క్రీడాభూమి

ఆర్చర్లపై గురిలేని సర్కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విలువిద్య భారత చరిత్రలో అంతర్భాగమని అందరికీ తెలుసు. పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ విద్యకు సముచిత స్థానం ఉంది. కానీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు మాత్రం ఆర్చరీపై ఏ మాత్రం నమ్మకం లేదు. అందుకే ఆర్చర్లలో ఎవరికీ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్)లో చోటు కల్పించలేదు. అన్ని క్రీడలను సమ దృష్టితో చూసి, అందరినీ ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే కొన్ని క్రీడలకు మాత్రమే పరిమితం కావడం దురదృష్టకరం. కేంద్రం ఉదాసీనతకు ఆర్చర్లు ఏ విధంగా నష్టపోతున్నారో, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో చెప్పడానికి మాటలు సరిపోవు. దేశంలో ఆర్చర్లకు సరైన వౌలిక సదుపాయాలు లేవు. విల్లు, బాణాల సరఫరా సక్రమంగా ఉండదు. చాలా మంది ఆర్చర్లు ఇతరుల నుంచి అరువు తెచ్చుకున్న ఎక్విప్‌మెంట్‌తోనే ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. కొంత మంది స్నేహితులు లేదా సన్నిహితులను అడుక్కుంటున్నారు. విల్లు, బాణం లేకుండా ఆర్చర్లు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారని ప్రభుత్వం అనుకుంటున్నదో ఎవరికీ అర్థం కాదు. జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడలకు వెళ్లిన ఆర్చర్ల వెతలే సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. అరకొర ప్రాక్టీస్‌తో అంతర్జాతీయ వేదికలపై పోటీ పడి పతకాలు సాధించడం ఎవరికైనా సాధ్యమా? అని అర్చర్లు వేస్తున్న ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) శిక్షణా కేంద్రాల్లోనూ ఆర్చర్లకు సరైన గుర్తింపు లభించడం లేదు. వారికి అవసరమైన వౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. సెండ్ హ్యాండ్ సేల్స్‌లో కొనుకున్న విల్లంబులతో ప్రాక్టీస్ చేయడమేగాక, వాటిలో ఆసియా క్రీడల్లోనూ ఉపయోగించామని ఆర్చర్ విశ్వాస్ ఒక ఇంటర్వ్యూలో వాపోయాడు. క్రీడలను ప్రోత్సహించడానికి పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నామని, అన్ని క్రీడలకూ సమ న్యాయం జరుగుతుందని కేంద్ర సర్కారు చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకూ ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆర్మీలో జవానుగా దేశానికి సేవలు అందిస్తున్న విశ్వాస్ ఎంతో ఇష్టంతో ఆర్చరీలోకి అడుగుపెట్టాడు. కానీ, అనుక్షణం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. కనీస సౌకర్యాలుగానీ, ఎక్విప్‌మెంట్‌గానీ లేకుండా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటే, ఎలాంటి ఫలితాలు వస్తాయో అధికారులకు తెలియదా? అని విశ్వాస్ నిలదీస్తున్నాడు. జకార్తాలో ఏషియాడ్‌లో పాల్గొనేందుకు తనకు ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు మంజూరు చేసిందని విశ్వాస్ అన్నాడు. అయితే, తాను బయలుదేరడానికి ఒకటిరెండు రోజుల ముందే తనకు ఆ సొమ్ము చేతికి అందిందని చెప్పాడు. ఆ సమయంలో తాను కొనగలిగిందీ, ప్రాక్టీస్ చేయగలిగిందీ ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. ఆర్చర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు విశ్వాస్ ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, సాయ్ అధికారులు గాఢ నిద్ర నుంచి మేల్కొని, వాస్తవ పరిస్థితులను గ్రహించి, ప్రోత్సహిస్తే తప్ప ఆర్చరీలో భారత్ అంతర్జాతీయ వేదికలపై పతకాలు కొల్లగొట్టడం సాధ్యం కాదు.