రాష్ట్రీయం

నలుగురు మావోల ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 26: దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మంగళవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా నలుగురు మృతి చెందారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సుకుమా జిల్లా పరిధిలోని బస్తర్ డివిజన్ అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా చింతల్‌నార్-జేగురుకొండ పోలీసుస్టేషన్ల పరిధిలోని కర్కాన్‌గూడ గ్రామ సమీపంలో ఉన్న బోదాకోడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా అడవుల్లో మంగళవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. హోరాహోరీ సాగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. ఇద్దరు మహిళలు సహా నలుగురి మృతదేహాలు కాల్పుల ప్రదేశంలో లభ్యమయ్యాయని పేర్కొన్నారు. ఒక ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్స్ 2, బర్మార్ 1, మందుపాతరలు స్వాధీనం చేసుకున్నామని, తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చేపడుతున్నామని తెలిపారు. కాగా రెండురోజుల క్రితం ఈ ప్రాంతంలోనే వారపు సంతకు వెళ్తున్న వ్యాపారులను మావోయిస్టులు అపహరించి తీసుకెళ్తుండగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెంబడించి రక్షించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని, ఈ క్రమంలో దండకారణ్యంలో తనిఖీలను ముమ్మరం చేశామని ఐజీ తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు మావోలకు కూడా తీవ్ర గాయాలయ్యాయని, వారు కూడా చనిపోయి ఉంటారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా చత్తీస్‌గఢ్‌లోని కొండెగావ్ జిల్లా పోలీసులు మావోయిస్టుల ఎత్తులను చిత్తు చేశారు. ఈ జిల్లాలోని మర్లపాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని తుస్వాల్ గ్రామం సమీపంలో ఉన్న ఘనే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమై విధ్వంసానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం కొండెగావ్ పోలీసులు, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా దాడులు చేశాయి. సమావేశం జరుగుతున్న ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టగా కాల్పులు జరుపుకుంటూ మావోలు గుట్టలు, అడవుల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలంలో 30 దేశవాళీ గ్రైనేడ్లు, మందుపాతరలు స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 23 తేదీల్లో మొత్తం మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజా ఎన్‌కౌంటర్ జరిగిన సుకుమా జిల్లా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఇక్కడ తొలి దశలోనే పోలింగ్ జరగనుంది.

చిత్రం.. సంఘటనా స్థలంలో లభ్యమైన ఆయుధాలు