క్రీడాభూమి

చేజారిన స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 31: 36ఏళ్లుగా ఎదురు చూసిన కలను సాకారం చేసుకోవడంలో భారత మహిళా హాకీ జట్టు విఫలమైంది. దాదాపుగా ఖాయమైన స్వర్ణాన్ని అందుకునే ప్రయత్నంలో దారుణంగా విఫలమైంది. ఆరంభం నుంచీ అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు, శుక్రవారం ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌పై 1-2తో ఓటమిపాలైంది. దీంతో 18వ ఆసియా గేమ్స్‌లో స్వర్ణాన్ని చేజార్చుకోవడమే కాదు, టోక్యో 2020 ఓలింపిక్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్నీ చేజార్చుకుంది. మినామి షిమ్జు, మోటోమోరి కవముర 11, 44 నిమిషాల్లో సాధించిన పెనాల్టీ కార్నర్ గోల్స్‌తో భారత్ కథ అడ్డం తిరిగింది. 25వ నిమిషంలో నేహా గోయల్ సాధించిన ఒక్క గోల్ వినా, భారత స్టార్ ప్లేయర్లు మరెవరూ గోల్స్ సాధించలేకపోవడంతో.. 1982 నుంచీ కంటున్న కల మరోసారి కలగానే తెల్లారిపోయింది. నిజానికి సెమీ ఫైనల్స్‌లో చైనాపై భారత్ గెలిచి ఫైనల్స్ చేరడం 20ఏళ్ల తరువాత సాధ్యమైన అపురూప విజయం. స్వర్ణాన్ని అందుకోవాల్సిన సమయంలో ఈ విజయాలేవీ అక్కరకు రాకపోవడం భారత్‌ను నిరుత్సాహపర్చేదే. ఇదిలావుంటే, ఇప్పటికి మూడుసార్లు రన్నరప్‌గానే నిలిచిన జపాన్ జట్టు, శుక్రవారంనాటి విజయంతో పసిడి కలను సాకారం చేసుకోవడమే కాదు, వచ్చే టోక్యో 2020 ఒలింపిక్‌కు నేరుగా అర్హత సాధించారు. గురువారంనాటి సెమీఫైనల్స్ పోరులో పురుషుల హాకీ జట్టు సైతం మలేసియా జట్టుపై ఓటమికి గురవ్వడంతో భారత హాకీ ప్రభ మసకబారినట్టయ్యింది.

వికాస్ కృష్ణన్‌కు కాంస్యం
భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ (75 కేజీ) ఆసియా గేమ్స్ సెమీఫైనల్ బౌట్ నుంచి తప్పుకున్నాడు. ప్రీ క్వార్టర్స్ బౌట్‌లో కంటి పైభాగంలో తీవ్ర గాయమైనప్పటికీ క్వార్టర్ ఫైనల్స్ ఆడిన వికాస్, చైనా బాక్సర్ ట్యుహెటా హెర్బికె టగ్లాతిహన్ చేతిలో మరింత గాయపడటం తెలిసిందే. 26ఏళ్ల స్టార్ బాక్సర్ శుక్రవారం సాయంత్రం సెమీఫైనల్స్‌లో కజకిస్తాన్ బాక్సర్ అమన్‌కుల్ అభిల్‌ఖాన్‌తో తలపడాల్సి ఉంది. అయితే, గాయంతో ఆడటం మంచిదికాదన్న వైద్యుల సూచనతో తప్పుకున్నట్టు భారత బృందంలోని అధికారులు తెలిపారు. దీంతో వికాశ్ కాంస్యానికే పరిమితమయ్యాడు. ఆసియా గేమ్స్‌లో (2010 గాంగ్జులో లైట్‌వెయిట్ విభాగంలో స్వర్ణం, 2014 ఇంచియాన్ గేమ్స్ మిడిల్ వెయిట్ క్యాటగిరీలో కాంస్యం, ఇప్పుడు కాంస్యం) మూడు పతకాలు సాధించిన బాక్సర్‌గా వికాశ్ రికార్డు సాధించాడు.

స్వర్ణం దిశగా..
తిరుగులేని విజయాలతో ఎనిమిదిసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించిన మలేసియా స్క్వాష్ స్టార్ నికోల్ డేవిడ్‌కు భారత్ స్టార్ ప్లేయర్ జోత్స్న చిన్నప్ప చెక్‌పెట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మలేసియా జట్టును భారత జట్టు 2-0 స్కోరుతో ఓడించి రెండో విజయంతో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. టీం ఈవెంట్‌లో భాగంగా నికోల్‌తో సింగిల్స్ ఆడిన చినప్ప అద్భుత ఫాంతో చాంపియన్‌ను మట్టికరిపించి భారత జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఫైనల్‌లో హాంకాంగ్ జట్టుతో తలపడబోయే భారత జట్టు (జోత్స్న చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్, సునన్య కురువిల్ల, తన్వీఖన్నా) స్వర్ణంపై దృష్టి పెట్టింది. శుక్రవారం మ్యాచ్‌ల్లో అద్భుత ఫాం ప్రదర్శించిన భారత జట్టు, ఫైనల్స్‌లో స్వర్ణం కైవసం చేసుకోవడం ఖాయమన్న నమ్మకాలు కలుగుతున్నాయి. ఇదిలావుంటే, పురుషుల స్క్వాష్ సెమీఫైనల్స్‌లో హాంకాంగ్ జట్టుతో తలపడిన భారత జట్టు 0-2తో ఓడి కాంస్య పతకానికి పరిమితమైంది. సౌరవ్ ఘోషల్, హరీందర్ పాల్ సంధు, రమిత్ టాండన్, మహేష్ మంగోంకర్ పేలవమైన ప్రదర్శనతో హాంకాంగ్ జట్టు చేతిలో ఓటమి చవిచూశారు.

టీటీలో మెరుగు
ఆసియా గేమ్స్‌లో భారత టీటీ ఆటగాళ్లు రెండు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. శరత్‌కమల్, జి సతియన్, మనేకా బాత్రా శుక్రవారం టీటీ వ్యక్తిగత విభాగం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూడటంతో ఆసియా గేమ్స్‌లో భారతపర్వం ముగిసింది. టీటీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ శరత్ కమల్ శుక్రవారం వరల్డ్ 14వ ర్యాంకర్, చైనీస్ తైపీ ఆటగాడు చిహ్యూన్ చినాగ్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఇక 19వ ర్యాంకర్, జపాన్ ఆటగాడు కెంట మట్సుడైరాతో తలపడిన 39వ ర్యాంకర్ సతియన్ ఓటమిని చవిచూడక తప్పలేదు. ఇక భారత తాజా సంచలనం మనేకా బాత్రా, చైనా ప్రత్యర్థి, వరల్డ్ ఫిఫ్త్ ర్యాంకర్ వాంగ్ మన్యుతో తలపడి ఓటమి చవిచూసింది. అయినప్పటికీ ఉపఖండం క్రీడాపోరులో (పురుషుల జట్టు, మిక్స్‌డ్ డబుల్స్ జట్టు) రెండు కాంస్య పతకాలతో భారత్ అద్భుత ప్రదర్శనే చేసింది.

సెయిలింగ్‌లో మూడు
ఆసియా గేమ్స్ సెయిలింగ్ మహిళల 49ఈఆర్ ఎఫ్‌ఎక్స్ ఈవెంట్‌లో భారత సెయిలర్లు వర్ష గౌతమ్, శే్వత షెర్వెగర్ రజతాన్ని సాధించారు. ఓపెన్ లేజర్ ఈవెంట్‌లో హర్షిత తోమర్ కాంస్య పతకాన్ని సాధించింది. 49ఈఆర్ పురుషుల ఈవెంట్‌లో వరుణ్ థక్కర్ అశోక్, చెంగప్ప గణపతి కెలపండ జట్టు 15వ రేస్‌తో 53 పాయింట్లు సాధించి కాంస్యాన్ని సొంతం చేసుకుని భారత్ పతకాల సంఖ్యకు మరో మూడు పతకాలు చేర్చారు. ‘దేశానికి పతకం సాధించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా’ అని ఓపెన్ లేజర్ ఈవెంట్ 12 రేసుల్లో 62 పాయింట్లు సాధించి కాంస్యాన్ని సొంతం చేసుకున్న పదహారేళ్ల వర్షిత వ్యాఖ్యానించింది.