క్రీడాభూమి

తొలి వామప్ మ్యాచ్‌కి టీమిండియా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగే వామప్ మ్యాచ్‌కి సిద్ధమైంది. అన్ని విభాగాల్లోనూ పట్టిష్టంగా ఉన్న కారణంగా, బెంచ్ బలాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ మ్యాచ్‌ని ఒక వేదికగా స్వీకరించాలని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతను కొన్ని ప్రయోగాలు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై వరుస విజయాలు, తాజాగా ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్ టైటిల్ భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చాలకాలంగా బలహీనంగా ఉన్నట్టు కనిపించిన భారత బౌలింగ్ విభాగం ఇప్పుడు బలపడింది. జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుతంగా రాణించడం ధోనీకి ఊరటనిస్తున్నది. బుమ్రా, పాండ్య కలిసి గత 11 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌ల్లో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. మిగతా అన్ని మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లోనూ పాండ్య ప్రతిభ చూపుతున్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా వంటి సూపర్ స్టార్లతో బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. అశ్విన్, రవీంద్ర జడేజా జట్టుకు అదనపు బలం. విన్నింగ్ టీమ్ ఇప్పటికే ఖాయమైంది. ఈ పరిస్థితుల్లో ఆజింక్య రహానే, హర్భజన్ సింగ్, పవన్ నేగీ తదితరులకు అవకాశమిచ్చి, వారి ఫామ్‌ను పరీక్షించడానికి వామప్ మ్యాచ్‌లను ధోనీ వేదికగా తీసుకుంటున్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎవరికి తుది జట్టులో అవకాశం ఇచ్చినా, విండీస్ కంటే భారత జట్టు బలంగానే ఉంటుంది.
ప్రాక్టీస్ లేని విండీస్
ఇటీవల కాలంలో భారత జట్టు 11 టి-20 మ్యాచ్‌లు ఆడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఇండియా నంబర్ వన్ స్థానంలో ఉంటే, వెస్టిండీస్‌ది రెండో స్థానం. ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే, విండీస్ ఈ మధ్యకాలంలో పొట్టి ఫార్మెట్ మ్యాచ్‌లు ఆడలేదు. పైగా కాంట్రాక్టు వివాదం కారణంగా ఆ జట్టులో పలువురు సీనియర్ ఆటగాళ్లు టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొనడం చివరి వరకూ అనుమానంగానే కనిపించింది. చివరి క్షణాల్లో కాంట్రాక్టు వివాదానికి తెరపడడంతో, పూర్తి స్థాయి జట్టు ఈ టోర్నీకి వచ్చింది. వీరిలో కొంత మంది విండీస్ క్రికెట్ బోర్డుకు విధేయులుకాగా, మరికొందరు ఘర్షణకు దిగినవారు. ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య ఏ విధంగా సాధ్యమవుతుందో చూడాలి. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇరు జట్లు బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. వివిధ కారణాలవల్ల కీరన్ పొలార్డ్, సునీల్ నారైన్, డారెన్ బ్రేవో ఈ టోర్నీకి దూరమయ్యారు. వారు లేని లోటును ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన విండీస్ జట్టు ఏవిధంగా భర్తీ చేస్తుందో చూడాలి. కాగా, ఏ విధంగా చూసినా వెస్టిండీస్‌ను ఓడించి, ఈ టోర్నీ కి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని భారత జట్టు మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
మ్యాచ్ గురువారం సాయంత్రం 7.30 గంటలకు మొదలవుతుంది