క్రీడాభూమి

సింగ్.. సింధు.. రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: హర్యానాకు చెందిన 31 ఏళ్ల మన్జీత్ సింగ్ ఓ నిరుద్యోగి. జాతీయస్థాయిలో ఒక్క పతకాన్నీ సాధించిన రికార్డు లేదు. ఆసియా గేమ్స్‌లో 800 మీటర్ల పరుగుకు అర్హత సాధించినపుడూ అతనిపై ఆశలు లేవు. ఫైనల్స్‌కు అర్హత సాధించినపుడూ పతకం సాధించగలడన్న నమ్మకం కుదరలేదు. కానీ ఫైనల్ బీట్‌లో మన్జీత్ అనూహ్య వేగాన్ని ప్రదర్శించాడు. భారత్ తరఫున ఫేవరెట్‌గా దిగిన జిన్సన్ జాన్సన్‌ను అధిగమించాడు. 1:46:15 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి స్వర్ణం సాధించాడు. దీంతో జిన్సన్ జాన్సన్ రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఒకే ఈవెంట్‌లో స్వర్ణం, రజతం సాధించి భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ‘జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్స్‌ని వీడియోల్లో చూసేవాడిని. నా పరుగుతో పోల్చుకుని తప్పులు సరిచేసుకునేవాడిని. ఎదగాలన్న తపనే నాకు ప్రేరణ. బాగా పరిగెత్తాలనుకున్నా. జాతీయస్థాయి రికార్డు సాధిస్తాననుకోలేదు. నేనో నిరుద్యోగిని. నన్ను ఈ విధంగా తయారు చేసిన నా కోచ్ ఆర్మీ ఉద్యోగి’ అని విజయానందాన్ని వ్యక్తం చేశాడు హర్యానా రైతు కుటుంబానికి చెందిన మన్జీత్ సింగ్. 4 ఇంటూ 400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలోనూ భారత్ సత్తా చాటింది. బహ్రెయిన్‌తో అథ్లెట్లతో బరాబరి పోరు సలిపిన భారత (మహ్మద్ అనాస్, ఎంఆర్ పూవమ్మ, హిమదాస్, అరోకియారాజీవ్) జట్టు 4 సెకండ్లు వెనకబడి 3:15:71 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి రజతాన్ని కైవసం చేసుకుంది. అయితే ఫలితానికి సంబంధించి బహ్రెయిన్ అథ్లెట్లపై భారత బృందం ఫిర్యాదు చేయడంతో, తుది నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్నారు. భారత అథ్లెట్ల వాదనకు బలం చేకూరితే స్వర్ణం దక్కించుకునే అవకాశం లేకపోలేదు. ద.కొరియాతో సమవుజ్జీ పోరాటం సలిపిన భారత ఆర్చర్లు, కలిసిరాని అదృష్టం కారణంగా రజతాలకు పరిమితమయ్యారు. పురుషులు, మహిళల ఆర్చరీ కాంపౌండ్‌లో ప్రత్యర్థులతో సమానమనిపించుకున్నా, తుది నిర్ణయంలో ద.కొరియానే అదృష్టం వరించింది. మంగళవారంనాటి ఈవెంట్లలో భారత్‌కు దక్కిన ఆశ్చర్యకర విజయం మహిళల కురష్‌లో రజతం, కాంస్యం. 52 కేజీ విభాగంలో పింకీ బలహారా రజతాన్ని సాధిస్తే, మలప్రభ యల్లప్ప జాదవ్ కాంస్యాన్ని కైవసం చేసుకుంది. నిజానికి ఇద్దరు అథ్లెట్లదీ కిట్లు కూడా కొనుక్కోలేని స్థితి. ‘మా ఊళ్లో ప్రజలంతా చందాలు వేసుకుని 1.75 లక్షలతో నాకు శిక్షణ ఇప్పించారు. వాళ్ల సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ అవకాశమంటూ దొరికితే మ్యాచ్‌లన్నీ వాళ్ల కోసమే ఆడతా’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పుకొచ్చింది బలహారా. ఇక టీటీ సెమీఫైనల్స్‌లో కొరియాపై ఓటమి చవిచూసిన భారత ఆటగాళ్లు కాంస్యాన్ని సాధించారు. స్క్వాష్, హాకీలో భారత్ తన విజయాల నమోదును కొనసాగించింది. హాకీలో 20 గోల్స్‌తో శ్రీలంకను మట్టి కరిపించిన పురుషుల జట్టు మొత్తం లీగ్ మ్యాచ్‌లో 76 గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మహిళల బాక్సింగ్ 60కేజీ, 57కేజీ విభాగంలో భారత బాక్సర్లు పవిత్ర, సోనియా లాథర్‌లు మెరుగైన ప్రదర్శన ఇవ్వలేక క్వార్టర్ ఫైనల్స్ నుంచి తప్పుకున్నారు. వాలీబాల్‌లోనూ భారత పురుషుల జట్టు పాకిస్తాన్‌పై 1-3 స్కోరుతో ఓటమి చవిచూసింది.

సిల్వర్ సింధు!
పసిడి ఫలితం దక్కకున్నా ‘సిల్వర్ సింధు’ మంగళవారం సరికొత్త రికార్డు సాధించింది. ఆసియా ఉపఖండం వేదికపై వెండి పతకాన్ని సాధించిన షట్లర్‌గా భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త పేజీ సృష్టించుకుంది. దశాబ్దాల కలను సాకారం చేస్తూ బాడ్మింటన్ మహిళా విభాగంలో వ్యక్తిగత ‘వెండి’తో హైదరాబాదీ సింధు భారత జెండాను రెపరెపలాడించింది. మ్యాచ్ మ్యాచ్‌కూ వేగం, బలం పెంచుకుంటూ అలుపెరుగని విజయాలతో ఫైనల్స్‌కు చేరిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, వరల్డ్ నెంబర్ 1 ఆటగత్తె ముందు మాత్రం తలొంచక తప్పలేదు. మంగళవారం జరిగిన బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీ షట్లర్ తై జు యింగ్‌తో సాగిన వీరోచిత పోరాటంలో సమవుజ్జీగా నిలిచినా, ఆమె అనుభవం ముందు హైదరాబాదీ నిలవలేకపోయింది. 34 నిమిషాల హోరాహోరీ పోరులో 13-21, 16-21 సెట్లతో తై జుకే విజయాన్ని అప్పగించింది. స్వర్ణ ఫలితం తారుమారైనా.. ఆసియా బాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్‌కు చేరిన ఏకైక భారత షట్లర్‌గా రికార్డు సాధించడమే కాదు, బాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో ‘వెండి’ సాధించిన షట్లర్‌గానూ చిరస్థాయి రికార్డులను సింధు సొంతం చేసుకుంది. దీంతో స్వర్ణం చేజారినా.. బాడ్మింటన్ మహిళా సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ సాధించిన విజయాలతో భారత్‌కే రజతం, కాంస్యం దక్కాయ.

‘గురి’తప్పిన స్వర్ణం
రజతం సాధించిన ఆనందం. స్వర్ణం చేజార్చుకున్న విచారం. భారత విలుకాళ్లను వెంటాడుతున్న రెండు ఫీలింగ్స్. 18వ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఖాయంగా స్వర్ణం అందిస్తారనుకున్న జట్లలో ఆర్చరీ జట్లు ఒకటి. పురుషుల, మహిళల విభాగాల్లో ఉత్తమ రికార్డులతో ఆసియా మైదానంలోకి అడుగుపెట్టిన ఆర్చర్లు, ఆదినుంచీ బాణాలను స్వర్ణానికే గురిపెట్టారు. ఆటుపోట్లు ఎదుర్కొంటూ, ప్రత్యర్థులను చిత్తుచేస్తూ ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో.. ఇక భారత్‌కు స్వర్ణం ఖాయమనే నమ్మకాలు బలపడ్డాయి. భారత్ నమ్మకాన్ని చిదిమేస్తూ ప్రత్యర్థిగా బరిలోవున్న ద.కొరియా విలుకాళ్లు స్వర్ణాన్ని ఎగరేసుకుపోయారు. అటు మహిళలు, ఇటు పురుషుల కాంపౌండ్ ఆర్చరీ పోటీలో రెండు స్వర్ణాలనూ ద.కొరియా జట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. పురుషుల విభాగంలో ప్రత్యర్థులతో సమాన ‘గురి’ని భారత జట్టు ప్రదర్శించినా, దురదృష్టం వెక్కిరించటంతో స్వర్ణం చేజారింది. పురుషుల ఫైనల్స్‌లో రెండు జట్లూ 229-229 స్కోరు సాధించి సమం కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు షూటౌట్‌కు అవకాశం కల్పించారు. షూటౌట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, ద.కొరియాలు 29 షాట్స్‌తో సమంకావడంతో బుల్స్ ఐ (ఇన్నర్ 10)ని పరిగణనలోకి తీసుకుని ఫలితాన్ని నిర్ణయించి ద.కొరియాను విజేతగా ప్రకటించారు. ఇక మహిళా కాంపౌండ్ ఆర్చరీలోనూ భారత జట్టు సమర్థ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే ఫైనల్ సెట్ (58-55)లో చిన్నచిన్న పొరబాట్లతో భారత జట్టు మూడు పాయింట్లు (228-231) వెనకపడటంతో స్వర్ణాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. ‘గతంకంటే భారత ఆర్చర్ల ఫాం మెరుగవ్వడం ఒకింత ఆనందకరమైన విషయం. వాతావరణం, గాలివాటం కూడా ఆర్చర్లను ఇబ్బంది పెట్టింది. ఫైనల్ సెట్ చివరి క్షణం వరకూ జట్టు మొత్తం సమష్టిగానే పోరాడాం. కానీ, అదృష్టం వాళ్లను వరించింది. ఆర్చర్లకు కేంద్రం అందిస్తున్న సహకారం మర్చిపోలేనిది’ అని 22ఏళ్ల ఆర్చర్ సురేఖ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.