క్రీడాభూమి

బెంగళూరు ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అత్యంత కీలకమైన మ్యాచ్‌ని గెల్చుకున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్రత్యర్థి ముందు కేవలం 165 పరుగుల లక్ష్యానే్న ఉంచినప్పటికీ, పకడ్బందిగా బౌలింగ్ చేసి, బెంగళూరును 134 పరుగులకే కట్టడి చేసింది. శ్రేయాస్ గోపాల్ నాలుగు ఓవర్లలో 16 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్
హోం గ్రౌండ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఛేజింగ్‌లో విఫలమవుతున్న కారణంగా, ప్రత్యర్థి ముందు లక్ష్యాన్ని ఉంచడమే మేలన్న అభిప్రాయంతో తొలుత బ్యాటింగ్‌కు దిగినప్పటికీ, ఫలితం లేకపోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికే జొఫ్రా ఆర్చర్ ఔటయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతాను తెరవలేకపోయిన అతను ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌లో మైదానంలోకి దిగిన కెప్టెన్ అజింక్య రహానేతో కలిసి ఓపెనర్ రాహుల్ త్రిపాఠీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. 31 బంతుల్లో, మూడు ఫోర్ల సాయంతో 33 పరుగులు చేసిన రహానేను ఉమేష్ యాదవ్ ఎల్‌బీగా ఔట్ చేయడంతో, రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతికే సంజూ శాంసన్ (0)ను మోయిన్ అలీ క్యాచ్ పట్టగా ఔట్ చేసిన ఉమేష్ యాదవ్ రాజస్తాన్‌ను దెబ్బతీశాడు. వికెట్‌కీపర్ హెన్రిక్ క్లాసెన్ భాగస్వామ్యంలో స్కోరుబోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన త్రిపాఠీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. 21 బంతులు ఎదుర్కొని, 32 పరుగులు చేసిన క్లాసెన్‌ను మోయిన్ అలీ క్యాచ్ అందుకోగా మహమ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. క్లాసెన్ స్కోరులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. చివరిలో కృష్ణప్ప గౌతం కేవలం ఐదు బంతుల్లోనే 14 పరుగులు చేసి, ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. రాజస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు సాధించగా, త్రిపాఠీ 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 56 బంతులు ఎదుర్కొన్న అతను ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. బెంగళూరు బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించగా, మహమ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది.
నిరాశపరచిన కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి గ్రూప్ మ్యాచ్‌లో అభిమానులను నిరాశ పరిచాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న అతను కేవలం నాలుగు పరుగులు చేసి, కృష్ణప్ప గౌతం బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఓపెనర్ పార్థీవ్ పటేల్ కొంత సేపు రాజస్తాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. 21 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసిన పార్థీవ్ పటేల్‌ను హెన్రిక్ కార్ల్‌సెన్ స్టెంప్ చేయగా, శ్రేయాస్ గోపాల్ ఔట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతిలో అతను మోయిన్ అలీ (1)ని రిటర్న్ క్యాచ్ అందుకొని పెవిలియన్‌కు పంపాడు. ఈ వికెట్‌తో సమస్యల్లో పడిన బెంగళూరు తిరిగి కోలుకోలేకపోయింది. మన్దీప్ సింగ్ (3), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (2), సర్ఫ్‌రాజ్ ఖాన్ (7) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరగా, 35 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసిన డివిలియర్స్ కూడా కార్ల్‌సెన్ స్టంప్ చేయడంతో, శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. టిమ్ సౌథీ (14), ఉమేష్ యాదవ్ (0), మహమ్మద్ సిరాజ్ (14) పెవిలియన్‌కు క్యూకట్టగా, 19.2 ఓవర్లలో 134 పరుగులకు బెంగళూరు ఆలౌటైంది. నాలుగు బంతులు ఎదుర్కొన్న యుజువేంద్ర చాహల్ పరుగుల ఖాతాను తెరవకుండా క్రీజ్‌లో నిలిచాడు. శ్రేయాస్ గోపాల్‌కు నాలుగు వికెట్లు లభించాయి. బెన్ లాగ్లిన్, జయదేవ్ ఉనాద్కత్ చెరి 2 వికెట్లు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్ రాయల్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 (రాహుల్ త్రిపాఠీ 80 నాటౌట్, అజింక్య రహానే 33, హెన్రిచ్ క్లాసెన్ 32, ఉమేష్ యాదవ్ 3/25).
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 19.2 ఓవర్లలో 134 ఆలౌట్ (పార్థీవ్ పటేల్ 33, ఏబీ డివిలియర్స్ 53, శ్రేయాస్ గోపాల్ 4/16, బెన్ లాగ్లిన్ 2/15, జయదేవ్ ఉనాద్కత్ 2/27).
చిత్రం..ఇంటికేనా.. కోహ్లీ నిరాశ