క్రీడాభూమి

ర్యాంకింగ్స్‌లో పాక్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూన్ 19: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియాను మట్టికరిపించి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకున్న పాకిస్తాన్ జట్టు అంతర్జాతీయ ఉత్తమ వనే్డ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఒకేసారి రెండు స్థానాలను మెరుగు పర్చుకుని ఆరో ర్యాంకుకు దూసుకెళ్లింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా, పాకిస్తాన్ ఈ జాబితాలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లను అధిగమించడం ద్వారా 2019లో జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించేందుకు చేరువైంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో పాటు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అంతర్జాతీయ వనే్డ ర్యాంకింగ్స్‌లో తొలి ఏడు స్థానాల్లో నిలిచిన జట్లకు ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. అయితే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తమ కంటే ఉన్నత స్థానంలో ఉన్న టీమిండియాను ఓడించిన పాకిస్తాన్, అంతకుముందు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. దీంతో ఈ టోర్నీ ద్వారా నాలుగు ర్యాంకింగ్ పాయింట్లను సంపాదించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు మొత్తం 95 పాయింట్లతో అంతర్జాతీయ వనే్డ జట్ల ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకింది. దక్షిణాఫ్రికా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ర్యాంకింగ్స్‌లో భారత్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఒక్కో పాయింట్ చొప్పున కోల్పోయినప్పటికీ వాటి ర్యాంకులు మాత్రం మారలేదు.
టాప్-10లో రోహిత్‌కు చోటు
ఇక ఉత్తమ వనే్డ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు టాప్-10లో చోటు లభించింది. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో 123 పరుగుల అజేయ వ్యక్తిగత స్కోరుతో రాణించిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలను మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకోగా, టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగు ర్యాంకులను మెరుగుపర్చుకుని 19వ స్థానానికి, జస్‌ప్రీత్ బుమ్రా 19 స్థానాలను మెరుగుపర్చుకుని 24వ ర్యాంకుకు చేరుకున్నారు.
తాజా ర్యాంకింగ్స్‌లో ఎక్కువగా లబ్ధి పొందిన వారిలో పాకిస్తాన్ బౌలర్లు హసన్ అలీ, మహమ్మద్ అమీర్, జునైద్ ఖాన్, కొత్త ఓపెనర్ ఫఖర్ జమన్ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 13 వికెట్లు కైవసం చేసుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును సొంతం చేసుకున్న హసన్ అలీ ఐసిసి తాజాగా విడుదల చేసిన ఉత్తమ వనే్డ ఆటగాళ్ల జాబితాలో ఒకేసారి 12 స్థానాలను మెరుగుపర్చుకుని 7వ ర్యాంకుకు దూసుకెళ్లగా, వెన్ను నొప్పి కారణంగా ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరమైనప్పటికీ టీమిండియాతో జరిగిన ఫైనల్‌లో 16 పరుగులకే 3 వికెట్లు కైవసం చేసుకున్న మహమ్మద్ అమీర్ 16 స్థానాలను మెరుగుపర్చుకుని 21వ ర్యాంకుకు, జునైద్ ఖాన్ తొమ్మిది స్థానాలను మెరుగుపర్చుకుని 47వ స్థానానికి చేరుకున్నారు. అలాగే చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో 57 పరుగులు, ఫైనల్‌లో 114 పరుగులతో రాణించిన ఫఖర్ జమన్ తాజా ర్యాంకింగ్స్‌లో ఒకేసారి 58 స్థానాలను మెరుగుపర్చుకుని 97వ ర్యాంకుకు చేరుకున్నాడు. దీంతో అతనికి కేవలం నాలుగు వనే్డల్లోనే టాప్-100 జాబితాలో చోటు లభించగా, పాకిస్తాన్‌కు చెందిన మరో యువ ఆటగాడు బాబర్ ఆజమ్ మూడు స్థానాలను మెరుగుపర్చుకుని ఐదో ర్యాంకుతో కెరీర్‌లోనే ఉత్తమ స్థానానికి చేరుకోగా, మహమ్మద్ హఫీజ్ రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 20వ ర్యాంకుకు, ఓపెనర్ అజర్ అలీ 11 స్థానాలను మెరుగుపర్చుకుని 31వ ర్యాంకుకు చేరుకున్నారు.
అలాగే బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ మషఫ్రీ మోర్తజా ఉత్తమ బౌలర్ల జాబితాలో మూడు స్థానాలను మెరుగుపర్చుకుని 15వ ర్యాంకుకు, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఉత్తమ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 16వ ర్యాంకుకు చేరుకోగా, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్లు జో రూట్ 4వ స్థానాన్ని, అలెక్స్ హాలెస్ 17వ స్థానాన్ని, ఇయాన్ మోర్గాన్ 18వ స్థానాన్ని, జోస్ బట్లర్ 19వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

చిత్రాలు.. పదో ర్యాంకుకు చేరుకున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ
*ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న పాకిస్తాన్ జట్టు