క్రీడాభూమి

కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సమష్టిగా రాణించిన దినేష్ కార్తీక్ సేన * అజింక్య రహానే, డీఆర్సీ షార్ట్ శ్రమ వృథా
జైపూర్, ఏప్రిల్ 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇక్కడి సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్‌ను ప్రారంభించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఈ టీమ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. జట్టులో ఆర్సీ షార్ట్, కెప్టెన్ అజింక్య రహానే, జోస్ బట్లర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయలేదు. కెప్టెన్ అజింక్య రహానేతో ఆర్సీ షార్ట్ ఓపెనర్లుగా దిగారు. రహానే 19 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు బౌండరీల సహాయంతో 36 పరుగులు చేసి 6.5 ఓవర్‌లో జట్టు స్కోరు 54 పరుగులు ఉండగా నితీష్ రాణా బౌలింగ్‌లో కార్తీక్‌కు స్టంపవుట్ చేశాడు. అనంతరం బరిలోకి దిగిన వికెట్ కీపర్ సంజు శ్యాంసన్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఏడు పరుగులు చేసి 8.4 ఓవర్‌లో జట్టు స్కోరు 62 ఉండగా శివమ్ మావి బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. డీ ఆర్సీ షార్ట్ 43 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు బౌండరీల సహాయంతో 44 పరుగులు చేసి నితీష్ రాణా చేతిలో బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 98. రాహుల్ త్రిపాఠి 11 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 15 పరుగులు చేసి జట్టు స్కోరు 106 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. బెన్ స్టోక్స్ 11 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 14 పరుగులు చేసి చావ్లా బౌలింగ్‌లో నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. అప్పటికి జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 16.1 ఓవర్లలో 112. కృష్ణప్ప గౌతమ్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 12 పరుగులు చేసి టామ్ కరణ్ బౌలింగ్‌లో శివమ్ మావి చేతికి దొరికిపోయి అవుటయ్యాడు. శ్రేయాస్ గోపాల్ పరుగుల ఖాతా తెరవకుండానే టామ్ కరణ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు 18.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ధావల్ కులకర్ణి మూడు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి శివమ్ మావి బౌలింగ్‌లో శుభ్‌మాన్ చేతిలో రనౌట్ అయ్యాడు. జోస్ బట్లర్ 18 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జయదేవ్ ఉనద్కత్ పరుగులేమీ చేయలేదు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో నితీష్ రాణా రెండు ఓవర్లలో 11 పరుగులిచ్చి రెండు వికెట్లు, టామ్ కరణ్ రెండు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. పీయూష్ చావ్లా నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి ఒక వికెట్, కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి ఒక వికెట్, శివమ్ మావి నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు.
ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 161 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 18.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. జట్టులో రాబిన్ ఉతప్ప అత్యధికంగా 48 పరుగులు చేశాడు. వాస్తవానికి ఈ టీమ్‌లో క్రిస్ లీన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లంతా సమష్టిగా రాణించి జట్టు గెలుపునకు చేయూత అందించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లలో క్రిస్ లీన్ రెండు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే కృష్ణప్ప గౌతం చేతిలో బౌల్డ్ అయ్యాడు. దీంతో మరో ఓపెనర్ సునీల్ నరైన్ రెండో వికెట్ పడకుండా రాబిన్ ఉతప్పతో కలసి పరుగుల వరద పారించాడు. అయితే, జట్టు స్కోరు 70 వద్ద ఉండగా 8.4 ఓవర్‌లో జోస్ బట్లర్ బౌలింగ్‌లో నరైన్‌ను జయదేవ్ ఉనద్కత్ రనౌట్ చేశాడు. సునీల్ నరైన్ 25 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు బౌండరీల సహాయంతో 35 పరుగులు చేశాడు. మంచి ఊపుమీదున్న రాబిన్ ఉతప్ప అర్ధ సెంచరీకి చేరువలో కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఉతప్ప 36 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు బౌండరీల సహాయంతో 48 పరుగులు చేశాడు. అప్పటికి జట్టు 12.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఆ తర్వాత వికెట్లు పడకుండా కెప్టెన్ దినేష్ కార్తీక్ జాగ్రత్త వహించాడు. ఈ నేపథ్యంలో నితీష్ రాణా 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీల సహాయంతో 35 పరుగులు, కెప్టెన్/వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 23 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు బౌండరీల సహాయంతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును విజయపథంలో నిలిపారు. ఇదిలావుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టులో కృష్ణప్ప గౌతమ్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంతవరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇపుడు గెలుపుతో మూడో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకోగా, రాజస్థాన్ రాయల్స్ ఇంతవరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింట్లో పరాజయం పాలైంది.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్ రాయల్స్: 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు. (అజింక్య రహానే స్టంప్ బి నితీష్ రాణా 36, డీఆర్సీ షార్ట్ బి నితీష్ రాణా 44, జోస్ బట్లర్ నాటౌట్ 24).
కోల్‌కతా నైట్ రైడర్స్: 18.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు. (సునీల్ నరైన్ రనౌట్ ఉనద్కత్/జోస్ బట్లర్ 35, రాబిన్ ఉతప్ప సి స్టోక్స్ బి గౌతమ్ 48, నితీష్ రాణా నాటౌట్ 35, దినేష్ కార్తీక్ నాటౌట్ 42).