క్రీడాభూమి

ఇంగ్లండ్‌దే పైచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్డ్ఫి, జూన్ 13: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో, ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ చివరి క్షణం వరకూ పోరాడడం ఖాయం. సుమారు 42 ఏళ్లుగా ఐసిసి మేజర్ టోర్నీలో టైటిల్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ఇంగ్లాండ్‌కు కల ఫలించడం లేదు. ప్రపంచ కప్‌లో మూడు పర్యాయాలు ఫైనల్ చేరినా, విజేతగా నిలవలేకపోయింది. చాలాకాలం తర్వాత లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకోవాలని మోర్గాన్ సేన పట్టుదలతో ఉంది. 2015 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన తర్వాత ఇంగ్లాండ్ అన్ని విభాగాలపైనా దృష్టి కేంద్రీకరించింది. అదే ఏడాది పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో గెల్చుకుంది. ట్రెంట్ బ్రిడ్జిలో మూడు వికెట్లకు 444 పరుగులు సాధించి, వనే్డ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. అదే పాకిస్తాన్‌ను స్వదేశంలోనే మరోసారి ఎదుర్కోనుండడంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అలెక్స్ హాలెస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న జాసన్ రాయ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అందుకే, అతని స్థానంలో జానీ బెయిర్‌స్టోను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. జో రూట్ రూపంలో ఆ జట్టుకు ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్ ఉన్నాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, జొస్ బట్లర్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తున్నా రు. బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్‌గా అత్యుత్తమ సేవలు అందిస్తున్నాడు.
పదునైన బౌలింగ్
ఇంగ్లాండ్‌కు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తోపాటు పదునైన బౌలింగ్ బలం కూడా ఉంది. పేసర్లు జాక్ బాల్, లియామ్ ప్లంకెట్ కొత్త బంతితో అద్భుతాలు సృష్టించగల సమర్థులు. మూడుసార్లు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ, చాలా త్వరగానే కోలుకొని గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలుగుతున్న మార్క్ ఉడ్‌ను కెప్టెన్ మోర్గాన్ ఒక స్ట్రయిక్ బౌలర్‌గా ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో మూడు గ్రూప్ మ్యాచ్‌లనూ గెల్చుకొని సెమీ ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ సెమీస్‌లో పాక్‌పై గెలుస్తుందని విశే్లషకుల అభిప్రాయం. ఏదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకోకపోతే, మోర్గాన్ బృందం ఫైనల్ చేరుతుందని వారి విశ్వాసం.
తక్కువ అంచనా వేస్తే కష్టమే
ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేస్తే కష్టమేనన్న వాదన వినిపిస్తున్నది. సర్ఫ్‌రాజ్ అహ్మద్ నాయకత్వంలోని పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్ మొదటి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో చావు దెబ్బతిన్నది. అయినప్పటికీ, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎదురుదాడి చేసింది. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన తీరు పాక్ సామర్థ్యానికి, పట్టుదలకు అద్దం పడుతుంది. సర్ఫ్‌రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్న పాకిస్తాన్‌కు ఇంగ్లాండ్‌ను ఓడించడం కష్టం కావచ్చుగానీ, అసాధ్యం మాత్రం కాదు.
పాక్ జట్టుకు జరిమానా
గ్రూప్ ‘బి’లో శ్రీలంకతో జరిగిన ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా పాకిస్తాన్ జట్టుపై జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో వేయాల్సిన వాటి కంటే పాక్ ఒక ఓవర్ తక్కువగా బౌల్ చేసిందని ఐసిసి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ ఫీజులో కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్‌కు 20 శాతం, ఆటగాళ్లకు 10 శాతం చొప్పున జరిమానా విధించారని పేర్కొంది. సర్ఫ్‌రాజ్ పొరపాటు చేసినట్టు అంగీకరించడంతో, విచారణ లేకుండానే నిబంధనలను అనుసరించి జరిమానాను ఖాయం చేసినట్టు ఐసిసి తెలిపింది. కాగా, ఒకవేళ మరోసారి ఇలాంటి పొరపాటే జరిగితే, కెప్టెన్ సర్ఫ్‌రాజ్‌ను ఒక మ్యాచ్ నుంచి సస్పెండ్ చేస్తారు. శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ రెండు సార్లు స్లో ఓవర్ రేట్‌కు కారణమైనందున అతనిపై రెండు మ్యాచ్‌ల మ్యాచ్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

చిత్రం.. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్