క్రీడాభూమి

వింబుల్డన్ డిన్నర్‌లో చాంపియన్ల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 17: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టైటిళ్లు సాధించిన వారి కోసం నిర్వాహకులు డిన్నర్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి పురుషుల చాంపియన్ రోజర్ ఫెదరర్, మహిళల విజేత గార్బెనె ముగురుజా ఈ డిన్నర్‌లో సందడి చేశారు. అదే విధంగా ఇతర విభాగాల్లో చాంపియన్లు కూడా ఈ డిన్నర్‌కు హాజరయ్యారు. వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆటగాళ్లు తప్పనిసరిగా తెల్ల దుస్తులే ధరించాలనే నిబంధన ఉంది. అదే విధంగా ఏటా నిర్వహించే డిన్నర్‌కు కూడా ఖచ్చితమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. ఫెదరర్ నల్లని కోటు వేసుకుంటే, ముగురుజా తెల్లటి ఫ్లోరల్ డ్రెస్‌తో మెరిసిపోయింది. వివిధ విభాగాల్లో గెలుపొందిన లుకాజ్ కుబట్, మార్సెలో మెలో (పురుషుల డబుల్స్), ఎకతెరీన మకరోవా, ఎలెనా వెస్నినా (మహిళల డబుల్స్), జెమీ ముర్రే, మార్టినా హింగిస్ (మిక్స్‌డ్ డబుల్స్), అలెజాండ్రో డావిడొవిచ్ ఫోకినా (బాలుర సింగిల్స్), క్లెయిర్ లూ (బాలికల సింగిల్స్), యాక్సెల్ గిల్లర్, సూ హు షియో (బాలుర డబుల్స్), ఓల్గా డానిలొవిచ్, కజా జువాన్ (బాలికల డబుల్స్), లేటన్ హెవిట్, మార్క్ ఫిలిప్పోసిస్ (జంటిల్మన్ ఇన్విటేషన్ డబుల్స్), కారా బ్లేక్, మార్టినా నవ్రితిలోవా (లేడీస్ ఇన్విటేషనల్ డబుల్స్), జాకబ్ ఎల్టింగ్, పాల్ హర్‌హుయిస్ (సీనియర్ జంటిల్మన్ డబుల్స్), స్ట్ఫోన్ ఒసోన్ (పురుషుల వీల్ చైర్ సింగిల్స్), డిడే డి గ్రూట్ (మహిళల వీల్ చైర్ సింగిల్స్), అల్ఫీ హెవిట్, గార్డొన్ రీడ్ (పురుషుల వీల్ చైర్ డబుల్స్), యుయ్ కమిజీ, జోర్డానె విల్లే (మహిళల వీల్ చైర్ డబుల్స్) లండన్‌లోని గిల్డ్ హాల్‌లో జరిగిన డిన్నర్‌లో పాల్గొన్నారు. తన భార్య మిర్కాతో కలిసి హాల్ వద్దకు చేరుకున్న ఫెదరర్‌ను సాదరంగా ఆహ్వానించిన నిర్వాహకులు అతనికి ఒక తెల్లటి ర్యాకెట్‌ను బహూకరించారు. అనంతరం ముగురుజాతో కలిసి ఫెదరర్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. తన చిరకాల మిత్రుడు టామీ హాస్‌ను ఆలింగనం చేసుకొని, అతనితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ ఏడాది గ్రాస్ కోర్టుపై ఫెదరర్‌ను ఓడించిన ఆటగాడు హాస్. గ్రాస్ కోర్టులపై తన ఆధిపత్యానికి గండికొట్టినప్పటికీ హాస్ పట్ల ఫెదరర్ ఎలాంటి వ్యతిరేకతను చూపలేదు. చిరకాల మిత్రులు కాబట్టి వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకొని, కొంత సేపు ముచ్చటిస్తూ కనిపించారు. ఫెదరర్‌తో హాస్ ప్రత్యేకంగా ఫొటోలు తీయంచుకున్నాడు.
యువ ప్లేయర్ల ఆనందం
తమ అభిమాన టెన్నిస్ తారలను చూసి యువ ప్లేయర్లు ఆనందంలో మునిగిపోయారు. బాలుర సింగిల్స్ ఫైనల్‌లో అలెజాండ్రో డావిడోవిచ్ ఫొకినా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రన్నరప్ ట్రోఫీకి పరిమితమైన ఎక్లెస్ గెల్లర్ బాలుల డబుల్స్‌లో టైటిల్ సాధించాడు. ఫెదరర్ ఫొటో సెషన్‌లో ఉన్నప్పుడు గెల్లర్ అతని వద్దకు వెళ్లి, ఫొటోకు అనుమతించాల్సిందిగా కోరాడు. ఫెదరర్ సానుకూలంగా స్పందించి, గెల్లర్‌తో ఫొటో దిగాడు. బాలికల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికా క్రీడాకారిణి విట్నీ ఒసుగ్వే కూడా అనుకున్నది సాధించింది. బాలికల డబుల్స్‌లో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్‌ను అందుకోలేకపోయిన ఆమె సింగిల్స్ చాంపియన్ ముగురుజాతో ఫొటో తీయించుకొని మురిసిపోయింది.
మూడో స్థానానికి స్విస్ హీరో
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరచుకున్నాడు. ఇంతకు ముందు ఐదో స్థానంలో ఉన్న అతను రెండు స్థానాలను అధిరోహించి, మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆండీ ముర్రే మొత్తం 7,750 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, రాఫెల్ నాదల్ (7,464 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, మహిళల విభాగంలో కరోలినా ప్లిస్కోవా (6,855 పాయింట్లు) మొదటి స్థానంలో ఉంది. సిమోనా హాలెప్, ఏంజెలిక్ కెర్బర్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించారు.
టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్
పురుషుల విభాగం: 1. ఆండీ ముర్రే (7,750 పాయింట్లు), 2. రాఫెల్ నాల్ (7.465 పాయింట్లు), 3. రోజర్ ఫెదరర్ (6,545 పాయింట్లు), 4. నొవాక్ జొకోవిచ్ (6,325 పాయింట్లు), 5. స్టానిస్లాస్ వావ్రిన్కా (6,140 పాయింట్లు), 6. మారిన్ సిలిక్ (5,075 పాయింట్లు), 7. డామినిక్ థియేమ్ (4,030 పాయింట్లు), 8. కెయ్ నిషికొరీ (3,740 పాయింట్లు), 9. మిలోస్ రోనిక్ (3,310 పాయింట్లు), 10. గ్రిగర్ దిమిత్రోవ్ (3,160 పాయింట్లు).
మహిళల విభాగం: 1. కరోలినా ప్లిస్కోవా (6,855 పాయింట్లు), 2. సిమోనా హాలెప్ (6,670 పాయింట్లు), 3. ఏంజెలిక్ కెర్బర్ (5,975 పాయింట్లు), 4. జొహాన్నా కొన్టా (5,110 పాయింట్లు), 5. గార్బెనె ముగురుజా (4,990 పాయింట్లు), 6. ఎలినా స్విటోలినా (4,935 పాయింట్లు), 7. కరోలినా వొజ్నియాకి (4,780 పాయింట్లు), 8. స్వెత్లానా కుజ్నెత్సొవా (4,500 పాయింట్లు), 9. వీనిస్ విలియమ్స్ (4,461 పాయింట్లు), 10. అగ్నీస్కా రద్వాన్‌స్కా (3,985 పాయింట్లు).
*

* ఫెదరర్ మరే ఇతర క్రీడాకారుడు సాధించలేని రీతిలో 30 పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్ చేరాడు. 2005-2007 మధ్యకాలంలో అతను వరుసగా పది పర్యాయాలు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2008-2010 మధ్య అతను ఎనిమిది గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫైనల్స్ ఆడాడు.
* వింబుల్డల్‌లో అతను 2003 నుంచి 2009 వరకు వరుసగా ఏడుసార్లు వింబుల్డన్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. వీటిలో ఆరు విజయాలు సాధించాడు. 2008 ఫైనల్‌లో మాత్రమే అతను రాఫెల్ నాదల్ చేతిలో ఓడాడు. వింబుల్డన్‌లో వరుసగా ఎక్కువ ఫైనల్స్ ఆడిన ఆటగాడు అతనే.
* వరుసగా 15 సీజన్లలో కనీసం ఒక్క గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన ఏకైక ఆటగాడు ఫెదరర్. టెన్నిస్ చరిత్రలో మరెవరూ ఈ ఘనతను అందుకోలేదు.
* బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఈవెంట్‌ను 2015 జనవరిలో గెల్చుకోవడంతో, వరుసగా 14 సీజన్లలో ఆ టోర్నీని సాధించి ఇవాన్ లెండిల్ నెలకొల్పిన రికార్డును ఫెదరర్ 15 టైటిళ్లతో అధిగమించాడు.
* పురుషుల విభాగంలో 300 వారాలకుపైగా ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఒకే ఒక ఆటగాడు ఫెదరర్. ద్వితీయ స్థానంలో ఉన్న సంప్రాస్ 286 వారాలు నంబర్ వన్‌గా వెలిగాడు.
* మాస్టర్స్-1000 టోర్నీల చరిత్రలో ఒక్క సర్వీసు కూడా కోల్పోకుండా టైటిల్ సాధించిన ఆటగాడు ఫెదరర్. 2012 సిన్సినాటి టోర్నీలో మొదటి రౌండ్ నుంచి మొదలుపెట్టి, ఫైనల్ వరకూ అతను ఒక్క సర్వీసును కూడా చేజార్చుకోకుండా టైటిల్‌ను అందుకున్నాడు.
* గ్రాస్ కోర్టులపై అత్యధిక విజయాలు నమోదు చేసిన టెన్నిస్ ఆటగాడిగా ఫెదరర్ పేరు చరిత్ర పుటల్లో చేరింది. జాన్ బోర్గ్ 41 విజయాలతో నెలకొల్పిన రికార్డును అతను 2007లో 42 మ్యాచ్‌లను గెల్చుకొని బద్దలు చేశాడు.
* ఎటిపి టూర్ మ్యాచ్‌ల్లో అతను 1,000 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ఓపెన్ శకంలో అత్యధిక విజయాలను అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. జిమీ కానర్స్ (1,253), ఇవాన్ లెండిల్ (1,071) విజయాలతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఎక్కువ దేశాల్లో ట్రోఫీలను గెల్చుకున్న ఆటగాడిగా కూడా ఫెదరర్ రికార్డుకెక్కాడు. 2015లో ఇస్టాంబుల్ ఓపెన్‌ను సాధించిన అతను, 19 వేరువేరు దేశాల్లో టైటిళ్లను అందుకున్న ఏకైక టెన్నిస్ స్టార్‌గా గుర్తింపు పొందాడు.