క్రీడాభూమి

చర్చల అనంతరమే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే విషయంలో క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యమని మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకూ కోచ్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తీ కాంట్రాక్టు టి-20 వరల్డ్ కప్‌తో ముగిసింది. అతని భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలావుంటే, టీమిండియాకు పూర్తికాలిక కోచ్ నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో బిసిసిఐ కొత్తకోచ్‌ని వెతికే పనిలో పడింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ, వివిఎస్ లక్ష్మణ్ వంటి కొన్ని పేర్లు వినిపించినప్పటికీ, ద్రవిడ్‌పైనే బోర్డు అధికారుల్లో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని సమాచారం. ద్రవిడ్‌కే కోచ్ పదవి దక్కే అవకాశాలున్నాయన్న వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.
నమ్మకం కుదిరితేనే..
భారత్ ‘ఎ’, అండర్-19 జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మెంటర్‌గా కూడా సేవలు అందిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న ద్రవిడ్ వివిధ స్థాయిల్లో కోచ్‌గా కూడా రాణిస్తున్న కారణంగా అతనినే కోచ్‌గా బిసిసిఐ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కాగా, మీడియాలో వస్తున్న వార్తలపై బుధవారం పిటిఐతో మాట్లాడుతూ ద్రవిడ్ పలు అంశాలను ప్రస్తావించాడు. సీనియర్ జట్టుకు కోచ్‌గా సేవలు అందించే సత్తా ఉందన్న నమ్మకం కుదిరిన తర్వాతే తాను అలాంటి ప్రతిపాదనలను ఆహ్వానిస్తానని స్పష్టం చేశాడు. కోచ్‌గా సేవలు అందించడం ఆషామాషీ వ్యవహారం కాదని అన్నాడు. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలని చెప్పాడు. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా తాను చూసిన అంశాలు, నేర్చుకున్న పాఠాలు వేరని అన్నాడు. కోచ్‌గా ఉత్తమ సేవలు అందించాలంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉండాలని చెప్పాడు. అంతేగాక అన్ని కోణాల నుంచి సమస్యను పరిశీలించి, ఎప్పటికప్పుడు వ్యూహ రచనలు చేయాల్సి వస్తుందన్నాడు. రోజులో ఇరవై నాలుగు గంటలు జట్టు గురించే ఆలోచించాలని అన్నాడు. అసలు కోచ్‌గా సేవలు అందించే సత్తా తనకు ఉందో లేదో ముందుగానే విశే్లషించుకుంటే మంచిదని పేర్కొన్నాడు. అందుకే, నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశాడు. చాలా మందిని సంప్రదించి, చర్చించి, ఆలోచించి, విశే్లషించిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఫలితాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అత్యుత్తమ సేవలు అందించడమే మన వంతని తెలిపాడు. ఇలావుంటే, ద్రవిడ్‌ను ఇప్పటికే బిసి సిఐ అధికారులు సంప్రదించినట్టు వార్తలు వచ్చాయ. అయతే, ఇరు వర్గాలు ఇప్ప టి వరకూ అధికారికంగా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఈ వార్తలను ద్రవిడ్ ఖండించకపోవడం విశేషం.

అజ్లన్‌షా హాకీ టోర్నీ
జపాన్‌పై భారత్ గెలుపు
ఇపో, ఏప్రిల్ 6: అజ్లన్‌షా హాకీ టోర్నమెంట్ తొలి రో జున జపాన్‌ను ఢీకొన్న భారత్ 2-1 తేడాతో గెలుపొందిం ది. వాస్తవానికి సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జ ట్టు తన స్థాయకి తగినట్టు ఆడలేకపోయంది. అన్ని విభా గాల్లోనూ అత్యంత సామాన్యంగా ఉన్న జపాన్‌ను ఓడిం చడానికి నానా తంటాలు పడడం భారత జట్టు సరైన ఫా మ్‌లో లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. మ్యాచ్ 17వ నిమిషంలో భారత రక్షణ వలయాన్ని ఛేదించిన జపాన్ ఆ టగాడు కెన్జీ కిటాజాటో గోల్ చేశాడు. ఈ అనూహ్య పరి ణామంతో భారత్ కంగుతిన్నది. ఆతర్వాత ఎఋదాడికి ఉప్రకమించింది. 245వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ఈక్వెలైజర్‌ను అందించాడు. 32వ నిమిషంలో కెప్టెన్ సర్దార్ సింగ్ గోల్ చేశాడు. ఈ కీలక గోల్ భారత్‌ను గెలి పించింది. అయతే, జపాన్ ఆటకే విమర్శలకుల ప్రశంస లు లభించాయ. భారత ఫార్వర్డ్ ఆటగాళ్లను నియంత్రీక రించడంలో జపాన్ చాలా వరకు సఫలమైంది. ప్రత్యర్థి జట్టు బలాబలాలను బట్టి చూస్తే సర్దార్ సేన భారీ తేడాతో విజయాన్ని అందుకొని ఉండాల్సింది. కానీ, నామమాత్ర పు విజయాన్ని అందుకుంది. ఇలావుంటే, డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, మలేసియా జట్ల మధ్య జరిగి న మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి మూడు గోల్స్ చేశాయ. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.

సమీకి అరుదైన గౌరవం

సెయింట్ జాన్స్, ఏప్రిల్ 6: టి-20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న వెస్టిండీస్ జట్టు కెప్టెన్ డారెన్ సమీకి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కింది. అతని స్వస్థలమైన సెయింట్ లూసియాలోని క్రికెట్ స్టేడియంలోని మైదానానికి అతని పేరు పెట్టినట్టు సెయింట్ లూసియా ప్రధాని కెన్నీ డి. ఆంథొనీ ప్రకటించాడు. ఇప్పటి వరకూ బ్యూసజర్ క్రికెట్ గ్రౌండ్‌గా పిలుస్తున్న ఈ మైదానాన్ని ఇకపై అంతా డారెన్ సమీ నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌గా పిలుస్తారని అన్నాడు. సమీతోపాటు విండీస్ ఓపెనర్ జాన్సన్ చార్లెస్ కూడా సెయింట్ లూయిస్‌కు చెందిన వాడే. టి-20 వరల్డ్ కప్‌ను గెల్చుకున్న తర్వాత అందరూ తమను అభినందించారని, కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) మాత్రం స్పందించలేదని సమీ వాపోయిన విషయం తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డు తమను నిర్లక్ష్యం చేసిందని, అవమానించిందని ఆరోపించాడు. కాగా, సమీ వ్యాఖ్యలను విండీస్ బోర్డు ఖండించింది. అలాంటి ఆరోపణలు చేయడం భావ్యం కాదని తెలిపింది. సమస్యలేవైనా ఉంటే చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. మొత్తం మీద సమీ వివాదస్పదుడిగా ముద్రపడగా, అతనికి స్వదేశంలో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అతని రాకకోసం వారంతా ఎదురుచూస్తున్నారు. చివరి క్షణం వరకూ టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొంటామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో విండీస్ క్రికెటర్లు ఆందోళనకు గురయ్యారు. సమస్యకు తాత్కాలికంగా తెరపడి, వారు కోల్‌కతా చేరుకున్నా, విండీస్ బోర్డు ఎలాంటి చేయూతను అందించలేదు. మొదటి మ్యాచ్ జరగడానికి ముందు రోజు రాత్రి వారికి డ్రస్సు అందిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. అయితే, ప్రతికూల పరిస్థితులే సమీలో పట్టుదలను పెంచాయి. విజయాలను నమోదు చేసి, బోర్డు అధికారులకు తామంటే ఏమిటో నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే, స్ఫూర్తిదాయమైన నాయకత్వంతో సహచరులను ముందుకు నడిపించాడు. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడి, మూడింటిని గెల్చుకున్న వెస్టిండీస్ సెమీ ఫైనల్‌లో భారత్‌ను చిత్తుచేసింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గత ఆదివారం 14వ టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. వీటిలో విండీస్ పది విజయాలను సాధించగా, ఇంగ్లాండ్ కేవలం నాలుగు పర్యాయాలు గెలిచింది. టి-20 వరల్డ్ కప్‌లో ఐదోసారి విండీస్‌తో తలపడిన ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది.

గ్రాండ్ శ్లామ్ అసాధ్యమేమీ కాదు
యువ గోల్ఫర్ స్పీత్
అగస్టా (అమెరికా), ఏప్రిల్ 6: ఒక క్యాలెండర్ ఇయర్‌లో గ్రాండ్ శ్లామ్ సాధించడం అసాధ్యమేమీ కాదని అమెరికా యువ గోల్ఫర్ జోర్డాన్ స్పీత్ అభిప్రాయపడ్డాడు. మాస్టర్స్, యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టైటిళ్లను కైవసం చేసుకున్న అతను బ్రిటిష్ ఓపెన్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడు. అయితే, కొద్దిలో అతనికి టైటిల్ చేజారింది. ఆ టోర్నీలోనూ గెలిచివుంటే బెన్ హోగన్ తర్వాత గోల్ఫ్ గ్రాండ్ శ్లామ్‌గా పేర్కొనే మూడు మేజర్ టైటిళ్లను సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. ఆ అవకాశం చేజారినప్పటికీ, సమీప భవిష్యత్తులోనే అది తనకు సాధ్యమవుతుందని స్పీత్ ధీమా వ్యక్తం చేశాడు. తీవ్రమైన పోటీని, విపరీతమైన ఒత్తిడిని తట్టుకొని ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు మేజర్ టైటిళ్లను కైవసం చేసుకోవడం సులభం కాదని అతను అంగీకరించాడు. అయితే, అది అసాధ్యం కూడా కాదని వ్యాఖ్యానించాడు.

ప్రైజ్‌మనీ వీరుడు జకొవిచ్

మియామీ, ఏప్రిల్ 6: టెన్నిస్‌లో అందరి కంటే ఎక్కువగా ప్రైజ్‌మనీ సంపాదించిన క్రీడాకారుడిగా ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకొవిచ్ రికార్డు సృష్టించినట్టు ఎటిపి తాజా వివరాలు స్పష్టం చేస్తున్నాయ. స్విట్జర్లాండ్ హీరో రోజర్ ఫెదరర్ కెరీర్ ప్రైజ్‌మనీ 9,78,55,881 డాలర్లు (సుమారు 650 కోట్ల రూపాయలు)కాగా, ఇటీవలే మియామీ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకోవడం ద్వారా దక్కిన 1.028 మిలియన్ డాలర్లతో కలిసి ప్రైజ్‌మనీ కింద జకొవిచ్ సంపాదన 9,81,99,548 డాలర్లుకు చేరింది. 2011, 2012, 2014, 2015 సీజన్లలో అత్యధిక సంపాదన కూడా జకొవిచ్‌దే. ఈ సంవత్సరాల్లో అతను వరుసగా 1,26,19,803 డాల ర్లు సంపాదించాడు. 2012లో 1,28,03,737 డాలర్లు, 2014లో 1,42,50,527 డాలర్ల చొప్పున అతను సంపాదించాడు. 2013లో రాఫెల్ నాదల్ 1,45,70,935 డాలర్లతో ఈ జాబితాలోకి చేరాడు. అత్యధిక కెరీర్ ప్రైజ్‌మనీ సంపాదించిన ‘టాప్-5’లో మొదటి రెండు స్థానాలను జకొవిచ్, ఫెదరర్ ఆక్రమించుకోగా, మిగతా మూడు స్థానాల్లో రాఫెల్ నాదల్ (7,64,08,882 డాలర్లు), ఆండీ ముర్రే (4,36,09,616 డాలర్లు), పీట్ సంప్రాస్ (7,64,08,882 డాలర్లు) ఉన్నారు.
కోచ్‌ని మించిపోయాడు!
జకొవిచ్‌కు కోచ్‌గా మాజీ టెన్నిస్ వీరుడు బోరిస్ బెకర్ వ్యవహరిస్తున్నాడు. మియామీ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకోవడం ద్వారా కెరీర్ విజయాల్లో బెకర్‌ను జకొవిచ్ మించిపోయాడు. బెకర్ కెరీర్‌లో 713 విజయాలను సాధించగా, జకొవిచ్ 714వ విజయాన్ని నమోదు చేశాడు. అత్యధిక విజయాల జాబితాలో అతను ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు.
కెరీర్‌లో అత్యధిక విజయాలు
1. జిమీ కానర్స్ 1,257, 2. ఇవాన్ లెండిల్ 1,071, 3. రోజర్ ఫెదరర్ 1,067, 4. గెలెర్మో విలాస్ 929, 5. జాన్ మెకెన్రో 875, 6. ఆండ్రీ అగస్సీ 870, 7. స్ట్ఫోన్ ఎడ్బర్గ్ 801, 8. రాఫెల్ నాదల్ 779, 9. ఇలీ నాట్సే 776, 10. పీట్ సంప్రాస్ 762.

వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ ఈ సిరీస్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ను గెలిచాడు. అన్ని పర్యాయాలు అతను ఫీల్డింగ్‌నే ఎంచుకోవడం విశేషం.
ఫైనల్‌లో వెస్టిండీస్ గెలుస్తుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు. ఇంగ్లాండ్‌నే హాట్ ఫేవరిట్‌గా అభివర్ణించారు. కానీ, ఎలాంటి అంచనాలు లేకుండానే గ్రూప్ దశను పూర్తిచేసి, సెమీస్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్ చేరిన విండీస్ తన విజయాలు కాకతాళీయం కాదని, గెలిచే సత్తా తమకు ఉందని తుది పోరులో ఇంగ్లాండ్‌ను ఓడించి నిరూపించింది. బ్రాత్‌వెయట్ చివరి ఓవర్‌లో కొట్టిన నాలుగు సిక్సర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయ. ఇంగ్లాండ్‌పై విండీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయ. ఎవరూ ఊహించని విధంగా గెలిచింది కాబట్టే విండీస్‌కు ఎక్కడ చూసినా అఖండ స్వాగతం లభిస్తున్నది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

ర్యాంప్‌పై గంగూలీ!
కోల్‌కతా, ఏప్రిల్ 6: భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని క్రికెట్ మైదానంలో వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నప్పుడు మాత్రమే చూసిన అభిమానులకు ఇప్పుడు ర్యాంప్‌పై అతను ఎంత అద్భుతంగా క్యాట్ వాక్ చేస్తాడో చూసే అవకాశం లభించనుంది. టాటా మెడికల్ సెంటర్‌లోని కేన్సర్ విభాగంలో మెరుగైన వైద్య సేవలు లభించేందుకు తన వంతు కృషిగా అతను నిధుల సేకరణకు నడుం బిగించాడు. ఇప్పటికే తన క్రికెట్ కిట్‌లోని కొన్ని వస్తువులను వేలం వేయడానికి విరాళంగా ఇచ్చాడు. మరింత సొమ్మును సేకరించేందుకు ర్యాంప్‌పై మెరవడానికి సిద్ధమయ్యాడు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సొమ్మును టాటా మెడికల్ సెంటర్‌కు ఇస్తానని బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గంగూలీ చెప్పాడు. కేన్సర్‌కు ఎంతోమంది గురవుతున్నారని, అలాంటి వారికి అత్యుత్తమ వైద్య సేవలు అవసరమని పేర్కొన్నాడు. క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి గంగూలీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతను తనకు చాలా సన్నిహితుడని చెప్పాడు. కేన్సర్ వ్యాధి సోకినప్పుడు యువీ ఎంత బాధపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసునని అన్నాడు. అతను వ్యాధిని జయించి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం తనకు ఎంతో ఆనందాన్నిస్తున్నదని చెప్పాడు. కేన్సర్ బాధితులకు తన వంతు సాయం చేస్తానని అన్నాడు.

ప్రజలకంటే ఐపిఎల్ ముఖ్యమా?

నీటి వాడకంపై ఎంసిఎను నిలదీసిన బాంబే హైకోర్టు

ముంబయి, ఏప్రిల్ 6: ప్రజల సంక్షేమం కంటే ఐపిఎల్ ముఖ్యమా? అంటూ ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ)ను బాంబే హైకోర్టు నిలదీసింది. నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే, విచ్చలవిడిగా నీటిని వాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి లేని ప్రాంతాలకు మ్యాచ్‌లను తరలించాలని సూచించింది. ఐపిఎల్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఐపిఎల్‌లో భాగంగా కనీసం 19 మ్యాచ్‌లు ముంబయి, పుణే, నాగపూర్ నగరాల్లో జరుగుతాయి. వీటి కోసం మైదానాలను సిద్ధం చేయడానికి భారీగా నీటిని వాడుతున్నారు. గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతుంటే, ఐపిఎల్ పేరుతో నీటిని వృథా చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నీటిని వృథా చేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజల కంటే ఐపిఎల్ మ్యాచ్‌లే మీకు ముఖ్యమా? నీటి కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతుంటే, నీటిని పొదుపు చేయకపోవడమేగాక వృథా చేస్తారా? ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు’ అని ఎంసిఎను నిలదీసింది. తాగడానికి పనికిరాని నీటిని మాత్రమే తాము పిచ్‌లను తడిపేందుకు వాడుతున్నామని, పైగా ఆ నీటిని తాము కొనుగోలు చేసి మరీ వాడుతున్నామని ఎంసిఎ వాదించింది. అయితే కోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు. నీటిని వృథా చేయడం కూడా నేరం కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. నీటి వృథాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్క బొట్టు నీటి వృథాను కూడా రాష్ట్రం భరించే స్థితిలో లేదని పేర్కొంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నకారణంగా మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను ఈ సమస్య లేని ఇతర ప్రాంతాలకు మార్చాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఐపిఎల్ టోర్నీ శనివారం నుంచి ప్రారంభం కానున్న విష యం తెలిసిందే. తొలి మ్యాచ్ మంబయ లో, ముంబయ ఇండియన్స్, రైజింగ్ పు ణె సూపర్‌జెయంట్స్ జట్ల మధ్య శని వారం జరుగుతుంది.

షెడ్యూల్ మారదు
ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా
ముంబయి, ఏప్రిల్ 6: ఐపిఎల్ ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించే ప్రసక్తి లేదని టోర్నీ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. మరాట్వాడా ప్రాంతంలో కరవు పరిస్థితి తమను కూడా ఆందోళనకు గురి చేస్తున్నదని అన్నాడు. అయితే, మూడు మైదానాల్లో, కొన్ని లీటర్లను పొదుపు చేసినంత మాత్రాన ఎద్దడికి తెరపడుతుందా? అని ప్రశ్నించాడు. నీటి ఎద్దడి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నాడు. కరవు పరిస్థితులను ఐపిఎల్‌తో ముడిపెట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించాడు. ఐపిఎల్ వల్ల ఎలాంటి నష్టం లేదని అన్నాడు. కొంత మంది ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం సృష్టిస్తున్నారని చెప్పాడు.

19 మ్యాచ్‌లకు
60 లక్షల లీటర్లు!
ముంబయి, ఏప్రిల్ 6: ముంబయి, నాగపూర్, పుణె నగరాలు 19 ఐపిఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వీటి నిర్వాహణ కోసం మైదానాలను సిద్ధం చేసేందుకు సుమారు 60 లక్షల లీటర్ల నీరు అవసరమవుతాయని పిటిషనర్లు తెలిపారు. పుణె, నాగపూర్ నగరాల్లో నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముంబయిలోనూ నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తెలిపారు. నీరులేక జనం అల్లాడుతుంటే, ఐపిఎల్ మ్యాచ్‌ల పేరుతో లక్షలాది లీటర్ల నీటిని వృథా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌లు జరగకుండా అడ్డుకోవాలని తమ పిటిషన్‌లో కోరారు. ఇలావుంటే, మహారాష్ట్ర అంతటా వార్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరాట్వాడా ప్రాంతంలో నీటి ఎద్దడి మరింత దారుణంగా ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో నీరు సగటున 22 శాతానికి పడిపోయింది. మరట్వాడా ప్రాంతంలో 11 మేజర్ డ్యామ్‌లు ఉండగా, వాటిలో ఏడింటిలో నీరు ఐదు శాతం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం లక్షల లీటర్ల నీటిని వాడడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని బిజెపి ఇప్పటికే డిమాండ్ చేసింది. కోర్టు కూడా ఐపిఎల్ మ్యాచ్‌లకు నీటి వృథాపై తీవ్రంగా స్పందించింది. గురువారం నాటికి కేసును వాయదా వేయడంతో, మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌ల పరిస్థితిపై అనిశ్చితి కొనసాగుతున్నది. బాంబే హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? దానిపై బిసిసిఐ ఏ విధంగా స్పందిస్తుంది అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయ. పలువురు రాజకీయ నాయకులు ఐపిఎల్ మ్యాచ్‌లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐపిఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని ఏదైనా రాజకీయ పారీ ట లేదా సంస్థ ప్రకటిస్తే ఉద్రిక్త వాతావరణం నెలకొనడం ఖాయం. నీటి ఎద్దడికి, ఐపిఎల్ టోర్నీకీ ముడిపెట్టవద్దని బిసిసిఐ అంటున్నది.