క్రీడాభూమి

సన్‌రైజర్స్‌కు మళ్లీ నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చుక్కెదురైంది. ఉప్పల్ (హైదరాబాద్)లోని సొంత మైదానం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు రాబట్టగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 146 పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి నైట్ రైడర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6), ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ మోజెస్ హెన్రిక్స్ (6)తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా (6) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో సన్‌రైజర్స్ జట్టు 50 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఇయాన్ మోర్గాన్ (51), వికెట్ కీపర్ నమన్ ఓజా (37) కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు 67 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వీరి నిష్క్రమణ తర్వాత ఆశిష్ రెడ్డి 13 పరుగులు సాధించి రనౌటవగా, కర్ణ్ శర్మ (2), భువనేశ్వర్ కుమార్ (0) అజేయంగా నిలిచారు. దీంతో సన్‌రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు కైవసం చేసుకోగా, మోర్న్ మోర్కెల్ రెండు వికెట్లు, ఆండ్రూ రసెల్ ఒక వికెట్ అందుకున్నారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ చక్కటి శుభారంభాన్ని అందించారు. సన్‌రైజర్స్ బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించిన వీరు 92 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. ఆ తర్వాత 13వ ఓవర్‌లో ఆశిష్ రెడ్డి వేసిన బంతిని ఎదుర్కోబోయి ఉతప్ప (38) లెగ్ బిఫోర్ వికెట్ రూపంలో నిష్క్రమించగా, అతని స్థానంలో వచ్చిన ఆండ్రూ రసెల్ (2) ముస్త్ఫాజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన గౌతమ్ గంభీర్ (90), మనీష్ పాండే (11) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 146 పరుగులు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన నైట్ రైడర్స్‌కు ఇది రెండో విజయం.
--

chitram ఐపిఎల్‌లో 28వ అర్థ శతకాన్ని నమోదు చేసుకున్న
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్

ఐపిఎల్‌లో నేడు

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
రైజింగ్ పుణె సూపర్ జెయంట్స్
మొహాలీలో సాయంత్రం 4 గంటల నుంచి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఢిల్లీ డేర్‌డెవిల్స్
బెంగళూరులో రాత్రి 8 గంటల నుంచి