క్రీడాభూమి

అందరి చూపు వీరిపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 11: మొత్తం 32 జట్లకు చెందిన హేమాహేమీ ఆటగాళ్లంతా వరల్డ్ కప్ సాకర్‌లో తమను తాము నిరూపించుకునేందుకు బరిలోకి దిగనున్నారు. వీరిలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందరూ సమర్థులే. ప్రతిభాపాటవాలున్న వారే. అయితే, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎక్కువ గోల్స్ చేసి లేదా అద్వితీయ ప్రజ్ఞను చూపిన వారే స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. ఈసారి వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో ఎంతమంది ఆటగాళ్లున్నా, అందరి చూపు కొద్దిమందిపైనే కేంద్రీకృతమవుతుందనేది వాస్తవం. అలాంటి అరుదైన ఆటగాళ్ల జాబితాలో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమార్ మొదటి మూడు స్థానాలను ఆక్రమిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. బార్సిలోనాలో తిరుగులేని స్థానాన్ని సంపాదించిన అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతిని డ్రిబ్లింగ్ చేయడం నుంచి, ప్రత్యర్థుల రక్షణ వలయాలను ఛేదించి గోల్స్ సాధించడం వరకూ అడుగడుగునా అతను అందుకోని శిఖరం లేదు. నెలకొల్పని రికార్డు లేదు. వరల్డ్ కప్ సాకర్‌లో అర్జెంటీనా గత ఏడాది ఫైనల్ చేరుకోవడానికి మెస్సీ ప్రతిభే ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిన నిజం. 2005లో అండర్-20 వరల్డ్ కప్ ఆడిన అతను 2008లో అండర్-23 వరల్డ్ కప్‌లో దేశానికి సేవలు అందించాడు. ఆతర్వాత ప్రపంచ కప్, కోపా అమెరికా వంటి టోర్నీల్లో అర్జెంటీనాకు అండగా నిలిచాడు. అతను ఆడిన వరల్డ్ కప్ పోటీల్లో అర్జెంటీనా రెండు పర్యాయాలు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. 2014లో ఫైనల్ వరకూ వెళ్లినప్పటికీ, ఎక్‌స్ట్రా టైమ్‌లో జర్మనీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మీద అతను అర్జెంటీనా అండర్-20 జట్టుకు 18 మ్యాచ్‌ల్లో 14, అండర్-23 జట్టుకు 5 మ్యాచ్‌ల్లో 2, జాతీయ జట్టుకు 124 మ్యాచ్‌ల్లో 64 చొప్పున గోల్స్ సాధించిపెట్టాడు. క్లబ్ సాకర్‌లో అతను బార్సిలోనా తరఫున ఆడుతున్నాడు. బార్సిలోనా ‘సీ’ తరఫున 10 మ్యాచ్‌ల్లో 5, బార్సిలోనా ‘బీ’ తరఫున 22 మ్యాచ్‌ల్లో 6 గోల్స్ నమోదు చేసిన అతను ఆతర్వాత బార్సిలోనా జట్టుకు ఇప్పటి వరకూ 418 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించి 383 గోల్స్ అందించాడు. మొత్తం మీద అన్ని రకాల మ్యాచ్‌ల్లో కలిపి 552 గోల్స్ చేయడం మెస్సీ సామర్థ్యానికి నిదర్శనం. ఈసారి వరల్డ్ కప్‌లో అతని ప్రతిభపైనే అర్జెంటీనా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ‘ఆల్‌టైమ్ గ్రేట్’ సాకర్ ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్న మెస్సీ సహజంగానే అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతని ఆడే మ్యాచ్‌లను చూసేందుకు వేలాదిగా అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. తమ అభిమాన ఆటగాళ్లకు మద్దతు ప్రకటిస్తారు.
రియల్ మాడ్రిడ్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరు వినని వారు లేరనడం అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ సాకర్‌పై తనదైన ముద్ర వేసిన అతి కొద్దిమంది క్రీడాకారుల్లో రొనాల్డో ఒకడు. పోర్చుగల్ ఈసారి వరల్డ్ కప్‌లో ఏ స్థాయికి చేరుకుంటుందనేది అతని ఫామ్‌పైనే ఆధారపడుతుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. క్లబ్ సాకర్‌లో మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 196 మ్యాచ్‌ల్లో 84, రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ ఇప్పటి వరకూ 292 మ్యాచ్‌ల్లో 311 చొప్పున గోల్స్ సాధించిన రొనాల్డో పోర్చుగల్‌కు చిన్నతనం నుంచే సేవలు అందిస్తున్నాడు. ఆ దేశం అండర్-15 తరఫున 9 మ్యాచ్‌ల్లో 7, అండర్-17 తరఫున 7 మ్యాచ్‌ల్లో 5, అండర్-20 తరఫున 5 మ్యాచ్‌ల్లో ఒకటి, అండర్-21 తరఫున 10 మ్యాచ్‌ల్లో 3, అండర్-23 తరఫున 3 మ్యాచ్‌ల్లో 2 చొప్పున గోల్స్ చేశాడు. జాతీయ జట్టు తరఫున 150 మ్యాచ్‌లు ఆడాడు. 81 గోల్స్ సాధించాడు. మొత్తం మీద అన్ని స్థాయిల్లోనూ కలిసి కెరీర్‌లో ఇంత వరకూ 573 గోల్స్‌ను తన ఖాతాలో వేసుకున్న రొనాల్డో లేకుండా పోర్చుగల్ జట్టును ఊహించడం కూడా సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానులున్న సాకర్ ఆటగాళ్లలో ఒకడైన రొనాల్డో సహజంగానే ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తాడు.
మెస్సీ, రొనాల్డో కంటే కొంత ఆలస్యంగా కెరీర్‌ను మొదలుపెట్టినప్పటికీ, చాలా తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ ఇమేజ్‌ని సంపాదించుకున్న ఆటగాడు నేమార్. ఫుట్‌బాల్‌కు ప్రాణమిచ్చే బ్రెజిల్‌లో పీలే, రొనాల్డో వంటి ఆటగాళ్ల వారసత్వాన్ని నేమార్ కొనసాగిస్తున్నాడు. సాంటోస్ క్లబ్‌కు 102 మ్యాచ్‌ల్లో 54, బార్సిలోనాకు 123 మ్యాచ్‌ల్లో 68, ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పారిస్ సెయింట్ జర్మెయిన్‌కు 20 మ్యాచ్‌ల్లో 19 చొప్పున గోల్స్ అందించిన నేమార్ బ్రెజిల్ అండర్-17 జట్టులో మూడు మ్యాచ్‌లు ఆడి, ఒక గోల్ చేశాడు. అండర్-20లో 7 మ్యాచ్‌ల్లో 9, అండర్-23లో 14 మ్యాచ్‌ల్లో 8 గోల్స్ సాధించాడు. జాతీయ జట్టుకు 84 మ్యాచ్‌ల్లో 54 గోల్స్ అందించాడు. సాకర్ చరిత్రలోనే అత్యధిక ధరకు బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జర్మెయిన్‌కు వెళ్లిన నేమార్ ఇటీవల గాయపడడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. బ్రెజిల్ సాకర్ అధికారులు సైతం బెంబేలెత్తిపోయారు. అయితే, శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న నేమార్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడడంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. అన్ని స్థాయిల్లో కలిపి కెరీర్‌లో ఇంతవరకూ 439 మ్యాచ్‌లు ఆడి 269 గోల్స్ చేసిన నేమార్‌పైనే బ్రెజిల్ వరల్డ్ కప్ ఆశలు నిలిచి ఉన్నాయి. అతను పూర్తి ఫిట్నెస్‌తో లేకపోతే, బ్రెజిల్‌కు కష్టాలు తప్పవు.
మెస్సీ, రొనాల్డో, నేమార్ ‘టాప్-3’లో ఉంటే, ఈసారి వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించే సత్తాగల ఆటగాళ్లు మరికొంతమంది ఉన్నారు. మహమ్మద్ సలే (ఈజిప్టు), డేవిడ్ డి గియా (స్పెయిన్), ఎడెన్ హజార్డ్ (బెల్జియం), ఆంటోన్ గ్రీజ్మన్ (ఫ్రాన్స్), జేమ్స్ రోడ్రిగెజ్ (కొలంబియా), థామస్ ముల్లర్ (జర్మనీ), గాబ్రియెల్ జీసస్ (బ్రెజిల్) తదితరులు కూడా వరల్డ్ కప్ సాకర్‌లో రాణించే అవకాశాలున్నాయి. అదే విధంగా ఎడిన్సన్ కవానీ, లూయిస్ సొరెజ్ (ఉరుగ్వే), హారీ కాన్ (ఇంగ్లాండ్), ఆండ్రెస్ ఇనిస్టా (స్పెయిన్), రొమెలు లుకాకు (బెల్జియం), సాడియో మానె (సెనెగల్), కెవిన్ డి బ్రూన్జ్ (బెల్జియం), రాబర్ట్ లెవాండొవ్‌స్కీ (పోలాండ్) వంటి ఆటగాళ్లు తమ నైపుణ్యంతో అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధంగా ఉన్నారు.