క్రీడాభూమి

భారత్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో హాట్ ఫేవరిట్ ముద్ర వేయించుకున్న భారత్‌కు ‘అండర్ డాగ్’ న్యూజిలాండ్ షాకిచ్చింది. 47 పరుగుల తేడాతో చిత్తుచేసి, ఈ టోర్నీలో భారత్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించింది. గతంలో నాలుగు పర్యాయాలు టి-20 వరల్డ్ కప్‌లో కివీస్‌ను ఢీకొన్న భారత్ అన్ని మ్యాచ్‌లనూ ఓడింది. తాజాగా మరో ఓటమిని మూటగట్టుకుంది. 127 పరుగుల సాదాసీదా లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన టీమిండియా 79 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (30), విరాట్ కోహ్లీ (23) తప్ప మిగతా ఎవరూ బాధ్యతాయుతంగా ఆడకుండా జట్టు ఓటమికి కారకులయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ నాలుగు వికెట్లు కూల్చగా, ఇష్ సోధీకి మూడు వికెట్లు లభించాయి. తొలి మ్యాచ్‌లోనే ఓడిన భారత్ ఈనెల 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఢీ కొంటుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నిరాశాజనకంగా ఆరంభమైంది. ఆరు పరుగుల స్కోరువద్ద ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ వికెట్‌ను కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన అతను అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. గుప్టిల్ మాదిరిగానే భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సామర్థ్యం ఉన్న కొలిన్ మున్రో కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అతను ఏడు పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. కెప్టెన్ డేన్ విలియమ్‌సన్ జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించడానికి బదులు, నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ను పారేసుకున్నాడు. పార్ట్‌టైమ్ బౌలర్ సురేష్ రైనా వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన అతను క్రీజ్ నుంచి చాలా ముందుకు వెళ్లాడు. బ్యాట్‌కు బాల్ కనెక్ట్ కాలేదు. ధోనీ క్షణాల్లో బంతిని పట్టుకొని స్టంప్ చేయడంతో, 35 పరుగుల స్కోరు వద్ద కివీస్ మూడో వికెట్‌ను చేజార్చుకుంది. విలియమ్‌సన్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ 10 పరుగుల స్కోరువద్ద రనౌటయ్యాడు. జట్టును ఆదుకోవడానికి విశేషంగా శ్రమించిన కొరి ఆండర్సన్ 42 బంతుల్లో 34 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిచెల్ సాంట్నర్ (18), గ్రాంట్ ఇలియట్ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. వికెట్‌కీపర్ ల్యూక్ రోన్చీ 11 బంతుల్లోనే, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నాథన్ మెక్‌కలమ్ పరుగుల ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉండగా, కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేయగలిగింది. బౌలింగ్‌కు దగిన భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య తప్ప, మిగతా ఐదుగురు, అశ్విన్, ఆశిష్ నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, సురేష్ రైనా, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు.
సులభంగా కనిపిస్తున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఐదు పరుగుల వద్ద తొలి దెబ్బ శిఖర్ ధావన్ రూపంలో తగిలింది. అతను ఒక పరుగు చేసి, నాథన్ మెక్‌కలమ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. మరో ఐదు పరుగుల తర్వాత రోహిత్ శర్మ (5) కూడా పెవిలియన్ చేరాడు. అతను సాంట్నర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రోన్చీ స్టెంప్ చేయడంతో అవుటయ్యాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కూలడంతో కంగుతిన్న భారత్‌ను యువరాజ్ సింగ్ అవుట్ కావడం దిగ్భ్రాంతికి గురి చేసంది. అతను కేవలం నాలుగు పరుగులు చేసి నాథన్ మెక్‌కలమ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, వికెట్లు కూలుతున్నా బాధ్యతతో క్రీజ్‌లోనే నిలదొక్కుకున్న విరాట్ కోహ్లీ బ్యాట్‌ను అడ్డంగా ఊపి అవుటయ్యాడు. ఇష్ సోధి వేసిన బంతిని వికెట్‌కీపర్ రోన్చి ఒడుపుగా పట్టుకొని, 27 బంతుల్లో రెండు ఫోర్లతో 23 పరుగులు చేసిన కోహ్లీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు చేసిన హార్దిక్ పాండ్యను సాంట్నర్ ఎల్‌బిగా అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వికెట్ కూడా కూలింది. అతను పరుగుల ఖాతాను తెరవకుండానే, ఇష్ సోధి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 42 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ చేజార్చుకుంది. కెప్టెన్ ధోనీతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 6.1 ఓవర్లలో 30 పరుగులు జోడించిన అశ్విన్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఇష్ సోధీ బౌలింగ్‌లో రోన్చి స్టెంప్ చేయగా అవుటయ్యాడు. ధోనీ 20 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 30 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో నాథన్ మెక్‌కలమ్‌కు చిక్కాడు. 79 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అదే స్కోరు వద్ద ఆడం మిల్నే బౌలింగ్‌లో ఆశిష్ నెహ్రా (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ ఇన్నింగ్స్‌కు 18.1 ఓవర్లలో 79 పరుగుల వద్ద తెరపడే సమయానికి జస్‌ప్రీత్ బుమ్రా (0) నాటౌట్‌గా ఉన్నాడు. కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

స్కోరుబోర్డు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ ఎల్‌బి అశ్విన్ 6, కేన్ విలియన్‌సన్ స్టెంప్డ్ ధోనీ బి సురేష్ రైనా 8, కొలిన్ మున్రో సి హార్దిక్ పాండ్య బి ఆశిష్ నెహ్రా 7, కొరి ఆండర్సన్ బి జస్‌ప్రీత్ బుమ్రా 34, రాస్ టేలర్ రనౌట్ 10, మిచెల్ సాంట్నర్ సి ధోనీ బి రవీంద్ర జడేజా 18, గ్రాంట్ ఇలియట్ రనౌట్ 9, ల్యూక్ రోన్చి 21 నాటౌట్, నాథన్ మెక్‌కలమ్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126.
వికెట్ల పతనం: 1-6, 2-13, 3-35, 4-61, 5-89, 6-98, 7-114.
బౌలింగ్: అశ్విన్ 4-0-32-1, ఆశిష్ నెహ్రా 3-1-20-1, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-15-1, సురేష్ రైనా 4-0-16-1, జడేజా 4-0-26-1, హార్దిక్ పాండ్య 1-0-10-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ స్టెంప్డ్ రోన్చి బి సాంట్నర్ 5, శిఖర్ ధావన్ ఎల్‌బి నాథన్ మెక్‌కలమ్ 1, విరాట్ కోహ్లీ సి రోన్చి బి ఇష్ సోధి 23, సురేష్ రైనా సి గుప్టిల్ బి సాంట్నర్ 1, యువరాజ్ సింగ్ సి అండ్ బి నాథన్ మెక్‌కలమ్ 4, మహేంద్ర సింగ్ ధోనీ సి నాథన్ మెక్‌కలమ్ బి సాంటన్నర్ 30, హార్దిక్ పాండ్య ఎల్‌బి సాంట్నర్ 1, రవీంద్ర జడేజా సి అండ్ బి ఇష్ సోధి 0, అశ్విన్ స్టెంప్డ్ రోన్చి బి ఇష్ సోధి 10, ఆశిష్ నెహ్రా బి ఆడం మిల్నే 0, జస్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (18.1 ఓవర్లలో ఆలౌట్) 79.
వికెట్ల పతనం: 1-5, 2-10, 3-12, 4-26, 5- 39, 6-42, 7-43, 8-73, 9-79, 10-79.
బౌలింగ్: నాథన్ మెక్‌కలమ్ 3-0-15-2, కొరి ఆండర్సన్ 3-0-18-0, మిచెల్ సాంట్నర్ 4-0-11-4, గ్రాంట్ ఇలియట్ 2-0-9-0, ఆడం మిల్నే 2.1-0-8-1, ఇష్ సోధి 4-0-18-3.
chitram...
భారత్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్ జట్టు