క్రీడాభూమి

ఇనుము విసిరాడు పసిడి పట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా దృష్టి పసిడిమీద కాదు, 21మీటర్ల అవతలవున్న లక్ష్యం మీదే. రికార్డు దూరం షాట్‌పుట్ విసరాలన్న బలం ఈసారి సరిపోలేదు. జాతీయ రికార్డు తిరగరాసినందుకు సంతృప్తిగా ఉంది. ఎన్నో త్యాగాల ప్రతిఫలమిది. గత రెండేళ్లుగా నాన్న క్యాన్సర్‌తో బాధ పడుతున్నా, ఆ బాధ నావరకూ కుటుంబం రానివ్వలేదు. స్నేహితులే సొంత కొడుకుల్లా బాధ్యత నిర్వర్తించారు. నా కల సాకారానికి కోచ్, కుటుంబం, స్నేహితులు అందించిన ప్రోత్సాహం, సహకారం మరువలేను. రుణం కూడా తీర్చుకోలేనేమో
*
జకార్తా/ పాలెంబాగ్, ఆగస్టు 25: భారత షాట్‌పుటర్ తిజేందర్‌పాల్ సింగ్ తూర్ భారత్‌కు ఏడో రోజు ఏడో స్వర్ణం అందించాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం ఇదే. 23 ఏళ్ల పంజాబ్ మహాబలుడు ఆసియా వేదికపై సరికొత్త రికార్డు సైతం నెలకొల్పాడు. ఫస్ట్ రౌండ్‌లో ఇనుప బంతిని 19.96 మీటర్ల దూరం విసిరిన తూర్, చివరి ఐదో రౌండ్‌లో 20.75 మీటర్ల దూరం విసిరి ట్రాక్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. చైనా షాట్‌పుటర్ లియు యాంగ్, కజకిస్తాన్ షాట్‌పుటర్ ఇవాన్ ఇవనోవ్‌లను రజతం, కాంస్యాలకు పరిమితం చేసి తూర్ స్వర్ణం అందుకున్నాడు.
స్క్వాష్‌లో మూడు..
భారత స్క్వాష్ ఆటగాళ్లు వ్యక్తిగత విభాగాల్లో మూడు కాంస్యాలు సాధించాడు. పురుషుల సెమీస్‌లో సౌరవ్ ఘోషల్, మహిళల సింగిల్స్‌లో దీపికా పల్లికల్, జోత్స్న చిన్నప్పలు ఓటమి చవిచూసి కాంస్య పతకాలకు పరిమితమయ్యారు.
క్వార్టర్స్‌కు సింధు, సైనా
ఆసియా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో టాప్ ఇండియన్ షట్లర్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. శనివారం ఆతిథ్య ఇండోనేసియా షట్లర్లు గ్రెగోరియా మరిస్క టున్జుంగ్ (21-12, 21-15), ఫిత్రియాని (21-6, 21-14)లను మట్టి కరిపించిన ఇద్దరు షట్లర్లు అనూహ్య విజయాలతో క్వార్టర్స్ దశకు చేరుకున్నారు. తరువాతి మ్యాచ్‌లో సైనా థాయిలాండ్ నాల్గవ సీడ్ రాట్చ్‌నాక్ ఇంటనాన్ లేదా కొరియా షట్లర్ సంగ్ జి హ్యుయాన్‌తో తలపడనుంది. అలాగే పీవీ సింధు శ్రీలంక షట్లర్ కెవిడి సిరిమన్నగె లేదా థాయిలాండ్ షట్లర్ నాట్చియాన్ జిందపాల్‌తో తలపడనుంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో కామనె్వల్త్ రజత పతక విజేతలు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ద్వయం రెండో రౌండ్‌లో కొరియా జట్టు చోయ్ సోల్‌గ్యు, మిన్ హ్యుక్ కాంగ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు.
షూటింగ్..
కామనె్వల్త్ పసిడి పతక విజేత, పదిహేనేళ్ల భారత షూటర్ అనీష్ భన్వాలా పసలేని ఫాంతో నిరుత్సాహపర్చాడు. పురుషుల 25మీటర్ల రాపిడ్ ఫైర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో బరిలోకి దిగిన బన్వాలా ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోలేక ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. మరో షూటర్ శివమ్ శుక్లా సైతం పేలవమైన ప్రదర్శనే ఇవ్వడంతో ఇద్దరూ 9, 11వ స్థానాల నుంచి పతకం లేకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. ‘నిన్న తీవ్ర వత్తిడిలో ఉన్నమాట నిజమే. కానీ, ఈరోజు అలాంటి వత్తిళ్లేమీ లేవు. కాకపోతే నేనే సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయా. గేమ్‌లో ఒక్కోసారి ఇలాంటి పరిస్థితు ఎదుర్కోక తప్పదు’ అని మ్యాచ్ అనంతరం భన్వాలా వ్యాఖ్యానించాడు.
అధ్లెటిక్స్‌లో..
అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్లు ఆసియా చాంప్ మహమ్మద్ అనాస్, అరోకియా రాజీవ్‌లు సెమీస్‌కు చేరుకున్నారు. జాతీయస్థాయిలో రికార్డు సృష్టించిన అనాస్ 45.63 సెకండ్లలో పరుగు పూర్తిచేస్తే, రాజీవ్ 46.82 సెకండ్లలో పరుగులు పూర్తిచేసి సెమీస్ బరిలో నిలిచారు. హైజంప్‌లో చేతన బాలసుబ్రహ్మణ్య 2.15మీటర్లను అధిగమించి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించిన 13మందిలో ఏ ఒక్కరూ ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్ 2.20మీటర్లను అధిగమించలేకపోవడం గమనార్హం.
ఆసియా బ్రిడ్జి ఈవెంట్‌లో భారత పురుషుల, మిక్స్‌డ్ డబుల్స్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరి రెండు పతకాలను ఖాయం చేశాయి. 13 అర్హతా రౌండ్లను అధిగమించి పరుషుల జట్టు 4వ స్థానానికి చేరుకుంటే, ఏడు రౌండ్లలోనే మిక్స్‌డ్ డబుల్స్ జట్టు టాప్‌కు చేరుకుంది. ఒకటి నాలుగు, రెండు మూడు జట్లు సెమీస్‌లో పోటీ పడతాయి. దీంతో తదుపరి మ్యాచ్‌ల ఫలితాలతో పనిలేకుండానే పురుషుల, మిక్స్‌డ్ డబుల్స్ జట్లు రెండు కాంస్య పతకాలను ఖాయం చేశాయి.
శెభాష్ మహిళా హాకీ
మహిళా హాకీ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. ఆసియా టైటిల్ హోల్డర్స్ సౌత్ కొరియాను 4-1తో మట్టి కరిపించి ముచ్చటగా మూడో విజయంతో మురిపించింది. పూల్-బిలో శనివారం ద.కొరియా జట్టుతో హోరాహోరీ తలపడిన భారత మహిళా జట్టు ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. 16వ నిమిషంలో తొలి గోల్ సాధించి నవనీత్ కౌర్ భారత్‌ను ఆధిక్యంలో నిలబెడితే, గుర్జీత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో భారత్‌ను విజయపథానికి చేర్చింది. గ్రూప్‌లో మూడో విజయంతో సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు, 27న థాయిలాండ్ జట్టుతో తలపడనుంది. ఆదివారం పూల్-ఎలో భారత పురుషుల హాకీ జట్టు ద.కొరియా జట్టుతో తలపడనుంది.

చిత్రం..పసిడి సాధించిన తిజేందర్‌పాల్