క్రీడాభూమి

భారత్.. బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 19: ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో స్టార్ అథ్లెట్ భజరంగ్ పునియా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించాడు. స్వర్ణంపై నమ్మకం పెట్టుకున్న మరో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రం నిరాశపర్చాడు. 65 కేజీ విభాగంలో తొలి మ్యాచ్‌కు బై సాధించిన కామనె్వల్త్ గేమ్స్ స్వర్ణపతక విజేత భజరంగ్ పునియా ఆదివారం నాలుగు బౌట్లలో అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. తొలుత ఉజ్బెకిస్తాన్ రెజ్లర్ సిరోజిద్దీన్ (13-3), తజకిస్తాన్ రెజ్లర్ ఫేజివ్ అబ్దుల్‌కోసిమ్ (12-2), మంగోలియా రెజ్లర్ బట్మగ్నయ్ బట్చూలూ (10-0)లను మట్టికరిపించి స్వర్ణ పతకం రేసులో అంచులకు చేరిన భజరంగ్, ఫైనల్స్‌లో జపాన్ రెజ్లర్ తకతని డైచీని సైతం 11-8 స్కోరుతో మట్టికరిపించి స్వర్ణ పతకాల వేటలో భారత్‌కు ఖాతా తెరిచాడు. దీంతో కుస్తీలో భారత్‌కు స్వర్ణాలు సాధించిన కర్తార్ సింగ్ (1978, 86), సత్పాల్ సింగ్ (1982), రాజేందర్ సింగ్ (1978), చాంగ్దిరామ్ (1970), మారుతి మనె (1962) సరసన భజరంగ్ పునియా చోటు సంపాదించాడు. ఇదిలావుంటే, రెండు ఒలింపిక్ పతకాల విజేత, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రం తొలి బౌట్‌లోనే నిరాశపర్చాడు. 74కేజీ విభాగంలో బెహ్రెయిన్ రెజ్లర్ ఆడమ్ బటిరోవ్ చేతిలో 3-5 తేడాతో ఓటమి చవిచూసి స్వర్ణం రేసునుంచి తప్పుకున్నాడు. 57 కేజీల విభాగంలో సందీప్ తోమర్, 97 కేజీ విభాగంలో వౌసమ్ ఖాత్రి, 86 కేజీ విభాగంలో పవన్ కుమార్‌లు తమ సత్తా చాటలేకపోయారు. విఫలమైన రెజ్లర్లు పతకాలు సాధించేందుకు రెపిచెజ్ చాన్స్ మాత్రమే మిగిలివుంది. సుశీల్‌పై విజయం సాధించిన బటిరోవ్ కనుక ఫైనల్‌కు చేరితే, రెపిచెజ్ ద్వారా సుశీల్ రజతం రేసులోకి వచ్చే అవకాశం ఉంది.

కబడ్డీలో శుభారంభం
ఆసియా క్రీడల కబడ్డీ బరిలోకి టైటిల్ ఫేవరేట్స్‌గా దిగిన భారత పురుషుల, మహిళా జట్లు తొలిరోజు అద్వితీయ విజయాలతో శుభారంభాన్ని పలికాయి. గ్రూప్-ఏ పూల్‌లో జపాన్‌తో తలపడిన భారత మహిళా జట్టు 43-12తో భారీ గెలుపు నమోదు చేసింది. 2010లో ఆసియా క్రీడల్లో మహిళా కబడ్డీని ప్రవేశపెట్టిన దగ్గరినుంచీ భారత్‌కు ఓటమనేది లేదు. వరుస విజయాలపై కసితో నేడు థాయిలాండ్‌తో పోటీపడనున్న మహిళా జట్టు, ఈసారీ ఖాయంగా స్వర్ణాన్ని సాధించగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ప్రపంచ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు సైతం తొలిరోజే అద్వితీయ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఏ పూల్‌లో తొలుత బంగ్లాదేశ్‌ను 50-21 స్కోరుతో మట్టికరిపించి, సాయంత్రం శ్రీలంక జట్టును 44-28 స్కోరుతో ఓడించింది. నేడు దక్షిణ కొరియాతో భారత పురుషుల జట్టు తలపడనుంది.

షూటింగ్‌లో కాంస్యం
ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట మొదలైంది. రైఫిల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో అపూర్వి చండేలా, రవికుమార్‌లు మూడోస్థానం సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. 48 షాట్స్‌లో చైనా తైపీ షూటర్లు 494.1 పాయింట్లతో స్వర్ణాన్ని చేజిక్కించుకుంటే, చైనా షూటర్లు 492.5 పాయింట్లతో రజతాన్ని, భారత షూటర్లు 429.9 పాయింట్లతో కాంస్యాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి దేశానికి పతకం సాధించిన ఆనందం గొప్పగా ఉందని ఈ సందర్భంగా రవికుమార్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లో ముందు ఒకింత వెనుకబడినా, అపూర్వి ప్రదర్శించిన అద్భుత సామర్థ్యంతో భారత జట్టుకు కాంస్యం దక్కిందన్నాడు. ఫిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో మను భాస్కర్, అభిషేక్ వర్మలు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైన నిరాశపర్చారు. మెన్స్ ట్రాప్‌లో తొలిరోజు భారత షూటర్ మనవ్‌జిత్ సింగ్ సంధు అగ్రపథాన నిలిస్తే, లక్ష్య షరోన్ ఐదోస్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో శ్రేయసి సింగ్ ద్వితీయస్థానంలో నిలిస్తే, సీమా తోమర్ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్ సిక్స్ ఫైనల్స్ ఆడనున్న విషయం తెలిసిందే.
బాస్కెట్ బాల్‌లో తడబాటు
మహిళా బాస్కెట్ బాల్ లీగ్‌లో భారత జట్టు రెండో ఓటమి నమోదు చేసింది. పూల్-ఏలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చైనా తైపీ చేతిలో 45-64 స్కోరుతో పరాజయాన్ని చవిచూసింది. గ్రూప్‌లోని తొలి మ్యాచ్ కజకిస్తాన్‌పై ఆడిన భారత జట్టు 61-79 స్కోరుతో ఓడటం తెలిసిందే. ఆరంభంలో హోరాహోరీ పోరాటమే సాగినా, మ్యాచ్ చివరి అంకంలో చైనా తైపీ ముందు భారత్ నిలవలేకపోయింది. నేడు కొరియాతో తలపడనున్న భారత జట్టు, 23న ఆతిథ్య ఇండోనేసియా జట్టుతో తలపడనుంది.
స్విమ్మింగ్‌లో సూపర్
స్విమ్మింగ్‌లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రతిభ కనబర్చారు. పురుషుల వంద మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో శ్రీహరి నటరాజ్ 7వ రౌండ్, 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో సాజన్ ప్రకాష్ 5వ రౌండ్ పూర్తి చేసి ఫైనల్‌వైపు దూసుకెళ్లారు. 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ సౌరవ్ సంఘ్వీకర్ ఆదిలోనే విఫలమయ్యాడు.
టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో బోణీ
టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత ద్వయం కర్మన్‌కౌర్ తండి, దివిజ్ శరణ్‌లు తొలి విజయం సాధించారు. ఫిలిప్పినో ద్వయం మారియన్ జానె కపడోసియా, ఆల్బెర్టో జూనియర్ లిమ్‌తో 81 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో 6-4, 6-4 సెట్లతో విజయం సాధించారు. మరో ఐదు క్యాటగిరీల్లో భారత ఆటగాళ్లకు బై లభించడంతో నేడు మ్యాచ్‌లు ఆడతారు.
బాడ్మింటన్‌లో ప్రతిధ్వనించే విజయం
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ టీం ఈవెంట్‌లో తొలిరోజే భారత షట్లర్లు ప్రతిధ్వనించే విజయాన్ని నమోదు చేశారు. స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నాయకత్వంలోని భారత షట్లర్లు మాల్దీవుల జట్టుపై 3-0తో విజయం సాధించారు. తొలుత శ్రీకాంత్ మాల్దీవుల షట్లర్ హుస్సేన్ జయన్ షహీద్‌పై 18 నిమిషాల గేమ్‌లో 21-4, 21-5 స్కోరుతో భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. విజయ పరంపరను కొనసాగిస్తూ హెచ్‌ఎస్ ప్రణయ్ 21 నిమిషాల గేమ్‌లో మహ్మద్ షరీమ్ ఆటను 21-8, 21-6 సెట్లతో కట్టడి చేయడంతో భారత్ 2-0 ఆధిక్యానికి చేరింది. మరో షట్లర్ బి సాయిప్రణీత్ 22 నిమిషాల గేమ్‌లో మహ్మద్ అజ్ఫన్ (21-7, 21-8) ఆట కట్టించడంతో భారత్ 3-0 ఆధిక్యంతో విజయం సాధించింది. ఆతిథ్య ఇండోనేసియాతో భారత జట్టు నేడు క్వార్టర్ ఫైనల్స్ ఆడనుంది.
హాకీలో దూకుడు
ఆసియా క్రీడల హాకీ తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. పూల్-బిలో ఎఫ్‌ఐహెచ్ ర్యాంకింగ్ చార్టులోనే లేని ఆతిథ్య ఇండోనేసియాతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 8-0 స్కోరుతో విజయాన్ని అందుకుంది. డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్‌లో అదరగొట్టింది. 2014 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత్, నేడు కజకిస్తాన్ జట్టుతో తలపడనుంది.