క్రీడాభూమి

జోరుమీదున్న టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా చేతిలో 2015 అక్టోబర్‌లో సిరీస్‌ను కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ టీమిండియాకు స్వదేశంలో అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. పైగా ఏసీఏ-వీడీసీఏ మైదానం భారత్‌కు అచ్చొచ్చింది. ఈ మైదానంలో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో టీమిండియా ఒకేసారి ఓటమిని ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాగా, ద్వైపాక్షిక వనే్డ సిరీస్‌ల్లో శ్రీలంక ఏడు పరాజయాలను చవిచూసింది. ఒక సిరీస్‌ను డ్రా చేసుకుంది. భారత్‌లో టీమిండియాపై మొదటిసారి వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని తిసర పెరెరా నాయకత్వంలోని ఆ జట్టు పట్టుదలతో ఉంది. కానీ, పటిష్టమైన భారత్‌ను ఎంత వరకూ ఎదుర్కొంటుందనేది అనుమానమే.
విశాఖపట్నం, డిసెంబర్ 16: శ్రీలంకతో మొహాలీలో జరిగిన రెండో వనే్డలో ఘన విజయం సాధించిన టీమిండియా అదే జోరును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగే చివరి, మూడో వనే్డకు రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు అన్ని రకాల అస్తశ్రస్త్రాలతో సిద్ధమైంది. ధర్మశాల వనే్డలో ఎవరూ ఊహించని రీతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న రోహిత్ సేన మొహాలీలో ప్రతీకార దాడికి దిగి, అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచి, విజయభేరి మోగించడంతో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వనే్డ ఉత్కంఠ రేపుతున్నది. అయితే, విశే్లషకులు మాత్రం టీమిండియానే ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి, నిర్లక్ష్యంగా ఆడినందుకే ధర్మశాలలో ఓటమి ఎదురైందని, అలాంటి పొరపాటు మరోసారి చేసే అవకాశం లేదని వారు అంటున్నారు. అంచనాలు, జోస్యాలు ఎలావున్నా, ఆదివారం నాటి పోరు క్రికెట్ అభిమానులకు గొప్ప విందును అందించడం ఖాయమనే చెప్పాలి.
ధర్మశాలలో కేవలం 112 పరుగులకే టీమిండియా కుప్పకూలిన విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకంతో రాణించకపోతే, భారత్‌కు ఆ మాత్రం స్కోరు కూడా సాధ్యమయ్యేది కాదన్నది వాస్తవం. ఎవరూ ఊహించని రీతిలో పాతాళానికి పడిపోయిన భారత బ్యాటింగ్ రెండో వనే్డలో అదే స్థాయిలో పుంజుకుంది. విరాట్ కోహ్లీ స్థానంలో పగ్గాలు తీసుకున్న రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, అజేయంగా డబుల్ సెంచరీ సాధించడంతో భారత్ 4 వికెట్లకు 392 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత లంకను 50 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులకే కట్టడి చేసి, 141 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకుంది. స్వదేశంలో సిరీస్‌ను కోల్పోకూడదన్న పట్టుదలతో ఉన్న రోహిత్ బృందం అమీతుమీ తేల్చుకోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధమైంది. కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే శిఖర్ ధావన్ పామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. టాప్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ వంటి సమర్థుడు జట్టుకు లభించాడు. మొహాలీలో 88 పరుగులు సాధించిన అతనికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్‌ను దానేష్ కార్తీక్, మనీష్ పాండే, ధోనీ, హార్దిక్ పాండ్య బలోపేతం చేస్తున్నారు. ఫాల్‌లో లేక అల్లాడుతున్న అజింక్య రహానేను ఈ మ్యాచ్‌లో ఆడిస్తారా లేక మొదటి రెండు వనే్డల్లో మాదిరిగానే అతనిని బెంచ్‌కి పరిమితం చేస్తారా అన్నది చూడాలి. దక్షిణాఫ్రికా టూర్‌ను దృష్టిలో ఉంచుకొని, రహానేకు ఒక అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే, దినేష్ కార్తీక్ లేదా హార్దిక్ పాండ్యలో ఎవరో ఒకరికి విశ్రాంతినివ్వక తప్పదు.
బౌలింగ్ విభాగానికి వస్తే, పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసరడానికి సిద్ధంగా ఉన్నారు. స్పిన్నర్లలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి. మొదటి వనే్డలో బౌలింగ్ చేసే అవకాశం దొరకని స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ రెండో వనే్డలో 60 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. చివరి వనే్డలోనూ రోహిత్ అతనికి కీలక బాధ్యతలు అప్పచెప్పవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
లంకకు ఊరట
మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌కు ఫిట్నెస్ సమస్య లేదని, అతని చివరి వనే్డలో ఆడతాడన్న సమాచారం శ్రీలంకకు ఊరటనిచ్చింది. రెండో వనే్డలో లంక పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, మాథ్యూస్ చూపిన పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది. సీనియర్ ఆటగాడు ఉపుల్ తరంగ తన స్థాయికి తగినట్టు ఆడితేగానీ, శ్రీలంకకు మెరుగైన స్కోరు సాధ్యం కాదు. లాహిరు తిరిమానే, దనుష్క గుణతిలక, నిరోషన్ డిక్‌విల్లా నిలకడలేమితో అల్లాడుతున్నారు. వీరు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తే, బ్యాటింగ్ విభాగంలో సమస్యల నుంచి శ్రీలంక బయటపడుతుంది. కాగా, మొదటి వనే్డలో అద్భుతంగా బౌల్ చేసిన సురంగ లక్మల్‌ను రెండో వనే్డలో భారత బ్యాట్స్‌మెన్ ఓ ఆటాడుకున్నారు. ఎనిమిది ఓవర్లలో 71 పరుగులు సమర్పించుకున్న అతను ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు. కెప్టెన్ తిసర పెరెరా మూడు వికెట్లు పడగొట్టగా, మిగతా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. విశాఖపట్నంలో పిచ్ తీరును దృష్టిలో ఉంచుకొని స్పిన్నర్ దుష్మంత చమీరను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. స్థూలంగా చూస్తే, భారత్ కంటే శ్రీలంక అన్ని విభాగాల్లోనూ బలహీనంగా కనిపిస్తున్నది. అయితే, తనదైన రోజున ఎలాంటి సంచలనాలైనా సృష్టించే సత్తా తనకు ఉందని ధర్వశాల వనే్డలో ఈ జట్టు నిరూపించింది. మరోసారి అలాంటి ఫలితం కోసమే ప్రయత్నంచే శ్రీలంకను అడ్డుకోవడానికి భారత్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యాన్ని వీడితే, చివరి మ్యాచ్‌తోపాటు, సిరీస్ కూడా టీమిండియాకే దక్కడం ఖాయం.
*
మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది