క్రీడాభూమి

11 నగరాలు.. 12 స్టేడియాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: వేసవికాలంలో ఎక్కువగా సమయం సూర్యుడు కనిపిస్తూ, రాత్రి అన్నదే దాదాపుగా లేని ఉత్తరానగల సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి నల్ల సముద్రం ఒడ్డునగల సోచీ వరకూ విస్తరించిన సువిశాల ప్రాంతంలో ఈ స్టేడియాలు విస్తరించాయి. సాకర్ వరల్డ్ కప్ టోర్నీ జరిగే 12 స్టేడియాలు ఇవే..
1. లూజ్నికీ స్టేడియం (మాస్కో): ఈ స్టేడియాన్ని 410 మిలియన్ డాలర్ల వ్యయంతో పునర్నిర్మించారు. 81,006 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ని తిలకించే అవకాశం ఉంది. 1950 దశకంలో ఎన్నో మ్యాచ్‌లకు కేంద్రమై, ఆతర్వాత క్రమంగా నిదారణకు గురైన ఈ స్టేడియం ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకొని, వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా వేదికైంది. 1980 ఒలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు ఈ స్టేడియంలోనే జరిగాయి. అప్పటి స్టేడియాన్ని పూర్తిగా ఫుట్‌బాల్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు.
2. స్పార్టాక్ స్టేడియం (మాస్కో): మాస్కోలోని స్పార్టాక్ స్టేడియాన్ని 250 మిలియన్ డాలర్ల ఖర్చుతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. 43,298 సీటింగ్ కెపాసిటీగల ఈ స్టేడియంలో చివరిసారి 2017లో రష్యా ప్రీమియర్ లీగ్ చాంపియన్‌షిప్ సాకర్ పోటీలు జరిగాయి. 2014లో ప్రారంభమైన ఈ స్టేడియాన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అనుగుణంగా నిర్మించారు. ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని, అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన స్టార్టాకస్ పేరుమీద ఈ స్టేడియాన్ని నిర్మించారు.
3. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియం
(సెయింట్ పీటర్స్‌బర్గ్): ప్రపంచ కప్ కోసం సిద్ధం చేసిన అన్ని స్టేడియాల్లోకీ ఎన్నో అవాంతరాలు, సమస్యలను ఎదుర్కొన్న స్టేడియం ఇది. వరల్డ్ కప్‌కు వేదికగా ఎంపిక చేసిన రోజు నుంచి స్టేడియాన్ని పోటీలకు సిద్ధం చేయడం వరకూ ఎన్నో సమస్యలు చుట్టుముట్టి వేధించాయి. అంచనా వ్యయానికీ, వాస్తవ ఖర్చుకూ పొంత లేకపోవడంతో అధికారులు నానా తంటాలు పడ్డారు. ఉత్తర కొరియా కార్మికులు పిలిపించడం నిర్వాహకులు చేసిన పెద్ద పొరపాటైంది. 12 స్టేడియాల నిర్మాణ సమయంలో మొత్తం 17 మంది కార్మికులు మృతి చెందగా, వారిలో ఎనిమిది మంది సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేడియ నిర్మాణ సమయంలోనే మరణించారు. కార్మికుల ఆందోళనలు ఒకవైపు, పెరిగిన వ్యయం మరోవైపు స్టేడియం పునర్నిర్మాణ పనులను మరింత జాప్యం చేశాయి. అతి కష్టం మీద పనులు పూర్తయినాయని అనిపించారు. ఇప్పటికీ ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయని, సదుపాయాలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగితేగానీ, లోపాటలు, సమస్యలు బయటపడవు.
4. ఫిష్ట్ స్టేడియం (సోచీ): సుమారు 400 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియాన్ని ఫుట్‌బాల్‌కు మ్యాచ్‌లకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మరో 68 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 47,700 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఈ స్టేడియానికి వెళ్లాలంటే సోచీ నుంచి సుమారు గంటసేపు ప్రయాణం చేయాలి. వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియం పరిసరాల్లోని హోటళ్లలోనే బస ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా సమయం వృథాకాకుండా ఉంటుందని అభిమానులకు అధికారులు సూచిస్తున్నారు.
5. కజాన్ ఎరీనా (కజాన్ సిటీ): రష్యాలో కేవలం ఫుట్‌బాల్ కోసం ఇటీవల నిర్మించిన స్టేడియాల్లో కజాన్ ఎరీనా ఒకటి. 2013లో ఇక్కడ సాకర్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. 250 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంలో 44,779 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉంది.
6. సమరా ఎరీనా (సమరా సిటీ): ఓల్గా నది ఒడ్డున 310 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 44,807. సమరా చరిత్రకు దర్పణంగా ఒక భారీ అద్దాన్ని ఈ సేడియం పైభాగంగా ప్రత్యేకంగా అమర్చారు. నగర శివార్లలో ఉన్నది కాబట్టి, మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే అభిమానులు ఓల్గా అందాలను ఆస్వాదించవచ్చు.
7. నిజ్నీ నొవ్‌గొరాడ్ స్టేడియం
(నిజ్నీ నొవ్‌గొరాడ్ సిటీ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ స్టేడియం పైకప్పు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. 307 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం సీటింగ్ కెపెసిటీ 45,331. వరల్డ్ కప్ కోసం సిద్ధం చేసిన ముఖ్యమైన స్టేడియాల్లో ఒకటైన నిజ్నీలో ఒక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఒకా, ఓల్గా నదుల సంగమ ప్రాంతం కావడంతో ప్రేక్షకులను ఈ స్టేడియం అలరించడం ఖాయం.
8. రొస్తోవ్ ఎరీనా (రొస్తోవ్ ఆన్ డాన్): ఏర్పాట్లు ఘనంగానే ఉన్నా, విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదు. 45,145 మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌ని చూసే వీలున్న ఈ స్టేడియం నిర్మాణానికి 330 మిలియన్ డాలర్లు ఖర్చయింది. ఇక్కడ రష్యా ఒక గ్రూప్ మ్యాచ్‌ని ఆడుతుంది. ఒకవేళ గ్రూప్ దశను ముగించుకుంటే, క్వార్టర్ ఫైనల్స్‌ను కూడా ఈ స్టేడియంలోనే ఆడనుంది. డాన్ నది ఒడ్డున ఉన్న ఈ స్టేడియాన్ని వరల్డ్ కప్ ముగిసిన వెంటనే కొత్త గృహ సముదాయంగా మారుస్తారు.
9. ఓల్గోగ్రాడ్ ఎరీనా (ఓల్గోగ్రాడ్ సిటీ): ఒకప్పుడు స్టాలిన్‌గ్రాడ్‌గా అందరికీ తెలిసిన ఓల్గోగ్రాడ్ సిటీలో 45,568 సీటింగ్ కెపాసిటీతో స్టేడియం నిర్మాణానికి 300 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఈ నగరంలో ప్రతి అంగుళం ఒకప్పటి రష్యా విప్లవానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది. ఇక్కడి స్టేడియానికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం జరిగిన ప్రాంతంలోనే స్టేడియాన్ని నిర్మించారు. ‘ది మదల్‌లాండ్ కాల్స్’ విగ్రహం స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో స్టేడియం పైకప్పు తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్తపడ్డారు.
10. ఎకతెరీనాబర్గ్ ఎరీనా (ఎకతెరీనాబర్గ్ సిటీ): గతంలో ఉన్న స్టేడియాన్ని ఆధునీకరించారనే కంటే, కొత్తగా నిర్మించారనడం
సబబు. 220 మిలియన్ డాలర్ల ఖర్చుతో, 35,696 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియం నిర్మాణం జరిగింది. ఉరల్ పర్వత ప్రాంతంలోని ఈ స్టేడియం పనులు -25 డిగ్రీల సెల్సియల్ ఉష్ణోగ్రతలోనూ కొనసాగించారని, అందుకే చాలామంది కార్మికులు రోగాలబారిన పడ్డారని, కొంత మంది మృతి చెందారని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టేస్తున్నారు. కానీ, చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన ఎకతెరీనాబర్గ్‌లో స్టేడియం పనులు అనుకున్నంత సులభం కాదన్నది మాత్రం వాస్తవం.
11. మార్డోవియా ఎరీనా (సరాస్క్): ఎవరూ ఊహించని విధంగా ఎంపికైన వేదికగా సరాస్క్‌ను పేర్కోవాలి. కేవలం మూడు లక్షల జనాభాగల ఈ నగరంలో ఎంత మంది మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు వస్తారో చూడాలి. 295 మిలియన్ డాలర్ల ఖర్చుతో 44,442 మంది ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా నిర్మించిన ఈ స్టేడియం మాస్కోకు పది గంటల ప్రయాణ దూరంలో ఉంది. స్టేడియానికి సమీపంలో నిర్మించిన గృహ సముదాయాలను వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అమ్మకానికి ఉంచుతారు.
12. కలినిన్‌గ్రాడ్ స్టేడియం (కలినిన్‌గ్రాడ్): రష్యాలో భాగమైనప్పటికీ, ఆ దేశానికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది కలినిన్‌గ్రాడ్. ఒక రకంగా చెప్పాలంటే, పోలాండ్, లిథునేనియా మధ్యలో ఇరుక్కొని ఉన్నట్టు కనిపించే ఈ నగరంలో స్టేడియాన్ని 300 మిలియన్ డాలర్ల వ్యయంతో, 35,212 సీటింగ్ కెపాసిటీతో నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధం వరకూ ఈ నగరం జర్మనీ ఆధీనంలో ఉండేది. అప్పట్లో దీనిని కోనిగ్స్‌బర్గ్ అని పిలిచేవారు. చారిత్రిక నేపథ్యం ఉన్నందున ఎక్కువ మంది ఈ నగరానికి తరలివస్తారని అధికారుల అంచనా. అది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.