క్రీడాభూమి

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఫ్రాంచైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) హేమంత్ దువా, కోచ్ రికీ పాంటింగ్ బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 36 ఏళ్ల గంభీర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా జట్టు ఆడబోయే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లలోనూ ప్రాతినిధ్యం వహిస్తాడు. దశాబ్దకాలం పాటు టీమిండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను కైవసం చేసుకోవడంలో కెప్టెన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.
ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీ రెండు కోట్ల రూపాయలు వెచ్చించి గౌతం గంభీర్‌ను జట్టులోకి తీసుకోవడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలను సైతం అప్పగించింది. అయితే, ఈ జట్టు ఇంతవరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకదాన్లోనే విజయం సాధించింది. ముంబయి ఇండియన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో గెలుపు సాధించినా ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు ఆఖరి స్థానంలో నిలిచింది. ముంబయిపై గెలుపుతో మంచి ఊపుమీదున్న ఢిల్లీ ఆ తర్వాత మ్యాచ్‌లలో ఘోరంగా విఫలం అవుతున్న నేపథ్యంలో ఎదురవుతున్న ఒత్తిడి తట్టుకోలేక, వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న గంభీర్ ప్రకటించాడు. ‘నా శక్తి సామర్ధ్యాలతో అనుకున్నంత లక్ష్యానికి చేరుకోలేకపోయాను. నాపై వచ్చిన ఒత్తిడిని జయించేందుకు చాలాసార్లు ఒంటరిగా కూర్చుని ఆలోచించాను..ప్రస్తుత పరిస్థితుల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే మేలని అనుకున్నాను’ అని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్‌లో గంభీర్ ముంబయితో ఆడిన మ్యాచ్‌లో 55 పరుగులు చేసినా ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమనేది తన స్వంత నిర్ణయమని, ఇందులో తమ ఫ్రాంచైజీ యాజమాన్యం తనపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశాడు. టీమిండియాతో ఎంతో ఒత్తిడి ఉన్న సమయంలోనూ సమర్థవంతంగా రాణించిన గంభీర్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడిన ఏడేళ్ల కాలంలోనూ విజయవంతమైన క్రికెటర్‌గా పేరుగాంచాడు. ఇదిలావుండగా, ఢిల్లీ జట్టు కొత్త కెప్టెన్‌గా ఎంపికైన 23 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ టీమ్‌లోని టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు.
ఇప్పటివరకు రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు అప్పగించడంతో వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నాడు. కాగా, టీమ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ తమ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకోడానికి అవకాశాలు ఉన్నాయని, జట్టులోని సభ్యులమంతా సమష్టిగా కలసి పనిచేసి ముందుకు దూసుకుపోతామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

ఢిల్లీలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతున్న గౌతం గంభీర్, పక్కన ఢిల్లీ జట్టు కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్