క్రీడాభూమి

సైనాకు సంక్లిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, ఆగస్టు 20: స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో సోమవారం నుంచి జరగనున్న ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ కోసం సంక్లిష్టమైన డ్రా ఎదురుచూస్తున్నది. బలమైన ప్రత్యర్థులను ఆమె ఎదుర్కోనుంది. మరో స్టార్ క్రీడాకారిణి పివి సింధుతోపాటు సైనాకు కూడా మొదటి రౌండ్‌లో బై లభించింది. అయితే, రెండో రౌండ్ నుంచి ప్రతి అడుగూ సింధు కంటే సైనాకు కష్టతరమవుతుందని, ఆమె ఎంతో మంది సమర్థులను ఎదుర్కోవాల్సి వస్తుందని విశే్లషకులు అంటున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన 22 ఏళ్ల సింధు, వరుసగా రెండు సూపర్ సిరీస్‌లను గెల్చుకున్న కిడాంబి శ్రీకాంత్ ఈసారి వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఫేవరిట్స్ ముద్రను వేయించుకున్నారు. 2015 చాంపియన్‌షిప్స్‌లో ద్వితీయ స్థానాన్ని సంపాదించిన సైనాకు ఈసారి అదే స్థాయిలో రాణించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆమెకు ఎదురుకానున్న ప్రత్యర్థుల బలాబలాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సుమారు దశాబ్దకాలం క్రితం అంతర్జాతీయ వేదికలపై చిరస్మరణీయ విజయాలతో సంచలనాలు సృష్టించి, అందరి దృష్టిని ఆకట్టుకున్న సైనా ఆతర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కానీ, గత రెండేళ్లుగా ఆమెను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్నది. సరైన ఫామ్‌లో లేకపోవడం కూడా ఆమె దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నది. ఫలితంగా, ఏడెనిమిదేళ్ల కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఆమె ప్రస్తుతం 12వ సీడ్‌గా ప్రపంచ బాడ్మింటన్‌లోకి అడుగుపెడుతున్నది. కెరీర్ పతనావస్థలో ఉందన్న అనుమానాలు వ్యక్తమైన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో ముందంజ వేయడం, ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకొని తన ఉనికిని చాటుకోవడం ఆమెకు ఆనవాయితీగా మారింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని, 2015 ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానాన్ని, అదే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని సాధించిన సైనా కాలికి శస్త్ర చికిత్స అనంతరం మళ్లీ పూర్వవైభవాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవలే మలేసియా ఓపెన్‌ను గెల్చుకుంది. అదే ఉత్సాహంతో వరల్డ్ చాంపియన్‌షిప్స్ టోర్నీకి సిద్ధమైంది. అయితే, రెండేళ్ల క్రితం నాటి ఫామ్‌తో పోలిస్తే ఆమె ఇప్పుడు టైటిల్ రేసులో గట్టి పోటీదారు కాదని స్పష్టమవుతుంది. అనుకున్న విధంగానే ఫలితాలు వెల్లడైతే, మూడో రౌండ్‌లో ఆమె కొరియా క్రీడాకారిణి సంగ్ జి హ్యున్‌ను ఢీకొనాల్సి ఉంటుంది. గతంలో హ్యున్‌ను ఓడించిన అనుభవం సైనాకు ఉన్నప్పటికీ, ఈసారి అంత సులభం కాదన్న వాదన వినిపిస్తున్నది. ఒకవేళ హ్యున్ అడ్డంకిని సమర్థంగా అధిగమిస్తే, ప్రపంచ ఆరో ర్యాంకర్ హీ బింజియావోను సైనా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒక్కో అడుగు ముందుకేసి, సెమీస్ చేరితే, అక్కడ చిరకాల ప్రత్యర్థి కరొలినా మారిన్ ఎదురుపడుతుంది. 2015లో మారిన్ చేతిలోనే సైనా పరాజయాన్ని ఎదుర్కొంది. మొత్తం మీద ఈసారి వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సైనా కోసం కష్టమైన డ్రా ఎదురుచూస్తున్నది. ఆమె సమర్థురాలని, సులభంగానే ఫైనల్ వరకూ చేరుతుందని అనుకుంటున్న అభిమానుల అంచనాల మేరకు రాణిస్తుందా లేక విఫలమై నిరాశపరుస్తుందా అన్నది చూడాలి.
సింధు విషయానికి వస్తే, మొదటి రౌండ్‌లో బై లభించిన ఆమె రెండో రౌండ్‌లో కొరియాకు చెందిన కిమ్ హ్యో మిన్‌తో తలపడుతుంది. ఈ రౌండ్‌ను అధిగమించడం సింధుకు అసాధ్యం కాకపోయినా, అనుకున్నంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సింధు పోటీపడుతున్న గ్రూపులోనే అకానే యమాగుచీ, రచానొక్ ఇంతనాన్, చెన్ యుఫెయ్, చెన్ జియావోజిన్ వంటి స్టార్లు ఉన్నారు. అయితే, వీరిలో చాలా మందిని ఓడించిన అనుభవం సింధుకు ఉంది. అలాంటి ఫలితాలనే పునరావృతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

చిత్రాలు.. సైనా నెహ్వాల్ *పివి సింధు