుజరాత్‌ను ఓడించి ప్లే ఆఫ్ చేరాలన్నది వార్నర్ సేన లక్ష్యంగా కనిపిస్తున్నది.