క్రీడాభూమి

నువ్వా? నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 18: పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడే అవకాశాన్ని దక్కించుకోవడానికి తహతహలాడుతున్న ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్ చివరి వరకూ ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తున్నది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగ్గా, చివరికి డక్‌వర్త్ లూయిస్ విధానాన్ని అమలు చేసిన ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి నైట్ రైడర్స్ రెండో క్వాలిఫయర్‌కు అర్హత సంపాదించగా, మొదటి క్వాలిఫయర్‌లో పుణే సూపర్‌జెయింట్ చేతిలో అనూహ్యంగా ఓడినప్పటికీ, గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్లలో రెండు స్థానాన్ని ఆక్రమించడం ద్వారా రెండో క్వాలిఫయర్‌కు ముంబయి క్వాలిఫై అయింది. కాగా, గ్రూప్ దశలో రెండు పర్యాయాలు నైట్ రైడర్స్‌ను ఓడించిన రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి మరోసారి అదే స్థాయిలో రాణించి, ఫైనల్‌కు దూసుకెళతానన్న ధీమాతో ఉంది. హోం గ్రౌండ్ వాంఖడేలో నైట్ రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌ని, ఒక బంతి మిగిలి ఉండగా, నాలుగు వికెట్ల తేడాతో ముంబయి గెల్చుకుంది. విజయానికి చివరి 24 బంతుల్లో 60 పరుగులు అవసరంకాగా, హార్దిక్ పాండ్య 11 బంతుల్లోనే 29 పరుగులు సాధించి, ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నైట్ రైడర్స్‌తో రెండో మ్యాచ్‌ని రోహిత్ సేన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడింది. చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్‌ని ముంబయి తొమ్మిది పరుగుల తేడాతో తన ఖాతాలో వేసుకుంది. గౌతం గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నైట్ రైడర్స్‌ను ముచ్చటగా మూడోసారి ఓడించి, ఈ నెల 21న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్ చేరాలన్నది ముంబయి లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు లెండల్ సిమన్స్, పార్థీవ్ పటేల్, కీరన్ పొలార్డ్, నితీష్ రాణా వంటి గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ ప్రత్యర్థి బౌలింగ్‌ను చిత్తు చేయగల సమర్థులే. అత్యంత కీలకమైన పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడానికి పాండ్య సోదరులు కృణాల్, హార్దిక్ సిద్ధంగా ఉంటారు. వీరిద్దరూ ఆల్‌రుండర్లుగా ముంబయికి సేవలు అందిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే, శ్రీలంక పేసర్ లసిత్ మలింగ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్‌క్లీనగన్ ముంబయిని బలాన్ని పెంచుతున్నారు. డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల నిపుణుడిగా జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత సేవలు అందిస్తున్నాడు. కాగితంపై చూస్తే, నైట్ రైడర్స్ కంటే ముంబయి బలంగా కనిపిస్తున్నది. కానీ, పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మాదిరిగానే ఈ జట్టు నిర్లక్ష్యంగా ఆడితే ఫలితం నైట్ రైడర్స్‌కు అనుకూలంగా మారవచ్చు. ఈ విషయంలో ముంబయి జాగ్రత్త పడాలి.
కొత్త ఉత్సాహం
వర్షం కలిసిరాగా, డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్‌ను బుధవారం నాటి ఎలిమినేటర్‌లో ఓడించడంతో నైట్ రైడర్స్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. వాతావరణ ప్రభావంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో, సన్‌రైజర్స్‌ను నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 128 పరుగులకే కట్టడి చేసింది. ఇన్నింగ్స్ బ్రేక్‌లో భారీ వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత, డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం నైట్ రైడర్స్ లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్ధారించారు. ఓపెనర్‌గా వచ్చిన రాబిన్ ఉతప్ప (1), క్రిస్ లిన్ (6), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్ (0) క్రీజ్‌లో నిలబడలేకపోయారు. అయితే, కెప్టెన్ గంభీర్ (19 బంతుల్లో 32 పరుగులు), అతనికి చక్కటి మద్దతునిచ్చిన ఇశాంక్ జగ్గీ (8 బంతుల్లో 5 పరుగులు) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే నైట్ రైడర్స్‌కు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిపెట్టారు. ఎలిమినేటర్ అడ్డంకి తొలగిపోవడంతో, రెండో క్వాలిఫయర్‌లోనూ దూకుడును కొనసాగించాలని, ముంబయిని ఓడించడం ద్వారా గ్రూప్ దశలో ఎదురైన రెండు పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని నైట్ రైడర్స్ పట్టుదలతో ఉంది. షారుఖ్ ఖాన్ యజమానిగా ఉన్న ఈ జట్టు కెప్టెన్ గంభీర్ మొదట్లో తడబడినప్పటికీ, ఆతర్వాత తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకొని, మళ్లీ ఫిట్నెస్ సంపాదించిన క్రిస్ లిన్ ఎలిమినేటర్‌లో కేవలం ఆరు పరుగులకే ఆవుటైనప్పటికీ, అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. విశ్రాంతి అనంతరం మళ్లీ జట్టుతో కలిసి అతను చిన్నస్వామి స్టేడియంలోనే జరిగిన మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్ధ శతకాన్ని పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఎవరూ ఊహించని విధంగా ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన స్పెషలిస్టు స్పిన్నర్ సునీల్ నారైన్ ఎలిమినేట్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే, 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఐపిఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ నమోదైన అత్యంత వేగవంతమైన అర్ధ శతకం రికార్డును యూసుఫ్ పఠాన్‌తో కలిసి పంచుకుంటున్న అతను ముంబయిపై విరుచుకుపడే అవకాశం లేకపోలేదు. లిన్, సునీల్ నారైన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే, ఇద్దరూ హార్డ్ హిట్టర్లే కావడంతో పరుగుల వరద పారడం ఖాయం. కెప్టెన్ గంభీర్ క్రమంగా పుంజుకొని, ఇప్పుడు 486 పరుగులతో, టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఎలిమినేటర్‌లో మాదిరిగానే అతను ఆడితే, నైట్ రైడర్స్ బౌలర్లకు కష్టాలు తప్పవు. మనీష్ పాండే (396 పరుగులు), రాబిన్ ఉతప్ప (387 పరుగులు) నైట్ రైడర్స్ బ్యాటింగ్‌ను బలోపేతం చేస్తున్నారు. బౌలింగ్‌ను చూస్తే, 17 వికెట్లు కూల్చిన క్రిస్ వోక్స్, 16 వికెట్లు సాధించిన ఉమేష్ యాదవ్ నైట్ రైడర్స్ వద్ద ఉన్న ప్రధాన అస్త్రాలు. ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, సునీల్ నారైన్ తదితరులు కూడా నైట్ రైడర్స్ బౌలింగ్ విభాగాన్ని మెరుగైన పటిష్టంగా ఉంచుతున్నారు. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల ఫలితాలను బట్టిచూస్తే ముంబయి, నిలకడగా ఆడే విషయానికి వస్తే నైట్ రైడర్స్ ముందంజలో ఉన్నాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య జరిగే రెండో క్వాలిఫయర్ ఉత్కంఠ రేపుతున్నది. అయతే, వర్షం బెడద మళ్లీ వెంటాడుతున్నదన్న భయం కూడా ఉంది.

సమష్టి విజయం: గంభీర్
బెంగళూరు, మే 18: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎలిమినేటర్‌లో ఓడించి రెండో క్వాలిఫయర్‌కు చేరడం జట్టులోని ఆటగాళ్ల సమష్టి కృషితోనే సాధ్యమైందని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ అన్నాడు. బౌలర్లు అత్యంత ప్రతిభావంతంగా బంతులు వేశారని కొనియాడారు. అదే స్థాయిలో ఫీల్డర్లు కూడా రాణించడంతో సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగామన్నాడు. తమ ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి బంతి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాట్‌పైకి రావడంతో పరుగుల కోసం కష్టపడాల్సిన అవసరం లేకపోయిందన్నాడు. అయితే, మరికొంత జాగ్రత్తగా ఆడితే బాగుండేదంటూ మూడు వికెట్లను కోల్పోవడాన్ని అతను పరోక్షంగా ప్రస్తావించాడు. ఈ మ్యాచ్ ఆడిన పరిస్థితుల్లో సుమారుగా 160 పరుగులు చేసినా, దానిని గొప్ప స్కోరుగానే భావించాల్సి ఉంటుందని గంభీర్ అన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ రెండు వందల పరుగులను ఆశించడం తగదని వ్యాఖ్యానించాడు.