క్రీడాభూమి

ప్రాక్టీస్‌లో అదరగొట్టిన టీమిండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌తో నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దుకాగా, రెండో రోజైన గురువారం నాటి ఆటను టీమిండియా బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకుంది. నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలతో రాణించి, ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపారు. ఓపెనర్‌గా వచ్చిన లోకేష్ రాహుల్ మనోసారి విఫలం కావడాన్ని మినహాయిస్తే, భారత బ్యాటింగ్ ఎలాంటి ఒడిదుడులు లేకుండా సజావుగా సాగింది. మొత్తం మీద 92 ఓవర్లు ఆడిన భారత జట్టు 358 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (66), చటేశ్వర్ పుజారా (54), కెప్టెన్ విరాట్ కోహ్లీ (64), అజింక్య రహానే (56), హనుమాన్ విహారీ (53) అర్ధ శతకాలను నమోదు చేయగా, రోహిత్ శర్మ 40 పరుగులు చేశాడు. సీఏ ఎలెవెన్ బౌలర్లలో ఆరోన్ హార్డీ 50 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చాడు. జాక్సన్ కోల్‌మన్, ల్యూక్ రోబిన్స్, డానియల్ ఫాలిన్స్, డిఆర్చీ షార్ట్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
మొదటి రోజు ఆట వర్షార్పణంకాగా, రెండో రోజు ఆట ఎంత వరకు కొనసాగుతుందనే అనుమానలు తలెత్తాయి. అయితే, వర్షం తగ్గడంతో ఆట సాధ్యమైంది. ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి, పరుగుల కోసం తంటాలు పడుతున్న లోకేష్ రాహుల్ 18 బంతులు ఎదుర్కొని, మూడు పరుగులు చేసి జాక్సన్ కోల్‌మన్ బౌలింగ్‌లో మాక్స్ బ్రయాంట్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. పృథ్వీ షా 69 బంతుల్లోనే 66 పరుగులు చేసి, డానియల్ ఫాలిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని స్కోరులో 11 బౌండరీలు ఉన్నాయి. పుజారా 89 బంతుల్లో 54 చేస్తే, అందులో ఫోర్లు ఆరు. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న కెప్టెన్ కోహ్లీ 87 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 64 పరుగులు చేసి ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్‌లో పాతుకుపోయి, సిసలైన టెస్టు ఫార్మాట్ ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే 123 బంతుల్లో 56 పరుగులు సాధించి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. తెలుగు తేజం హనుమ విహారీ 88 బంతుల్లో, ఐదు ఫోర్లతో 53 పరుగులు సాధించి, డిఆర్చీ షార్ట్ బౌలింగ్‌లో ఎల్‌బీగా పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 55 బంతుల్లో 40 పరుగులు చేసిన తర్వాత ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో హెన్రీ నీల్సెన్‌కు దొరికిపోయాడు. రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ పరుగుల ఖాతాలు తెరవకుండానే ఔటయ్యారు. భారత్ ఆలౌటయ్యే సమయానికి వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కేవలం నాలుగు ఓవర్ల ఆట సాధ్యమైంది. డిఆర్చీ షార్ట్ (10), మాక్స్ బ్రియాంట్ (14) నాటౌట్‌గా నిలవగా, సీఏ ఎలెవెన్ వికెట్ నష్టం లేకుండా 24 పరుగులు చేయగలిగింది.