క్రీడాభూమి

రష్యా డోప్ కేంద్రంపై త్వరలో నిషేధం ఎత్తివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్రియల్, మే 19: రష్యాలోని డోపింగ్ నిరోధక విభాగం (ఆర్‌యుఎస్‌ఎడిఎ)పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. రష్యాలో ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన నివేదిక అప్పట్లో క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగానే ఆర్‌యుఎస్‌ఎడిఎను వాడా రెండేళ్లు నిషేధించింది. వచ్చే నెలలో సస్పెన్షన్ కాలం పూర్తవుతుంది కాబట్టి, దానిని పొడిగించే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపించింది. కానీ, నిషేధాన్ని కొనసాగించే ఉద్దేశం తమకు లేదని వాడా అధ్యక్షుడు క్రెగ్ రీడీ స్పష్టం చేశాడు. తనకు సంబంధించినంత వరకూ శిక్షా కాలం పూర్తయిన వెంటనే ఆర్‌యుఎస్‌ఎడిఎ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అతను ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే, ఈ నిర్ణయానికి అధికారిక ముద్ర పడాల్సి ఉంది.
మాడ్రిడ్ లాబ్‌కు గుర్తింపు
మాడ్రిడ్‌లోని డోపింగ్ నిరోధక లాబ్‌కు మంచి రోజులు వచ్చాయి. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) గతంలో ఈ లాబ్‌కు రద్దు చేసిన గుర్తింపును మళ్లీ పునరుద్ధరించింది. అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న డోపింగ్ నిరోధక సూత్రాలను సక్రమంగా అమలు చేయడం లేదన్న ఆరోపణపై 2016 జూన్ 6న మాడ్రిడ్ లాబ్‌ను వాడా సస్పెండ్ చేసింది. అక్కడ జరిగిన డోపింగ్ పరీక్షల నివేదికలు చెల్లవని స్పష్టం చేసింది. స్పెయిన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితికి కూడా ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. అయితే, ఇది కేవలం క్రీడా నిబంధనలకు సంబంధించిన అంశం మాత్రమేనని వాడా స్పష్టం చేసింది. వౌలిక సదుపాయాలను పెంచడమేగాక, ఇకపై నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తామని మాడ్రిడ్ డోపింగ్ లాబ్ అధికారులు హామీ ఇవ్వడంతో, గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది.
రహస్యంగా డోప్ సమాచారం!
లండన్: నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించడం నేరం. క్రీడా రంగంలో ఉత్ప్రేరకాల ద్వారా తాత్కాలికంగా జవసత్వాలను పెంచుకొని విజయాలు సాధించాలనుకోవడం మోసం. క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చాలా మంది అథ్లెట్లు కొత్తకొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ విధంగా డోప్‌కు పాల్పడుతున్న వారి సమాచారం తెలిసినప్పటికీ దానిని రహస్యంగా ఉంచేందుకే చాలా ఇష్టపడుతున్నారే తప్ప వివరాలు తెలియడానికి ముందుకు రావడం లేదని యార్క్‌షైర్‌లోని లీడ్స్ బాకెడ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెల్సే ఎరిక్‌సన్ తన పరిశోధనా వ్యాసంలో స్పష్టం చేసింది. డోపింగ్‌ను నిరోధించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే, అలాంటి సమాచారం ఉంటే తమకు తెలపాల్సిందిగా వాడా పిలుపునిచ్చింది. అంతేగాక, ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. కానీ, నిషిద్ధ ద్రవ్యాలను వాడే తమ స్నేహితులు లేదా సన్నిహితుల గురించి సమాచారం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని కెల్సే తన నివేదికలో స్పష్టం చేసింది. నిజానికి ఏ స్థాయిలోనైనా పోటీకి దిగిన తర్వాత జయాపజయాలను ఒకే రకంగా చూడాలన్నదే క్రీడాస్ఫూర్తికి నిర్వచనం. గెలవాలంటే చెమటోడ్చి సాధన చేయాలి. నిరంతరం శ్రమించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. అంతేగానీ దగ్గర మార్గాలను ఎంచుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఎవరైనా ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నట్టు అనుమానం వేస్తే, వెంటనే స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అప్పుడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోగలుగుతామని వాడా తన ప్రకటనలో పేర్కొంది. అయితే, అథ్లెట్ల మోసాన్ని ఎండగట్టాల్సిన వారే వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి, సమాచారాన్ని బయటపెట్టడం లేదని కెల్సే స్పష్టం చేసింది. ఇలాంటి వారంతా పరోక్షంగా డోపింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ కారణంగానే, డోపింగ్‌ను అరికట్టడానికి, దోషులను పట్టుకొని శిక్షించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని కెల్సే తెలిపింది. అంతేగాక, పరీక్షల్లో పట్టుబడకుండా ఉత్ప్రేరకాలను వాడే సరికొత్త విధానాలను కూడా కనిబెడుతున్నారని, వాటిని నుంచి తప్పించుకోవడానికి ఇతరత్రా మార్గాలను అనే్వషిస్తున్నారని తెలిపింది. విజిల్‌బ్లోయర్స్‌గా ఉండాల్సిన వారే తమ బాధ్యతలను విస్మరించడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని కెల్సే తెలిపింది. డోపింగ్ దోషులకు అధికారులు, ప్రభుత్వాలు సహకరించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించింది. మొత్తం మీద ఏఏ దేశాలకు చెందిన అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారో, అందుకు వారు ఏఏ మార్గాలను అనుసరిస్తున్నారో, వారికి ఎవరెవవరు సహకరిస్తున్నారో తెలుసుకోవడానికి వాడా చేస్తున్న ప్రయత్నాలకు సరైన స్పందన లభించడం లేదని కెల్సే నివేదిక స్పష్టం చేస్తున్నది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే, డోపింగ్ రహిత క్రీడారంగం సాధ్యం కాదన్నది వాస్తవం.