క్రీడాభూమి

శ్రీలంకతో మొదటి టెస్టులో న్యూజిలాండ్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యునెడిన్, డిసెంబర్ 14: శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని న్యూజిలాండ్ 122 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మ్యాచ్ నాలుగోరోజు, ఆదివారం ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా, చివరి రోజున అదే పరిస్థితి ఉంటుందేమోనని ఆశించిన లంకకు నిరాశ తప్పలేదు. 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఆదివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు, సోమవారం ఆటను కొనసాగించి 282 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మేండిస్ (46), దినేష్ చండీమల్ (58), చివరిలో వితనాగే (38) లంకను రెండో ఇన్నింగ్స్‌లో ఆదుకోవడానికి విఫలయత్నం చేశారు. మిగతా వారంతా విఫలం కావడంతో లంకకు పరాజయం తప్పలేదు. భారీ విజయాన్ని నమోదు చేసిన కివీస్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో అజేయంగా 109 పరుగులు సాధించిన గుప్టిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 96.1 ఓవర్లలో 431 ఆలౌట్ (మార్టిన్ గుప్టిల్ 156, కేన్ విలియమ్‌సన్ 88, బ్రెండన్ మెక్‌కలమ్ 75, నువాన్ ప్రదీప్ 4/112).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 117.1 ఓవర్లలో 294 ఆలౌట్ (కరుణరత్నే 84, దినేష్ చండీమల్ 83, టామ్ సాంట్నర్ 3/71, వాగ్నర్ 3/87).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 65.4 ఓవర్లలో 3 వికెట్లకు 267 డిక్లేర్ (టామ్ లాథమ్ 109 నాటౌట్, కేన్ విలియమ్‌సన్ 71, మార్టిన్ గుప్టిల్ 46, రంగన హెరాత్ 2/62).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 405): 95.2 ఓవర్లలో 282 ఆలౌట్ (కుశాల్ మేండిస్ 46, చండీమల్ 58, వితనాగే 38, టిమ్ సౌథీ 3/52, సాంట్నర్ 2/53, వాగ్నర్ 2/56, బౌల్ట్ 2/58).

శామ్యూల్స్ బౌలింగ్‌పై
సస్పెన్షన్ వేటు
దుబాయ్, డిసెంబర్ 14: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లొన్ శామ్యూల్స్ బౌలింగ్‌పై ఏడాది పాటు సస్పెన్షన్ వేటును విధిస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక ప్రకటనలో తెలిపింది. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. బంతుల వేసే సమయంలో చేతి వంపును 15 డిగ్రీల వరకూ అనుమతిస్తామని, కానీ, శామ్యూల్స్ చేతి వంపు అంతకంటే ఎక్కువగా ఉందని వివరించింది. బయోమెట్రిక్ పరీక్షలోనూ ఈ విషయం నిర్ధారణ అయిందని తెలిపింది.

మానసిక నిపుణుడితో
సైనాకు మేలు
బాడ్మింటన్ మాజీ ఆటగాడు ప్రకాష్ పదుకొనె
ముంబయి, డిసెంబర్ 14: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వచ్చే ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించాలంటే క్రీడా మానసిక నిపుణుడి అవసరం ఎంతైనా ఉందని మాజీ ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ ప్రకాష్ పదుకొనె అభిప్రాయపడ్డాడు. ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరిపైనా ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సాధారణ పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించడం సులభమని, కానీ, మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మానసిక నిపుణుల అవసరం ఉంటుందన్నాడు. పివి సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ తదితరులకు కూడా ఓలింపిక్స్‌లో పతకాలను గెల్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. కీలక సమయాల్లో సైనా ఒత్తిడికి గురవుతున్నదని, ఫలితంగా మ్యాచ్‌లను కోల్పోతున్నదని ప్రకాష్ అన్నాడు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మానసిక నిపుణడి సూచనలు అవసరమని చెప్పాడు. ఒలింపిక్స్‌లో ఆడే సమ యంలో మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలని పదుకొనె అన్నాడు. క్రీడల్లో రాణించడానికి కోచ్ లు, ట్రైనర్లు, ఫిజియో థెరపిస్టుల అవసరం ఎలా ఉంటుందో మానసిక నిపుణుల ఆవసరం కూడా అంతే ఉంటుందన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశాలు భారత్‌కు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ప్రత్యేకించి మహిళల సింగిల్స్‌లో గట్టిపోటీనచ్చే సత్తా సైనా, సింధులకు ఉందన్నాడు. డ్రాపై కూడా విజయావకా శాలు ఆధారపడి ఉంటాయని పదుకొనె తెలిపాడు. పురుషుల విభాగంలో కశ్యప్, శ్రీకాంత్ వంటి వారి నుంచి పతకాలను ఆశించవచ్చని అన్నాడు. అయతే, వారి ఫిట్నెస్ స్థాయని కూ డా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.

భారత్‌తో సిరీస్‌కు తెర!

పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టీకరణ

కరాచీ, డిసెంబర్ 14: భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌కు తెరపడినట్టేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ వ్యాఖ్యానించాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంట
ర్వ్యూలో అతను మాట్లాడుతూ గత ఏడాది కుదు
ర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలన్న ఆసక్తి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల్లో కనిపించడం లేదని విమర్శించాడు. ఈ సిరీస్‌పై భారత్ స్పందించలేదని, కాబట్టి ఆ దేశంతో ఏ స్థాయి టోర్నీల్లోనూ మ్యాచ్‌లు ఆడబోమని స్పష్టం చేశాడు. బిసిసిఐ అధికారికంగా ఆహ్వానించినందుకే ఇటీవల తాము చర్చల కోసం భారత్‌కు వెళ్లామని అన్నాడు. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తనకు ఫోన్ చేసి, భారత్ రావాల్సిందిగా కోరవడంతో తాను వెళ్లానని అన్నాడు. కానీ, అక్కడ తమ సమావేశం జరగలేదని తెలిపాడు. పాక్ జట్టు హోం సిరీస్‌ను భారత్‌లో ఆడాల్సిందిగా మనోహర్ సూచించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోనే సిరీస్ జరగాల్సి ఉందనే విషయాన్ని తాను స్పష్టం చేశానని అన్నాడు. సిరీస్‌లను చాలాకాలంగా తాము యుఎఇలోనే ఆడుతున్నామని తెలిపాడు. ఒప్పందం ప్రకారం యుఎఇలో భారత్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, అంకు భిన్నంగా భారత్‌లో సిరీస్ ఆడాలని కోరడంలో ఔచిత్యం లేదని అన్నాడు. ఇటీవల దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సమావేశం జరిగినప్పుడు మనోహర్‌ను కలిశానని, శ్రీలంకలో సిరీస్ ఆడాల్సిందిగా అతను కోరాడని షహర్యార్ తెలిపాడు. అందుకు పిసిబి సానుకూలంగా స్పందించిందని చెప్పాడు. అదే విధంగా ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నాడు. కానీ, భారత్ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదని, ఈ పరిస్థితుల్లో సిరీస్ జరుగుతుందన్న నమ్మకం ఆవిరైపోతున్నదని చెప్పాడు. ఇప్పుడు కాకపోతే, కనీసం మరో ఏడాది వరకూ భారత్‌తో సిరీస్ సాధ్యం కాదని తేల్చిచెప్పాడు.

నిషేధిత ఐపిఎల్ జట్ల క్రికెటర్లకు

డ్రాఫ్ట్ నేడు

ముంబయి, డిసెంబర్ 14: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందడి మళ్లీ మొదలవుతున్నది. ఈ టోర్నీలోకి తాత్కాలికంగా చేరి, రెండేళ్లు ఆడనున్న పుణె, రాజ్‌కోట్ జట్లకు క్రీడాకారులు డ్రాఫ్టింగ్ మంగళవారం ఇక్కడి బికెసి క్లబ్ హౌస్‌లో జరుగుతుంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై లోధా కమిటీ రెండేసి సంవత్సరాల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. చెన్నై మాజీ సిఇవో గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలను జీవితకాలం సస్పెండ్ చేసింది. లోధా కమిటీ నిర్ణయంతో రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ స్థానంలో ఐపిఎల్‌లో పాల్గొనేందుకు ఈనెల ఎనిమిదో తేదీన ‘రివర్స్ బిడ్డింగ్’ విధానంలో పుణే, రాజ్‌కోట్ జట్లను ఖరారు చేసిన విషయం కూడా విదితమే. చెన్నై, రాజస్థాన్ జట్లలోని ఆటగాళ్లను కొత్త జట్లు ఎంపిక చేసుకోవడానికి వీలుగా ఐపిఎల్ నిర్వాహణ కమిటీ మంగళవారం డ్రాఫ్ట్‌ను నిర్వహించనుంది. చెన్నై, రాజస్థాన్ జట్లకు చెందిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారిని ఒక గ్రూపుగానూ, ఆడని వారిని మరో గ్రూపుగానూ విభజించి, డ్రాఫ్ట్‌లో వేలానికి ఉంచుతారు. ఒక్కో జట్టు ఆరుగురు ఆటగాళ్లను ఇందులో ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, ఆజింక్య రహానే వంటి మేటి క్రికెటర్లు డ్రాఫ్ట్‌లో స్టార్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయం. ఇలావుంటే, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్ల నుంచి రెండు ఫ్రాంచైజీలు మొదట ఎంపిక చేసుకున్న వారికి 12.5 కోట్ల రూపాయలు చొప్పున లభిస్తాయి. ఆతర్వాత నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లకు వరుసగా 9.5 కోట్లు, 7.5 కోట్లు, 5.5 కోట్లు, 4 కోట్ల రూపాయలు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలని ఐపిఎల్ నిర్వాహణ కమిటీ ముందుగానే ధరను ఖాయం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడని వారికి నాలుగు కోట్ల రూపాయల వరకూ చెల్లించవచ్చని పేర్కొంది. మంగళవారం నాటి డ్రాఫ్టింలో 33 మంది భారతీయులు, 17 మంది విదేశీ క్రీడాకారులు
వేలానికి ఉంటారు. అమ్ముడుకాని ఆటగాళ్లకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న బెంగళూరులో వేలం నిర్వహిస్తారు.
ఇలావుంటే, డ్రాఫ్టింగ్‌లో మొదట ఆటగాడిని ఎంపిక చేసే అవకాశం పుణె ప్రాంచైజీకి లభిస్తుంది. సహజంగానే ఆ జట్టు ధోనీవైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అయితే, అతని పట్ల పుణె ఆసక్తిని ప్రదర్శించాలన్న నిబంధన ఏదీ లేదు. మొదట పుణె, ఆతర్వాత రాజస్థాన్ తమతమ మొదటి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. అనంతరం రెండో ఆటగాడిని ఎంచుకోవడానికి కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. కాగా, ధోనీతోపాటు చెన్నై నుంచి రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వెయిన్ బ్రేవో, బ్రెండన్ మెక్‌కలమ్ వంటి మేటి క్రీడాకారులు చెన్నై జట్టులో ఉన్నారు. రాజస్థాన్ తరఫున ఆజింక్య రహానే, స్టీవ్ స్మిత్, ఇటీవలే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన షేన్ వాట్సన్ తదితరులు ఆడారు. మొదటి ఆటగాడిగా పుణె, రాజస్థాన్ జట్లు ధోనీ, అశ్విన్, రహానే, మెక్‌కలమ్ వంటి హేమాహేమీల్లో ఎవరిని ఎంపిక చేసుకుంటాయన్నది ఆసక్తిని రేపుతున్నది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అసాధారణ ప్రతిభ కనబరచి, అత్యధికంగా 31 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన అశ్విన్‌కు డిమాండ్ బాగానే ఉంటుందని విశే్లషకులు అంటున్నారు.
గుజరాత్‌కు చెందిన రాజ్‌కోట్ రవీంద్ర జడేజా హోం గ్రౌండ్. కాబట్టి రాజ్‌కోట్ ఫ్రాంచైజీ అతనిని ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకూ జరిగే తొమ్మిదో ఐపిఎల్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరుతున్నప్పటికీ, ఆటగాళ్లు మాత్రం పాతవారే. వారిలో ఎవరికి ఏ జట్టులో అవకాశం లభిస్తుందనేది ఒక్కటే ఆసక్తిని రేపుతున్న అంశం. చెన్నై ఆటగాళ్లను పుణె, రాజస్థాన్ ఆటగాళ్లను రాజ్‌కోట్ టోకుమొత్తంగా తీసుకున్నా ఆశ్చర్యం లేదు.

జపాన్ చేరిన
బార్సిలోనా హీరోలు
టోక్యో, డిసెంబర్ 14: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) క్లబ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో గాంగ్జూ ఎవెగ్రేండ్‌తో తలపడేందుకు బార్సిలోనా జట్టు ఇక్కడికి చేరుకుంది. అనంతరం ఆటగాళ్లంతా యొకహమాలో తమకు బస ఏర్పాటు చేసిన హోటల్ చేరుకున్నారు. కాగా, లియోనెల్ మెస్సీ, నేమార్, లూయిస్ సౌరెజ్ వంటి స్టార్లను చూడడానికి, వారి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. విమానాశ్రయంతోపాటు క్రీడాకారులు బస చేసిన హోటల్ వద్ద కూడా అభిమానులు వందల సంఖ్యలో కనిపించారు. ఈనెల 17న జరిగే సెమీ ఫైనల్‌లో ఆడనున్న బార్సిలోనాకు ఫైనల్‌లో స్థానం లభించడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కాగా, మరో సెమీ ఫైనల్ ఈనెల 16న జరుగుతుంది. సాన్‌ఫ్రాసే హిరోషిమా, రివర్ ప్లేట్ జట్లు ఒసాకాలో ఢీ కొంటాయి. ఆరేళ్ల కాలంలో మూడోసారి టైటిల్ కోసం బార్సిలోనా ప్రయత్నిస్తున్నది.

లండన్ క్లాసిక్ చెస్
విశ్వనాథన్ ఆనంద్‌కు
తొమ్మిదో స్థానం
లండన్, డిసెంబర్ 14: లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తొమ్మిదో స్థానంతో సంతృప్తి చెందాడు. చివరి రౌండ్‌లో అనీష్ గిరితో తలపడిన ఆనంద్ గేమ్‌ను డ్రాగా ముగించాడు. దీనితో అతను 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు. కాగా, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు టైటిల్ దక్కింది. చివరి రౌండ్‌లో అలెక్సాండర్ గ్రిస్చుక్‌ను ఓడించిన అతను 5.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించి టైటిల్ అందుకున్నాడు.