క్రీడాభూమి

ధర్మశాలలో దాయాదుల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: వచ్చే ఏడాది జరిగే ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్‌లకు ఒకే గ్రూపులో చోటు లభించింది. చాలా కాలం నుంచి పరస్పర పోటీకి దూరంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మార్చి 19వ తేదీన ధర్మశాలలో హై-ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసిసి శుక్రవారం ఆవిష్కరించింది. భారత్, పాక్ జట్ల మధ్య ఈ నెలాఖరులో నిర్వహించతలపెట్టిన ద్వైపాక్షిక సిరీస్‌పై రాజకీయ కారణాల రీత్యా అనిశ్చితి కొనసాగుతున్న విషయం విదితమే. అయితే ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాక్‌తో తలపడటానికి నాలుగు రోజుల ముందు మార్చి 15వ తేదీన నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో పోరాటాన్ని ఆరంభించనున్న టీమిండియా ఆ తర్వాత మార్చి 23వ తేదీన గ్రూప్-ఎ క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుతో బెంగళూరులోనూ, మార్చి 27వ తేదీన ఆస్ట్రేలియాతో మొహాలీలోనూ తలపడుతుంది. 27 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు (పురుషుల విభాగంలో 35, మహిళల విభాగంలో 23) నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌లు బెంగళూరు, చెన్నై, ధర్మశాల, కోల్‌కతా, మొహాలీ, ముంబయి, నాగ్‌పూర్, న్యూఢిల్లీల్లో జరుగుతాయి. మార్చి 30, 31 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు న్యూఢిల్లీ, ముంబయి, ఏప్రిల్ 3వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తాయి.
ఈ టోర్నీ షెడ్యూలు ఆవిష్కరణ కార్యక్రమంలో ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ మాట్లాడుతూ, క్రికెట్‌ను అమితంగా ఆరాధించే భారత్‌లో ఈ క్రీడకు ఉన్నంత ఆదరణ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. 1987, 1996, 2011 సంవత్సరాల్లో ఐసిసి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లను విజయవంతంగా నిర్వహించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వచ్చే ఏడాది ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించగలదని తాను పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘పూర్తి నిబద్ధత కలిగిన ఐసిసి, బిసిసిఐ ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీని చిరస్మరణీయమైన రీతిలో నిర్వహించేందుకు కలసికట్టుగా పనిచేస్తాయి. ఈ ఈవెంట్‌లో భాగంగా జరిగే మ్యాచ్‌లను, ఎంతో భిన్నమైన భారత దేశ సంస్కృతిని కనులారా వీక్షించేందుకు రావలసిందిగా ప్రపంచంలోని అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నా’ అని ఆయన అన్నారు.
కాగా, ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీని ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహిస్తామని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ హామీ ఇచ్చారు. ‘ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత వినోదభరితమైన ఈ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేము పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం. గతంలో మూడుసార్లు ఐసిసి ప్రపంచ కప్ వనే్డ క్రికెట్ టోర్నీలకు ఆతిథ్యమిచ్చి ఎంతో అనుభవాన్ని గడించిన మేము ఈ ఈవెంట్‌ను అత్యంత చిరస్మరణీయమైన రీతిలో నిర్వహించేందుకు సంసిద్ధులమయ్యాం’ అని ఆయన అన్నారు. ఈ టోర్నీలో మహిళల సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల తర్వాత పురుషుల నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు విభాగాల్లో ఫైనల్ మ్యాచ్‌లకు ముందు ఒక రిజర్వు డే ఉంటుంది.
భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ
ఈ టోర్నీ పురుషుల ఈవెంట్‌లో ఇచ్చే మొత్తం ప్రైజ్ మనీని 56 లక్షల డాలర్లుగా నిర్ధేశించారు. 2014 టోర్నమెంట్ కంటే ఇది 86 శాతం ఎక్కువ. అలాగే మహిళల ఈవెంట్‌లో ఇచ్చే మొత్తం ప్రైజ్ మనీ 4 లక్షల డాలర్లు. ఇంతకుముందు బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీలో బహూకరించిన ప్రైజ్ మనీ కంటే ఇది 122 శాతం అధికం. ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీ పురుషుల ఈవెంట్లలో ఇప్పటివరకూ ఐదు వేర్వేరు జట్లు టైటిళ్లు సాధించాయి. అయితే మహిళల విభాగంలో తొలి ఎడిషన్ టైటిల్‌ను ఇంగ్లాండ్ జట్టు (2009లో) గెలుచుకోగా, ఆ తర్వాత వరుసగా మూడు (2010, 2012, 2014) ఎడిషన్లలో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది.
ఫార్మాట్ ఇదీ..
ప్రస్తుతం పురుషుల ఈవెంట్ తొలి రౌండ్ (క్వాలిఫయింగ్) మ్యాచ్‌లలో తలపడే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి గ్రూప్-ఎలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఒమన్ జట్లను, గ్రూప్-బిలో జింబాబ్వే, స్కాట్లాండ్, హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లను చేర్చారు. ఈ రెండు గ్రూపుల్లో విజేతలుగా నిలిచిన జట్లు సూపర్-10 దశకు నేరుగా అర్హత పొందిన ఎనిమిది జట్ల సరసన చేరుతాయి. దీంతో సూపర్-10 దశలో తలపడే మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లతో పాటు గ్రూప్-బి క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టును గ్రూప్-1లో చేరుస్తారు. అలాగే భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పాటు గ్రూప్-ఎ క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టును గ్రూప్-2లో చేరుస్తారు. సూపర్-10లోని రెండు గ్రూపుల నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇక మహిళల ఈవెంట్‌లో తలపడే మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి గ్రూప్-ఎలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లకు, గ్రూప్-బిలో భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ చోటు కల్పించారు. ఈ రెండు గ్రూపుల నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.