క్రీడాభూమి

భారత్‌కు కఠిన పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 21: మహిళల క్రికెట్ టీ-20 ముక్కోణపు టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే కఠిన పరీక్ష ఎదురుకానుంది. బలమైన ఆస్ట్రేలియాను నిలువరించి, విజయం సాధించడం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టుకు ఎంత వరకూ సాధ్యమన్నది అనుమానంగానే కనిపిస్తున్నది. ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 0-3 తేడాతో వైట్‌వాష్ వేయించుకున్న భారత జట్టు టీ-20 ఫార్మాట్‌లో ఆధిపత్యాన్ని కనబరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని అంటున్నారు. అంతేగాక, దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను 3-1 తేడాతో గెల్చుకున్న భారత్ ఈ ఫార్మాట్‌లో బలంగా ఉందని, కాబట్టి మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఆసీస్‌పై ఆధిపత్యాన్ని సంపాదించడం కష్టం కాదని వారి అంచనా. అయితే, పరిశీలకులు మాత్రం ఇది అనుకున్నంత సులభం కాదని స్పష్టం చేస్తున్నారు. వనే్డ సిరీస్‌ను చేజార్చున్నంత మాత్రాన టీ-20 ఫార్మాట్‌లోనూ పరాజయాలు ఎదురవుతాయని అనుకోవడానికి వీల్లేకపోయినా, సర్వశక్తులు ఒడ్డడంతోపాటు వ్యూహాత్మకంగా ఆడితేనే విజయాలు సాధ్యమని అంటున్నారు.
మందానాపైనే భారం!
భారత మహిళా జట్టు బ్యాటింగ్ విభాగం ఎక్కువగా స్మృతి మందానాపైనే ఆధారపడిందనడంలో అనుమానం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ సిరీస్‌లో ఆమె టాప్ స్కోరర్‌గా నిలిచింది. బ్యాక్ అండ్ బ్యాక్ అర్ధ శతకాలతో రాణించి, జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించింది. కానీ, మిగతా వారి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో, ఆమె శ్రమకు ఫలితం లేకపోయింది. టీ-20 ఫార్మాట్‌లోనూ ఆమె చెలరేగే అవకాశాలు లేకపోలేదు. కాగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్స్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిథాలీ రాజ్ కూడా బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తున్నారు. అయితే, వీరిద్దరూ నిలకడగా ఆడుతూ, క్రీజ్‌లో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. వేదా కృష్ణమూర్తి, ఆసీస్ సిరీస్ మొదటి వనే్డలో 51 పరుగులు సాధించిన ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, మూడో వనే్డలో ఆసీస్ బౌలింగ్‌కు ఎదురునిలిచి, 42 పరుగులు చేసిన ముంబయి యువ బ్యాట్స్‌విమన్‌జెమిమా రోడ్రిగ్స్ తదితరులు కూడా భారత బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. బౌలింగ్ విభాగానికి వస్తే, అంతర్జాతీయ వేదికలపై ఎంతో అనుభవం ఉన్న ఝూలన్ గోస్వామి, శిఖా పాండే కొత్త బంతిని పంచుకోనున్నారు. ఆసీస్‌పై వనే్డ సిరీస్‌లో ఐదు వికెట్లు సాధించిన శిఖా పాండే కూడా ఝూలన్‌తో సమానంగా జట్టులో స్థిరమై స్థానాన్ని సంపాదించిందనే చెప్పాలి. కాగా, స్పిన్ విభాగంలో దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన వీరిద్దరూ మరోసారి అదే స్థాయిలో సత్తాచాటే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఆస్ట్రేలియాతో పోలిస్తే కొంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, టీ-20 ఫార్మాట్‌లో ఏవైనా అద్భుతాలు జరగవచ్చన్నది అందరికీ తెలిసిందే. జట్టులోని ప్రతి ఒక్కరూ సమష్టి కృషిపై నమ్మకం ఉంచితే, ఇంగ్లాండ్ కూడా ఆడుతున్న ఈ ట్రై సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఆధిపత్యంపై ఆసీస్ ధీమా
టీ-20 ముక్కోణపు సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొనాల్సిన ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయంపై ధీమాతో ఉంది. భారత్, ఇంగ్లాండ్ జట్లపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచి, టైటిల్ సాధిస్తామన్న నమ్మకం మెక్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టులో స్పష్టంగా కనిపిస్తున్నది. భారత్‌తో వడోదరలో జరిగిన చివరి, మూడో వనే్డలో 133 పరుగులతో చెలరేగిపోయిన వికెట్‌కీపర్-బ్యాట్స్‌విమన్ అలిసా హీలీ మరోసారి బ్యాట్‌తో అద్భుతాలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. భారత బౌలర్లకు ఆమె నుంచి పెను సవాళ్లు తప్పవన్నది వాస్తవం. ఎడమచేతి వాటం స్పిన్నర్ జెస్ జొనాసెన్ బౌలింగ్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టిన ఆమె గురువారం నాటి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌విమెన్‌ను కట్టడి చేస్తుందని ఆసీస్ శిబిరం భావిస్తున్నది. స్పిన్ విభాగంలో ఆమెతోపాటు అమందా జేడ్ వెల్లింగ్టన్, ఆష్లే గార్డ్‌నర్ కూడా భారత పిచ్‌లపై రాణించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద, స్థూలంగా చూస్తే భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయిగా కనిపిస్తున్నది. అయితే, హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోని భారత్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం చేదు అనుభవాలను ఎదుర్కోక తప్పదు.

పోరాడతాం
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్
ముంబయి, మార్చి 21: మహిళల టీ-20 ఇంటర్నేషనల్ ట్రై సిరీస్‌లో విజయాలు సాధించేందుకు పోరాటం సాగిస్తామని భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో పోటీపడుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో పోలిస్తే భారత్ బలహీనంగా కనిపిస్తున్న మాట వాస్తవమేనని ఆమె అంగీకరించింది. శక్తిసామర్థ్యాల్లోనూ భారత మహిళల కంటే, విదేశీ మహిళలదే ఆధిక్యమని వ్యాఖ్యానించింది. అయితే, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని, గట్టిపోటీని ఇవ్వడానికి వ్యూహాత్మక పోరాటాన్ని సాగిస్తామని బుధవారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పింది. టీ-20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళలు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడతారని, వారి మాదిరి మ్యాచ్‌లు ఆడే అవకాశం తమకు లేదని పేర్కొంది. అనుభవంలో వారిదే పైచేయిగా ఉన్నప్పటికీ, నైపుణ్యంలోగానీ, పోరాట తత్వంలోగానీ భారత మహిళలు ఏమాత్రం తీసిపోరని తేల్చిచెప్పింది. ఆస్ట్రేలియాతో గురువారం జరిగే మొదటి మ్యాచ్‌లో విజయం కోసం కృషి చేస్తామని తెలిపింది. ఆసీస్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో తాము ఓడినప్పటికీ, ఆ ఫలితాల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, దృష్టి యావత్తు టీ-20 ఫార్మాట్‌లో పోరాటాలపైనే కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ టోర్నీలో జయాపజయాలు ఎలావున్నా, చివరి వరకూ పోరాడతామని హర్మన్‌ప్రీత్ చెప్పింది.
తక్కువ అంచనా వేయం: లానింగ్
భారత్‌ను తక్కువ అంచనా వేయలేమని ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ స్పష్టం చేసింది. ట్రై సిరీస్ మొదటి మ్యాచ్‌లోనే హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్‌ను ఢీకొనాల్సి రావడంతో, అన్ని విధాలా మ్యాచ్‌కి జాగ్రత్తగా సిద్ధమవుతున్నామని చెప్పింది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో 3-0 తేడాతో భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసినప్పటికీ, టీ-20 ఫార్మాట్‌లో అదే స్థాయి ఫలితాలను రాబట్టడం అనుకున్నంత సులభం కాదని స్పష్టం చేసింది. భారత జట్టులో సమర్థులైన క్రీడాకారిణులు ఎంతో మంది ఉన్నారని లానింగ్ కితాబునిచ్చింది.
ఎక్తా స్థానంలో రాజేశ్వరి
ముంబయి, మార్చి 21: గాయపడిన ఎడమచేతి వాటం స్పిన్నర్ ఎక్తా బిస్త్ స్థానంలో రాజేశ్వరీ గైక్వాడ్‌ను ఎంపిక చేశారు. మహిళల టీ-20 ఇంటర్నేషనల్ ట్రై సిరీస్‌లో ఆడేందుకు ఎంపికైన భారత జట్టులో ఎక్తాకు చోటు దక్కింది. అయితే, అంతకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ, చివరి వనే్డలో రిటర్న్ క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి గాయపడిన ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీనితో ఆమె స్థానంలో రాజేశ్వరిని జట్టులోకి తీసుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో ట్రోఫీని దక్కించుకోవ డానికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్లు కూడా పోటీపడుతున్నాయ. భారత్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది.