క్రీడాభూమి

ఫించ్ విజృంభణతో లయన్స్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న గుజరాత్ లయన్స్ మరోసారి సత్తా చాటుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించిన ఆ జట్టు శనివారం జరిగిన ఉత్కంఠ భరిత పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను వారి సొంత గ్రౌండ్‌లోనే మట్టికరిపించి హ్యాట్రిక్ సాధించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు రాబట్టగా, చిట్టచివరి బంతి వరకూ పోరాడిన గుజరాత్ లయన్స్ 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు చివరి బంతిని ఫోర్‌గా మలచిన ఓపెనర్ ఆరోన్ ఫించ్ (67-నాటౌట్) గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ను ధవళ్ కులకర్ణి ఆరంభంలోనే చావుదెబ్బ తీశాడు. అతని జోరును ప్రతిఘటించడంలో విఫలమై కెప్టెన్ రోహిత్ శర్మ (7)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ హార్ధిక్ పాండ్యా (2) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో ముంబయి ఇండియన్స్ జట్టు 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే సహచరుల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. జోస్ బట్లర్ (16), కీరన్ పొలార్డ్ (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా పార్థివ్ పటేల్ 34 పరుగులు సాధించి ప్రవీణ్ తాంబే బౌలింగ్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్‌కు దొరికిపోయాడు. కొద్ది సేపటికి హర్భజన్ సింగ్ (8), అంబటి రాయుడు (20) కూడా నిష్క్రమించడంతో ముంబయి ఇండియన్స్ 99 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో కునాల్ పాండ్యా (20-నాటౌట్), టిమ్ సౌథీ (25) కొంతమేర ఆదుకోవడంతో ముంబయి ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగుల స్కోరు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ జట్టు నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కలమ్ (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరినప్పటికీ ఓపెనర్ ఆరోన్ ఫించ్ విజృంభించి ఆడాడు. కెప్టెన్ సురేష్ రైనా (27), అక్షదీప్ నాథ్ (12) మినహా మిగిలిన వారంతా రెండంకెల స్కోర్లు రాబట్టకుండానే నిష్క్రమించినప్పటికీ చూడముచ్చటైన షాట్లతో బాధ్యతాయుతంగా ఆడి ఒంటి చేత్తో పోరాటం సాగించిన ఫించ్ (67)తో పాటు టెయిలెండర్ ధవళ్ కులకర్ణి (6) అజేయంగా నిలిచారు. దీంతో 20 ఓవర్లలో 147 పరుగులు సాధించిన గుజరాత్ లయన్స్ జట్టు 3 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఇండియన్స్‌కు ఇది రెండో ఓటమి.
సంక్షిప్తంగా స్కోర్లు
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 143/8 (పార్థివ్ పటేల్ 34, టిమ్ సౌథీ 25, కునాల్ పాండ్యా (20-నాటౌట్), అంబటి రాయుడు 20, జోస్ బట్లర్ 16). వికెట్ల పతనం: 1-7, 2-19, 3-51, 4-59, 5-77, 6-88, 7-99, 8-141. బౌలింగ్: ప్రవీణ్ తాంబే 2-0-12-2, ధవళ్ కులకర్ణి 4-1-19-2, సాదబ్ జకాతీ 3-0-13-1, డ్వెన్ బ్రావో 4-0-39-1, జేమ్స్ ఫాల్క్‌నర్ 4-0-40-1, ప్రవీణ్ కుమార్ 3-0-18-0.
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 147/7 (ఆరోన్ ఫించ్ 67-నాటౌట్, సురేష్ రైనా 27, అక్షదీప్ నాథ్ 12). వికెట్ల పతనం: 1-12, 2-65, 3-80, 4-83, 5-109, 6-131, 7-131.
బౌలింగ్: మెక్ క్లెనఘన్ 4-0-21-4, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-32-2, కునాల్ పాండ్యా 4-0-20-1, టిమ్ సౌథీ 4-0-31-0, హార్ధిక్ పాండ్యా 2-0-16-0, హర్భజన్ సింగ్ 2-0-20-0.