క్రీడాభూమి

ఫిట్నెస్‌కే ప్రాధాన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: భారత క్రికెట్ జట్టులో కొత్త ఒరవడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఆటగాడు ఫిట్నెస్‌పై దృష్టి సారిస్తున్నాడు. శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అతని అభిమానులు ఆశించారు. కానీ, జాతీయ సెలక్షన్ కమిటీ అతని పట్ల ఆసక్తి చూపలేదు. యోయో ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన కారణంగానే యువీ, సురేష్ రైనా తదితరులు జాతీయ జట్టులోకి రాలేకపోయారన్న వార్తతో క్రికెటర్లంతా వామప్ రొటీన్స్‌పై దృష్టి సారిస్తున్నారు. ఫిట్నెస్‌తో ఉన్న వారికే 2019 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభిస్తుందని జట్టు కోచ్ రవి శాస్ర్తీ ఇటీవల చేసిన ప్రకటన కూడా ఈ అంశంపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఎంత పట్టుదలతో ఉందో స్పష్టం చేస్తున్నది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని లంకతో వనే్డ సిరీస్‌కు ఎంపిక చేసి, మరో సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్‌కు మొండి చేయి చూపెట్టడం వెనుక ఫిట్నెస్ పరీక్షే కీలకమన్నది వాస్తవం. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తామని, అదే సమయంలో ఫిట్నెస్‌తో ఉన్న సీనియర్లకు కూడా అవకాశం ఉంటుందని రవి శాస్ర్తీ అంటున్నాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అద్భుతంగా రాణించిన పలువురు యువ ఆటగాళ్లపై అతను ఆసక్తిని కనబరుస్తున్నాడని, అందుకే సీనియర్లకు ఫిట్నెస్‌పై పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడని ఒక వాదన బలంగా వినిపిస్తున్నది. 2019 వరల్డ్ కప్ ముగిసే వరకూ టీమిండియాకు అతనే కోచ్‌గా ఉంటాడు. ఇప్పటి నుంచే యువ ఆటగాళ్ల వేటను కొనసాగించి, సమర్థులను ఎంపిక చేసుకొని, వారిని ప్రోత్సహిస్తేనే ప్రపంచ కప్‌లో బలమైన జట్టును బరిలోకి దించే అవకాశం ఉండదు. అందుకే, జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కించేందుకు పదో ఐపిఎల్‌లో అదరగొట్టిన ఆటగాళ్లపై దృష్టి పెట్టాడు. ఈసారి ఐపిఎల్‌లో తమదైన ముద్ర వేసిన యువ క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. కొందరు సెంచరీలతో కదంతొక్కితే, మరి కొంత మంది హ్యాట్రిక్స్ సాధించారు. యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్) పుణేలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సెంచరీ (62 బంతుల్లో 102) చేశాడు. ఈ ఏడాది ఐపిఎల్‌లో అదే మొదటి శతకం. కాగా, రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు సాధించిన బౌలర్లు పదో ఐపిఎల్‌లో చాలా మందే ఉన్నారు. కానీ, మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి, హ్యాట్రిక్‌ను నమోదు చేసిన ఘనత ముగ్గురికి దక్కింది. ముంబయి ఇండియన్స్‌పై శామూల్ బద్రీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్)తోపాటు ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జయదేవ్ ఉనాద్కత్ (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్) చోటు దక్కించుకోవడం విశేషం. మన దేశం ఆటగాళ్లలో అతనొక్కడే పదో ఐపిఎల్‌లో హ్యాట్రిక్ సాధించాడు. రికార్డుల్లోకి ఎక్కకపోయినా, అద్భుత ప్రతిభ కనబరచిన ఆటగాళ్లలో రిషభ్ పంత్‌ను ప్రత్యేకంగా పేర్కోవాలి. ఐపిఎల్ ఆరంభానికి కొద్దిరోజుల ముందే తండ్రి మృతి చెందడంతో రిషభ్ టోర్నీలో పాల్గొనడం అనుమానమేనని అంతా అనుకున్నారు. కానీ, దుఃఖాన్ని దిగమింగిన అతను ఐపిఎల్‌లో ఆడాడు. ఢిల్లీ డేర్‌డెలిల్స్ తరఫున గుజరాత్ లయన్స్‌ను 43 బంతుల్లోనే 97 పరుగులు సాధించి సత్తా చాటాడు. సచిన్ తెండూల్కర్ ప్రత్యేకంగా రిషభ్ పేరును ప్రస్తావిస్తూ, అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రశంసించడం గమనార్హం. ఈసారి ఐపిఎల్‌లో మెరిసిన వీరుల్లో 24 వికెట్లు పడగొట్టిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్, అదే జట్టుకు చెందిన రాహుల్ త్రిపాఠి కూడా ఉన్నారు. త్రిపాఠి 391 పరుగులు సాధించాడు. గుజరాత్ లయన్స్ పేసర్ బాసిల్ థంపి 11 వికెట్లు పడగొడితే, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరఫున ఆడిన 17 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపిఎల్‌లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రవీంద్ర జడేజా పేరిట ఉన్న రికార్డును అతను అధిగమిచాడు. గుజరాత్ లయన్స్ యువ ఆటగాడు, అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ ఇశాన్ కిషన్, ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణి, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి యువ ఆటగాళ్లు ఐపిఎల్‌లో అద్భుతాలు సృష్టించారు. జాతీయ జట్టులోకి వచ్చే సామర్థ్యం తమకు ఉందని నిరూపించుకున్నారు. వీరి ఫిట్నెస్ ప్రమాణాలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. రవి శాస్ర్తీ కోరుకుంటున్న లక్షణాలన్నీ ఉన్న వీరిలో కొంత మందికి 2019 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కవచ్చు. వయసు మళ్లిన, ఫిట్నెస్‌ను కాపాడుకోలేకపోతున్న ఆటగాళ్లకు ఉద్వాసన చెప్పి, సమర్థులైన యువ ఆటగాళ్లతో టీమిండియాను తీర్చిదిద్దడమే రవి శాస్ర్తీ లక్ష్యంగా కనిపిస్తున్నది. అదే నిజమైతే, వరల్డ్ కప్ నాటికి ధోనీ, అశ్విన్ వంటి సీనియర్ క్రికెటర్లకు సెలకర్లు ఉద్వాసన పలికడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆ ప్రమాదం ఎదురుకాకుండా ఉండేందుకు, క్రికెటర్లంతా ఫిట్నెస్‌పై దృష్టి పెట్టారు. ఇది మంచి పరిణామమే.

చిత్రం..ఫిట్నెస్ కోసం కసరత్తు . ఇన్‌సెట్‌లోటీమిండియా కోచ్ రవి శాస్ర్తీ